ఆ వాచీ ఎంత…కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఏదీ మళ్లీ ఒకసారి చెప్పు…కేవలం రూ.226 కోట్లు మాత్రమే. అబ్బో ఎంత కేవలం రూ.226 మాత్రమే అన్నంతగా చెప్పావ్. అంతే మరి…కొన్నింటిని మనం డబ్బుతో వెలకట్టలేం. అంత సొమ్ము పెట్టి కొనడం వెనుక ఉద్దేశమే గొప్పది మరి.
ఏంటా కాస్ట్లీ వాచ్ కథా కమామీషూ…తెలుసుకోవాలనుకుంటున్నారా…అయితే ఆలస్యం ఎందుకూ, పదండి ముందుకు…
ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఖరీదైన వాచీగా పేరొందిన ఆ వాచీని స్విట్లర్జాండ్కు చెందిన ప్రసిద్ధ గడియారాల సంస్థ పటెక్ ఫిలిప్ తయారు చేసింది. దీనికి గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300ఎ-010 అనే పేరు పెట్టారు. ఈ సంస్థ ఇలాంటి వాచీని తయారు చేయడం బహుశా ఇదే మొదటిది, చివరిది కూడా కావచ్చు. ఎందుకంటే ఇది ఓ చారిటీ వేలం కోసం తీర్చిదిద్దింది.
ఒకప్పుడు మనకు వాచీలంటే వల్లమాలిన ప్రేమ. ఒకప్పుడు ఎవరైనా హైదరాబాద్, బెంగళూరో వెళుతుంటే ఓ వాచీని తీసుకురా అని డబ్బు ఇచ్చేవాళ్లం. ఇప్పుడైతే ఏ అమెరికానో, ఆస్ర్టేలియానో, ఇతర దేశాల నుంచి బంధుమిత్రాదులు వస్తుంటే ఓ వాచీ తీసుకురా అని చెప్పడమో లేక తమంతట తామే తీసుకు రావడం సహజాతి సహజం. టైం చూసుకునేందుకంటే కూడా వాచీలను ప్యాషన్‌గా వాడుతున్నారు. మారుతున్న ప్రస్తుత కాలంలో సెల్ఫోన్లు వచ్చిన తర్వాత దాదాపు వాచీలు కనుమరుగయ్యాయనే చెప్పాలి.
ఇక ప్రస్తుతానికి వద్దాం. జెనీవాలో ఇటీవల జరిగిన చారిటీ వేలంలో ఈ వాచీ 31 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్…మన కరెన్సీలో అక్షరాలా రూ. 226 కోట్లకు విక్రయించారు. స్టయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం ఈ వాచీ ప్రత్యేకత. అంతే కాదండోయ్ మామూలు చేతి గడియారానికి టైం చూపించే వర్తులం ఒకటే ఉంటుంది. ఈ వాచీలో రెండు వర్తులాలుండటం ప్రత్యేకత. ఒకటి గులాబీ బంగారు రంగులో ఉంటుంది. మరొకటి నల్ల ఎబోని రంగులో ఉంటుంది. ఇంకా అనేక ప్రత్యేకతలు కలిగి కథకథలుగా చెప్పుకునే ఖరీదైన ధరతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ వాచీని ఇంతకూ కొన్నదెవరనే విషయం తెలియక పోవడమే అసలు సిసలు ట్విస్ట్.