iDreamPost
iDreamPost
రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలలో ప్రచారం కోసం బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా పలువురు ఇతర ప్రాంత నాయకుల్ని ప్రచారానికి రప్పిస్తుంది బిజెపి రాష్ట్ర నాయకత్వం . అయితే ఇలా ప్రచారానికి వచ్చే నేతలు గతంలో సీమ ప్రాంతానికి కానీ , చిత్తూరు జిల్లా అభ్యున్నతికి కానీ కృషి చేసిన వారు కాకపోగా సీమకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన వారు కావడం గమనార్హం .
సముద్రంలో వృధాగా కలుస్తున్న మిగులు జలాలని ఒడిసిపట్టి రాయలసీమకి మళ్లించి ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చటానికి వైసీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచే ప్రయత్నం చేస్తే దాని వలన తెలంగాణాకు అన్యాయం జరిగిపోతుంది అంటూ నానాయాగీ చేసి కేంద్ర జలశక్తి సంఘ్ కి పిర్యాదు చేసిన బిజెపి పార్టీ తెలంగాణా నేత బండి సంజయ్ ని ఇదే రాయలసీమకి తలమానికం అయిన తిరుపతి ప్రచారానికి పిలిపించటంలోనే ఈ ప్రాంతం పట్ల వారికున్న చులకన భావనని తెలియజేస్తుంది .
కేవలం సముద్రంలో కలిసే వరద నీటిని తప్ప నికర జలాల మల్లింపు సాధ్యం కూడా కానీ రాయలసీమ ఎత్తిపోతలకు దుర్మార్గంగా అడ్డుపడ్డ బండి సంజయ్ లాంటి ప్రాంతీయవాదిని తిరుపతి ప్రచారానికి పిలిపిస్తున్న బిజెపి నాయకత్వం , బండి సంజయ్ చేత సీమవాసులకు క్షమాపణ చెప్పించండి . రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా కేంద్ర జలశక్తి సంఘానికి ఇచ్చిన పిర్యాదు వాపసు తీసుకొని తిరుపతి ప్రచారం కోసం సీమలో అడుగు పెట్టమని చెప్పండంటూ సీమవాసులు చేస్తున్న డిమాండ్ కి ఏమి సమాధానం చెబుతారో చూడాలి .
అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పట్ల సోము వీర్రాజు వైఖరి స్పష్టం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది . ప్రాజెక్ట్ ఆవశ్యకత , దాని వలన ఓనగూరే ప్రయోజనాలు వివరిస్తూ కేంద్ర జల శక్తి సంఘ్ కి లేఖ రాయాలి . అనుమతులు తేవటానికి కృషి చేయాలి . అంతేగానీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాం , స్పెషల్ ప్యాకేజి ఇస్తాం అంటూ ప్రచారం చేసుకొని ఎన్నికలు గడిచాక మొహం చాటేస్తుంటే ఎల్లకాలం ప్రజలు నమ్మరు అన్నది వీర్రాజు గ్రహించి చిత్తశుద్ధితో వ్యవహరించాలి .
Also Read : ఏ రాజకీయాలకీ వ్యాఖ్యలు… పవన్ కాషాయికరణ జపం
పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదాని మీరు అధికారంలోకి వచ్చాక అంపశయ్య ఎక్కించారు . 14 వ ఆర్ధిక సంఘ నిబంధనలు ఒప్పుకోవు స్పెషల్ ప్యాకేజి ఇస్తామని వంచించారు . ప్రస్తుతం పుదుచ్చేరి ఎన్నికల కోసం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ సాక్షాత్తు మీ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . ఏపీకి హోదా ఇవ్వటానికి అడ్డు వచ్చిన నిబంధనలు పుదుచ్చేరి విషయానికి వచ్చేసరికి అడ్డు తప్పుకొన్నాయా . లేదు 14 వ ఆర్ధిక సంఘం కాలపరిమితి ముగిసింది . ఇప్పుడు 15 వ ఆర్ధిక సంఘం ( నీతి ఆయోగ్) నిబంధనల ప్రకారం పుదుచ్చేరికి ఇస్తున్నాం అంటారా , ఏపీకి అదే ప్రకారం హోదా ఇవ్వండి . తిరుపతి వెంకన్న సాక్షిగా ఇదే గడ్డ పై నాటి ప్రతిపక్ష నాయకుడు మోడీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చని ఈ నాయకులు ఎదో అభివృద్ధి చేసేస్తాం , వేల కోట్లు కుమ్మరిస్తామనటం హాస్యాస్పదంగా ఉంది . బీహార్ ఎన్నికల ముందు లక్షన్నర కోట్ల ప్యాకేజి , ఏపీకి రెండున్నర లక్షల కోట్ల ప్యాకేజి , లాక్ డౌన్ నుండి దేశం కోలుకోవటానికి ఇరవై లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించి ఆనక మొండి చెయ్యి చూపించిన బిజెపి అగ్రనేతల ప్యాకేజీలు , నిధుల కబుర్లు ఎల్లకాలం నమ్మి మోసపోవటానికి ప్రజలేమీ అమాయకులు కాదు .
రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా కేంద్రానికి పిర్యాదు చేసి , తెలంగాణా రాష్ట్రంలో నల్ల జెండాలు ఎగరేయించిన కరుడు గట్టిన ప్రాంతీయ వాది మతం ముసుగులో ప్రచారం చేయించటానికి అదే సీమ గడ్డ పై ప్రచారానికి పిలిపిస్తున్న ఆంధ్రా బిజెపి నేతలు కేవలం మత పరమైన విద్వేష వ్యాఖ్యలతో కొంత ఓటు బ్యాంక్ పెంచుకోవటానికి తప్ప ఇంకోకందుకు కాదు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష ప్రజాభిమానం కలిగిన మహా నేత , దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణాన్ని అవహేళన చేస్తూ మాట్లాడి ప్రజాగ్రహానికి గురయ్యి తర్వాత క్షమాపణ చెప్పిన రఘునందన్ , గత ఎన్నికల సమయంలో పదే పదే సీమ గూండాలు , కడప రౌడీల తాట తీస్తా , తోలు వలుస్తా . పులివెందుల వారికి అధికారం ఇస్తే పచ్చని గోదారి జిల్లాలు వల్లకాడు అవుతాయి అంటూ ఈ ప్రాంతం పై తీవ్ర విద్వేష భావం పెంపొందించే ప్రయత్నం చేసిన నటుడు పవన్ కళ్యాణ్ లాంటి వారిని ప్రచారానికి తీసుకొచ్చి ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలు మరింత గాయపరచటమే కానీ మతపరమైన వ్యాఖ్యలతో , ఆలయాల పై దుష్ప్రచారాలతో ఆంధ్రాలో ఒక్క ఓటు కూడా అదనంగా పొందలేరు అన్నది పలుమార్లు నిరూపితమైనా కొందరు నాయకుల తీరు మారకపోవటం బాధాకరం . నీటి మూటల్లాంటి కబుర్లు చెప్పటం మాని హోదా కోసం , రాయలసీమ ఎత్తిపోతల కోసం బిజెపి స్థానిక నేతలు అధిష్టానాన్ని కోరి వాటి సాఫల్యానికి కృషి చేసి తరువాత ప్రజా తీర్పు కోరాలి .
Also Read : తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు?