మీడియాలో యాజమాన్య మార్పులకు తగ్గట్టుగా సిబ్బందిలో మార్పు పెద్ద విశేషం కాదు. అయితే టీవీ9 మాత్రం ఏడాది సమయం తీసుకుని తీరిగ్గా తన పని పూర్తి చేస్తోంది. కొత్త యాజమాన్యానికి తగ్గట్టుగా పాత బ్యాచులో కొందరిని సాగనంపే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు తొలగింపు ఆదేశాలు జారీ కాగా, ఆ జాబితాలో ఇంకా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
అసోసియేటెడ్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పోరేషన్ సంస్థను శ్రీనిరాజు నిర్వహించినంత కాలం రవిప్రకాష్ ఆడింది ఆటగా సాగేది. ఆ సమయంలో సిబ్బంది విషయంలో సీఈవోకి సంపూర్ణ స్వేశ్ఛ ఉండేది. దానికి తగ్గట్టుగా రవి ప్రకాష్ అనుకున్న వారికే అవకాశం దక్కేది. కీలక స్థానాల్లో ఆయన అనుచరులే ఉండేవారు. కానీ యాజమాన్యం మారడం, మైహోమ్స్, మెఘా సంయుక్తంగా టీవీ9ని టేకోవర్ చేయడంతో సీఈవో పోస్ట్ నుంచి నాటకీయంగా రవిప్రకాష్ వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత రవిప్రకాష్ అనునాయులు ఒక్కొక్కరికీ ఊస్టింగ్ జరుగుతోంది.
ఇప్పటికే జాఫర్ వంటి వారు టీవీ9 నుంచి బయటకు వచ్చారు. డెస్క్ లో పనిచేసిన పలువురుకి నోటీసులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా రవిప్రకాష్ తో సన్నిహితంగా ఉంటూ, టీవీ9 అంతర్గత సమాచారం అతనికి చేరవేస్తున్నారనే సందేహాతో కొందరిని తొలగిస్తున్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టీవీ9 కథనాల విషయంలో నేటికీ పాత మేనేజ్ మెంట్ ఆలోచనలకు అనుగుణంగా వస్తున్నాయనే అంచనాలతో కూడా ఈ ప్రక్షాళన చేపట్టినట్టుగా భావిస్తున్నారు. యాజమాన్యం మాత్రం నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసు ఇచ్చి తొలగించేడానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలతో కొందరు పాతకాపులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. కొత్తవారికి తలుపులు తెరవడంతో ఆశావాహుల ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి.