ప్రేమకథలు ఎప్పుడూ ఒకే తరహాలో చెప్పాలన్న రూల్ ఏమి లేదు. కాస్త విభిన్నంగా అలోచించి ఆసక్తికరమైన అంశాలను జోడించుకుంటే మంచి సినిమాలు తీయొచ్చు. దానికి స్నేహమనే అందమైన కాన్సెప్ట్ ని జోడిస్తే అన్ని వర్గాలను మెప్పించే అవకాశం ఇంకా మెరుగవుతుంది. అలాంటి ఓ ఉదాహరణ చూద్దాం. 1995 కన్నడలో ‘అనురాగ సంగమ’ అనే సినిమా వచ్చింది. ఇది ఛార్లీ చాప్లిన్ ‘సిటీ లైట్స్’ని ఆధారంగా చేసుకుని ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు ఉమాకాంత్ దర్శకత్వంలో కుమార్ గోవింద్, రమేష్ అరవింద్ హీరోలుగా నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది. ఇక్కడా రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎస్ఆర్ఎస్ సంస్థ హక్కులు కొంది.
1997లో దీనికి శ్రీకారం చుట్టారు. ఫ్యామిలీ హీరోగా అప్పటికే లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జగపతి బాబు హీరోగా, రాశిని హీరోయిన్ గా తీసుకుని మరో ప్రధాన పాత్ర కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి ని ఎంచుకున్నారు. ఈ సినిమా చేసే టైంకి దర్శకులు కోడి రామకృష్ణ గారి ఫామ్ కొంత తగ్గింది. ఐదేళ్లు పెద్దగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ‘దొంగాట’ పర్వాలేదనిపించగా, ‘పెళ్లి’ పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండూ కూడా ఇతర బాషల సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకుని రూపొందించినవి. అందుకే అనురాగ సంగమను తెలుగు రీమేక్ ‘పెళ్లి పందిరి’ చేసే ప్రతిపాదనని ఒప్పుకోవడానికి కోడి రామకృష్ణ గారు పెద్దగా ఆలోచించలేదు. దీనికి తోటపల్లి మధు రచన చేశారు.
పెద్దగా మార్పులు చేయకుండా అదే కథను తీసుకుని మ్యూజిక్ కి పెద్ద పీఠ వేస్తూ వందేమాతరం శ్రీనివాస్ తో అద్భుతమైన పాటలు కంపోజ్ చేయించుకున్నారు. పేద ధనిక వర్గాలకు చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య కళ్ళు లేక పూలమ్ముకునే ఓ అమ్మాయి ప్రవేశిస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ మీద పెళ్లి పందిరి నడుస్తుంది. ముందు అంధురాలిగా తర్వాత చూపొచ్చే పాత్రలో రాశికి మంచి ప్రశంసలు దక్కాయి. అమాయకుడిగా రాజ్ కపూర్ స్టైల్ లో టోపీ సూటు వేసుకున్న క్యారెక్టర్ జగపతిబాబుకి బాగా నప్పింది. పృథ్వికి సైతం మంచి బ్రేక్ గా నిలిచింది. దోస్త్ మేర దోస్త్, నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా, ఇదే మంచి రోజు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ ముగ్గురి కెరీర్లకు పెళ్లి పందిరి మంచి మలుపునిచ్చింది.