కోర్టు ఆదేశాలను పాటించడం తన బాధ్యతంటే, మరొకరేమో తానూ కమిషనర్‌గా పనిచేశానని, ఎప్పుడెలా వ్యవహరించాలో తెలుసునని, ఎంపీనైన తనకు చెప్పకుండా కూల్చివేత పనులు ఎలా చేస్తారని నిలదీత. ఇదీ అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఎంపీ రంగయ్య, కమిషనర్ ప్రశాంతి మధ్య చోటు చేసుకున్న వార్. అనంతపురం ఎంపీ రంగయ్య అధికార దర్పం ప్రదర్శించగా, కమిషనర్ ప్రశాంతి ఎంతో ప్రశాంతంగా రూల్స్ పాటిస్తున్నానంటూ ఎవరినీ లెక్క చేయని వైనం.
అనంతపురం కమిషనర్ వృత్తిలో భాగంగా ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా పనిచేస్తారని పేరు. గత నెలాఖరులో ఆమె సమీప బంధువు చనిపోయారని తెలిసి మధ్యాహ్నం మూడు గంటలకు హుటాహుటీన వెళ్లారు. అయితే పింఛన్ల ఫైల్‌పై సంతకం చేయకపోతే పేదలు ఇబ్బందిపడుతారని ఆమె ఆలోచించారు. ఆ మరుసటి రోజు ఉదయం పదిగంటల్లాకల్లా ఆఫీస్‌లో ఉండటం చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు. విధుల విషయంలో ఆమె నిబద్ధతకు ఇదే నిదర్శనం.
అలాంటి అధికారి నెలకుపైబడి సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం కలిగించే సంఘటన ఇటీవల చోటు చేసుకొంది.
అనంతపురం కలెక్టరేట్ సమీపంలోని సెరికల్చర్ కార్యాలయం ఎదుట భవనాలు అక్రమ నిర్మాణాలని కోర్టు తేల్చింది. దీంతో వాటిని కూల్చి వేసేందుకు నగర కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఈ నెల 13వ తేదీ కూల్చేందుకు నగరపాలక సిబ్బంది సిద్ధమై వెళ్లారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుండగా అనంతపురం ఎంపీ రంగయ్య రంగప్రవేశం చేశారు.
తానూ కమిషనర్‌గా పనిచేశానని, ఎప్పుడేది చేయాలో తనకు తెలియదా అని నగరపాలక సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలోఉన్న ఏపీపీ సుబ్బారావుతో ఎంపీ మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకే పడగొడుతున్నామని ఏసీపీ చెప్పారు. ఏసీపీ సమాధానంతో ఎంపీ సంతృప్తి చెందలేదు.
ప్రజాప్రతినిధులకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా తొలగించడం ఏంటని ఆయన నిలదీశారు. అనంతరం ఎంపీ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాడు. వారిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మళ్లీ ఉన్నతాధికారుల వద్ద కూడా ఎంపీ అవే ప్రశ్నలు. ప్రజాప్రతినిధులమైన తమకు తెలియకుండా అక్రమ కట్టడాల పేరుతో ఎలా తొలగిస్తారని నిలదీత.
చివరికి ఎంపీ పంతమే నెగ్గింది. తాత్కాలికంగా నాలుగురోజుల పాటు కూల్చివేత పనులు నిలిపేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నగర కమిషనర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని తెలిసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తుంటే అడ్డుకోవడం ఏంటనేది ఆమె ప్రశ్న.
ఈ నెల 14న ఆమె మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, నెలరోజులకు సెలవు పొడిగించుకున్నారు. కాగా అహుడా వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ కావాల్సి వచ్చింది. అప్పట్లో కర్నూలు కమిషనర్‌గా ప్రశాంతిని బదిలీ చేశారు. ఓ నిజాయితీ అధికారి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సెలవుపై వెళ్లిందని అనంతపురంలో చర్చ జరుగుతోంది. మున్ముందు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.