“అహనా పెళ్ళంటా” సినిమాలో కోట శ్రీనివాసరావుకు కోడిమాంసం కూర తినాలని ఉంటుంది. కానీ దాన్ని కొనాలంటే ఎక్కువ ధర పెట్టాలని, కోడిని తనముందు వేలాడగట్టుకుని భోజనం తింటూ, కోడిమాంసం తిన్నంత తృప్తిని పొందుతాడు కోట శ్రీనివాసరావు. ఉల్లిపాయల ధర విషయంలో కూడా ఇప్పుడు ఇంచుమించు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఉల్లిపాయ కొని తినాలంటే సామాన్యులకు కుదిరే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే కిలో ఉల్లి ధర ఇంచుమించుగా కిలో చికెన్ ధరకు సమానం అయింది. అందుకే ఉల్లిపాయలను వంటలో వాడకుండా, భోజనానికి ముందు వేలాడగట్టుకుని ఉల్లిని చూస్తూ ఉల్లిని తింటున్న అనుభూతిని పొందుకునేలా పరిస్థితులు మారిపోయాయి.
ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ధనవంతుల జాబితా ప్రకారం ఇండియాలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ముఖేష్ అంబానీ అంటారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తన దగ్గర ఎక్కువ ఉల్లిపాయలున్న వాడే ఇండియాలో అత్యంత ధనవంతుడుగా పరిగణించే రోజు వచ్చింది. రెండు ఉల్లిపాయలిస్తే ఒక “ఐ ఫోన్” దొరుకుతుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందంటే ఉల్లి ధరలు ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. సాక్షాత్తు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తన వంటల్లో ఉల్లిని వాడటం లేదని ప్రకటించిందంటే ఉల్లి ధరల మంటకి అద్దం పడుతుంది. బెంగుళూరులో కొన్ని హోటల్స్ తమ మెనూలోనుండి “ఆనియన్ దోశను” తొలగించాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. దొంగలు కూడా డబ్బు బదులు ఉల్లిపాయలనే దోచుకుంటున్నారంటే ప్రస్తుతం దేశంలో ఉల్లికి ఉన్న డిమాండ్ తెలుసుకోవచ్చు. ఉల్లి ధరలు రేపిన సెగ ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పాత కాలం సామెత. కానీ ఉల్లి చేసే లొల్లి ఇంతింత కాదయా అనేది కొత్త సామెత. ఇప్పుడు దేశంలో ఉల్లి చేసే లొల్లి మాములుగా లేదు. గతంలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కూడా ఉల్లిపాయకు ఉంది. ఎమర్జెన్సీ సమయంలో వాజ్ పా య్ ప్రసంగాల మధ్యలో తన జేబిలో నుంచి ఉల్లిపాయ తీసి పెరిగిన ధరల గురించి మాట్లాడాడు. 2004 వ సంవత్సరంలో వాజ్ పాయ్ ప్రభుత్వం హాయంలో పెరిగిన ఉల్లి ధరలను సింబాలికగా ఉల్లి గడ్డలను విపక్షాలు ప్రచార సభలలో ప్రదర్శించాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఉల్లి ధరలు కూడా ఒక కారణం.ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఉల్లిధరలు గతంలో ఎన్నడూ లేనంతగా నింగికి దూసుకెళ్తున్నాయి తప్ప కిందికి దిగడం లేదు. ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు వస్తాయని అందరికి తెలుసు. కానీ కొంటే కూడా కన్నీళ్లొస్తాయని గతంలో నిరూపించింది. ఇప్పుడు కూడా నిరూపిస్తుంది.
పేదవాడినుండి ధనవంతుల వరకూ అందరి వంటల్లోను నిత్యావసరంగా ఉన్న ఉల్లిపాయ, ఇప్పుడు ధనవంతుల వంటల్లో కూడా కనుమరుగు అయ్యేంతగా ఉల్లి ధరలు అమాంతంగా పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో వర్షాల వల్ల ఉల్లిపంట పూర్తిగా దెబ్బతినడం, తెలుగు రాష్ట్రాల్లో పంట చేతికి రావడానికి ఇంకో నెల రోజుల సమయం ఉండటంతో ఉల్లి ధరలు తగ్గే పరిస్థితి కనబడటం లేదు. ప్రభుత్వం కూడా ఈజిప్టు నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి చర్యలు చేపట్టింది కానీ ఇంకా ఆ సరుకు దేశానికి చేరలేదు.రాష్ట్రంలో ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కానీ రైతు బజార్లలో నిర్ణీత సమయంలో మాత్రమే ఉల్లిని విక్రయిస్తుండటంతో ప్రజలు “క్యూ” లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర సెంచరీ(100) దాటేసి 120 కి చేరుకుంది. ఉల్లి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉల్లి ధర ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మన దేశ పరిస్థితే ఇలా ఉంటే మన దేశం నుండి ఉల్లిని దిగుమతి చేసుకునే పక్కదేశపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బంగ్లాదేశ్ లో10 రోజుల క్రితమే ఉల్లి ధర కిలో 220 కి చేరుకుంది. సాక్షాత్తు ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన వంటగదిలో ఉల్లిపాయలు వాడటం లేదని ప్రకటించిందంటే అక్కడ ఉల్లిధరల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. గతంలో ఉల్లి ధరలను నియంత్రించనందుకు కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం 2004 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. అప్పట్లో కిలో ఉల్లి 25 చేరినందుకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. కానీ ఇప్పుడు ఉల్లిధర 150 కి చేరువలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి ధరల పెరుగుదలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని గతంలో ఉల్లి ధరల వల్ల కూలిపోయిన ప్రభుత్వాలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పెరిగింది. కర్నూల్ మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 10 వేలు పలికి రికార్డు సృష్టించింది. రైతు బజార్ల ద్వారా ఉల్లిని తక్కువ ధరకే అంటే కిలో 25 కే అందించే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఉల్లిపాయలను కొని 25 కే అందించే ప్రయత్నాలను అధికారులు చేస్తున్నారు. కానీ నిర్ణీతసమయాల్లో మాత్రమే ఉల్లిని రైతు బజార్ల ద్వారా విక్రయిస్తుండటంతో రైతుబజార్లు లో ప్రజలు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. విదేశాల నుండి ఉల్లి దిగుమతులు పెంచి ప్రస్తుతం దేశంలో ఉన్న కొరతను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తే కొంతైన ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే,బంగారం వజ్రాలు వంటి విలువైన వస్తువుల జాబితాలోకి ఉల్లిపాయలు కూడా చేరే పరిస్థితి ఉంది. ఎలాగూ దొంగలు డబ్బును బదులు ఉల్లిపాయలను దొంగతనం చేస్తున్నారు కాబట్టి ఉల్లిని కూడా లాకర్లలో దాచుకునే పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి లేని కూరను తినడం ఎంత కష్టమో దాని ధరను చూసి మార్కెట్ వెళ్లి కొనుగోలు చేయాలని ప్రయత్నించడం కూడా అంతే కష్టంగా ఉంది.