iDreamPost
iDreamPost
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం అసోం. అక్కడ అధికారం నిలబెట్టుకోవడం ఆపార్టీకి కీలకం. ఇప్పటికే బెంగాల్, పాండిచ్చేరి వంటి రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీకి అసోంలో అధికార నిలబెట్టుకునే ప్రయత్నంలో పలు అడ్డంకులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నార్సీ ఉద్యమ ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ బలహనీతలతో గట్టెక్కాలని ఆశిస్తున్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత అశనిపాతంగా మారుతుందా అనే అభిప్రాయం వినిపిస్తోంది.
అదే సమయంలో ఊహించని రీతిలో మిత్రపక్షం దూరం కావడం బీజేపీని బెంగపెట్టుకునేలా చేస్తోంది. అది కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత బంధం బీటలు వారడం బీజేపికి నష్టం చేకూరుస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కూటమి నుంచి వైదొలగింది. అదే సమయంలో నేరుగా కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒకటి తమ గూటి నుంచి వెళ్లిపోవడం అయితే… ఆవెంటనే ప్రత్యర్థితో చేతులు కలపడం కమలనాథులను కలవరపెడుతోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరబోతున్నట్లు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడు హగ్రమ మొహిలారిస్. స్పష్టం చేశారు శాంతి, ఐక్యత, అభివృద్ధి కోసం పని చేయడానికి, అస్సాంలో అవినీతి నిర్మూలనకు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజాత్‌తో బీపీఎఫ్ చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
బీపీఎఫ్ తమ నుంచి దూరం కావడం బీజేపీకి కొంత మేరకు నష్టం చేకూర్చే అంశమని బీజేపీనేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రీ పోల్స్ సర్వేలో అసోంలో హోరా హోరీ పోరు అనివార్యంగా కనిపిస్తోంది. అలాంటి సమయంలో మిత్రపక్షం దూరం కావడం బీజేపీకి నష్టం చేస్తున్నప్పటికీ దానిని అధిగమించేందుకు ఆపార్టీ ఏం చేస్తుందన్నది చర్చనీయాంశం అవుతోంది. ఈశాన్య భారతంలోని పెద్ద రాష్ట్రమైన అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా… అక్కడ మూడు విడతల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మొదటి విడతకు రెండు రోజుల్లో మార్చి 2న నోటిఫికేషన్ విడుదలవుతుంది. పోలింగ్ మార్చి 27వ తేదీన నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ ఒకటిన, మూడో విడత పోలింగ్ ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతాయి. కౌంటింగ్ మే రెండో తేదీన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అధికార బీజేపీ కి పరీక్ష మారబోతున్న ఈ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.