రిజర్వుడు సీట్లలోనే ఆయా కులాల్లో తమ అనుకూలురికి అందలమిచ్చి, తామే పెత్తనం చేయడం ఓ ఆనవాయితీ. తమ చెప్పుచేతల్లో ఉన్న వారిని పేరుకి పదవుల్లో కూర్చోబెట్టిన మొత్తం పదవీ వ్యవహారాలు తామే చూడడం గ్రామీణ నేపథ్యంలో అందరికీ తెలిసిన సత్యం. చివరకు తమ పాలేర్లను సైతం సర్పంచులు, ఇతర పదవుల్లో నిలబెట్టి, తామే చక్రం తిప్పిన నేతలు చాలామందే ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. జగన్ జమానాలో సీన్ రివర్స్ అయ్యింది. రిజర్వుడు సీట్లలో భూస్వాముల బంట్రోతులను పదవుల్లో పెడితే, ఇప్పుడు అన్ రిజర్వుడు సీట్లలో కూడా ఎస్సీ, బీసీ, మహిళలకు అవకాశం ఇస్తున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు మూలం కాబోతోంది. గ్రామీణ వ్యవస్థలో అనేక ఏళ్ల నాటి వివక్ష రూపాలకు చెక్ పెట్టబెట్టబోతోంది.
పల్లెల్లో రాజకీయాలు కొందరు వ్యక్తుల చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇదే అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని బద్ధలు కొట్టే పనిలో జగన్ ఉన్నారు. ముఖ్యంగా బీసీలు, మహిళల విషయంలో జగన్ చూపుతున్న చొరవ ఓ రాజకీయ విప్లవంగానే కొందరు అభివర్ణిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సామాజికంగా అణచివేతకు గురయిన, అవకాశాలు లేక వెనుకబడిన వర్గాలకు పెద్ద పీఠ వేస్తున్నారు. చివరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల విషయంలో కూడా అదే పాటించారు. ఊళ్లో సర్పంచ్ పదవి, ఓ ఎంపీటీసీ స్థానంలో అలా చేశారంటే పెద్ద విశేషం లేదు. కానీ జిల్లా ప్రధమ పౌరుల విషయంలో కూడా జగన్ తన పంథాని వీడలేదు. జనరల్ సీట్లలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వడం విశేషం. మహిళలను ముందు పీఠాన నిలపడం గమనార్హం.
విజయనగరం, చిత్తూరు జెడ్పీ చైర్మన్లను జనరల్ సీట్లలో బీసీ వర్గాల వారికి ఇచ్చారు. ఇది ఓ కీలక పరిణామంగా చూడాలి. దానికి ముందే క్యాబినెట్ కూర్పులో కూడా బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించారు. ఎంపీపీ, మునిసిపల్ చైర్ పర్సన్ల విషయంలో కూడా అదే వైఖరి తీసుకున్నారు. ఇలాంటి ఓ పెద్ద మార్పు రాజకీయ సమీకరణాలను మార్చేసే అవకాశం ఉంది. రాజకీయాలు ఓ కొద్ది కులాలకో, ఏ కొద్ది వర్గాలకో పరిమితం కాకుండా అందరికీ అవకాశాలు దక్కే రోజులు వస్తాయనే ఆశాభావం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీపీగా రెల్లి కులస్తురాలికి అవకాశం ఇవ్వడం ఓ చరిత్ర. ఆ కులం నుంచి ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన ఘటన చరిత్రలో ఇదే ప్రధమం. అదొక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి అనుభవాలు అనేకం ఉన్నాయి.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఎస్టీ అని ఎవరైనా ఊహించారా.. ఆ సీటులో మహిళకు ఛాన్స్ దక్కుతుందని ఆశించారా..కానీ జగన్ దానిని ఆచరణలో చూపించారు. ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేశారు. అలానే రాష్ట్ర స్థాయి నుంచి మండల గ్రామ స్థాయి వరకూ ఈ ధోరణిలో పదవుల పంపిణీ సాగించారు. ఇది కులాల సమీకరణాల్లో కుదుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. వెనుకబడిన వర్గాల్లో కొత్త చైతన్యాన్ని నింపబోతోంది. రాబోయే రోజుల్లో మరింతగా జనరల్ స్థానాల్లో వివిధ వర్గాలు ముందుకు రావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేవలం రిజర్వుడు సీట్లు మాత్రమే తమవి, జనరల్ తాము నిలబడలేమనే దశ నుంచి జనరల్ సీట్లు అంటే అందరూ పోటీ పడవచ్చనే సంస్కృతిని ప్రవేశపెట్టిన జగన్ చొరవ ఏపీ చరిత్రలో కొత్త మలుపులకు మూలం కాబోతోంది. భవిష్యత్తు రాజకీయాల్లో మరింత ఆసక్తికర పరిణామాలకు ఇది దారితీస్తుందనడంలో సందేహం లేదు. ఈ రీతిలో చూస్తే జగన్ క్షేత్రస్థాయిలో అనేక అడ్డుగోడలు బద్ధలు కొట్టినట్టే భావించాల్సి ఉంటుంది.