iDreamPost
android-app
ios-app

తెలంగాణ బంద్ : స్తంభించిన హైదరాబాద్

తెలంగాణ బంద్ : స్తంభించిన హైదరాబాద్

తెలంగాణ ఆర్టీసీ సమ్మె లో భాగంగా కార్మికులు, వారికి మద్దతుగా వివిధ ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు నేడు తలపెట్టిన తెలంగాణ బంద్ తో రాజధాని హెదరాబాద్ నగరంలో జన జీవనం స్తంభించనుంది. గ్రేటర్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా ఆటోరిక్షాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బంద్‌ వల్ల వీటికీ బ్రేక్‌ పడనుంది.ఆటో డ్రైవర్లు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ప్రత్యేకించి అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సినవారు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు తదితరులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే  సమ్మె కారణంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన ఆసుపత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 

బంద్‌లో ఉబెర్, ఓలా క్యాబ్ లు… 

నగరంలో 50వేలకు పైగా ఉబర్, ఓలా తదితర క్యాబ్‌లు బంద్‌లో పాల్గొనున్న నేపథ్యంలో మరో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం స్తంభించనుంది. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 5వేలకు పైగా క్యాబ్‌లు కూడా నిలిచిపోనుండడంతో డోమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. 

వైద్య సేవలు యథాతథం

బంద్‌ నేపథ్యంలో శనివారం వైద్యసేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 108 అత్యవసర సర్వీసులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్‌ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.