ఈ సారి కూడా చలి గాలులు వేడెక్కేలానే ఉన్నాయి..లేదా వేడెక్కిస్తూ ఉడికిస్తూ కొందరిని ఉస్సూరుమనిపిస్తూ ఉన్నాయి. ఈసారి కూడా మనం అనుకున్నంత పరిణితిలో రాజకీయ పక్షాలు లేవనే చెప్పాలి..కొన్నేళ్ల తరబడి నలుగుతున్న ఓ యుద్ధం కాస్త చల్లారిందనుకునేలోపే మళ్లీ తెరపైకి తెచ్చింది వైరి పక్షం. రాజధాని ని ఎస్టేట్ బిజినెస్‌లకు అనుగుణంగా తమ ఎస్టేట్‌లను కూడా అందులో కలిపి రాజకీయం, వ్యాపారం అన్నీ ఏకతాటిపై నడిపిన గత ప్రభుత్వ పెద్దలకు ఈ సారి ఈ నిర్ణయాలు కొన్ని మింగుడు పడడం లేదు. పోనీ గడిచిన 14 ఏళ్ల రాజకీయంలో వైరి పక్షంలో ఇప్పుడయితే ఉన్నారు సరే నాటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం సాధించారో కొన్ని అయినా వివరించండీ ప్రజలకు. పోనీ మీ మాటలు ఉన్నది ఉన్నట్లు రాసే మీ అనుకూల మీడియాకే మీ ధోరణి ఏంటో వివరించి, ఆ విధంగా అయినా ఈ వెనుక బడిన ప్రాంతాలకు మీరేం చేశారో చెప్పి, ముందుకు పొండి..
అప్పుడూ ఇప్పుడూ శ్రీకాకుళానికి ఏం కావాలో చూద్దాం
– ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్ సెంటర్ ఇవ్వండి
– ఈ ప్రాంతానికి ఏటా ఒక మెగా జాబ్ మేళా లేదా రెండు మూడు విడతల్లో అయినా ఉపాధి కల్పనలకు అవకాశం ఇచ్చేలా చేయండి
– ఈ ప్రాంతానికి ముందు కాలుష్య కాసార పరిశ్రమలను నిలుపుదల చేయించండి.. లేదా కాలుష్య నివారణ చర్యలకు ముందుకు రండి..
– రక్షిత నీరు అందించలేని స్థితిలో ఇవాళ శ్రీకాకుళం మున్సిపల్ సిబ్బంది ఉన్నారు..అదేవిధంగా మేజర్ పంచాయతీల్లోనూ ఇదే
దుః స్థితి ఇలాంటి దయనీయతను దూరం చేయండి.
– ఆమదాలవలస లో స్టేషన్ ఆధునికీకరణ సరే.. ప్రధాన రహదారుల అభివృద్ధే లేదు. అలానే ఒక్క స్థానిక అవసరతలను గమనించి,
వాటికి అనుగుణంగా స్థానిక పంటల సాగుకు ప్రోత్సాహకాలు అందించండి.
– వ్యవసాయ సంబంధ పరిశోధన రంగానికి మరింత ఊతం ఇవ్వండి.
– జీడి ఉత్పత్తుల మార్కెటింగ్ కు కాస్త అయినా చొరవ చూపండి..
– ప్రధాన రైల్వే స్టేషన్లుగా పేర్కొనే ఆమదాలవలస, పలాస స్టేషన్ల అభివృద్ధికి చొరవ చూపండి
– జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ లో సైతం ఆధునిక వైద్యం అందని దయనీయతను దూరం చేయండి
– ఉద్దానం ఒక్కటే కాదు పొందూరు, రణస్థలం తదితర ప్రాంతాలు కూడా కిడ్నీ వ్యాధి పీడిత ప్రాంతాలే
– ఇక్కడ ప్రధాన సమస్య భూగర్భ జలాలు తీవ్ర స్థాయిలో కలుషితం అయిపోతుండడం.. వద్దన్నా అణు ఫ్యాక్టరీ కొవ్వాడకు వస్తుంది..
ఇంతలోనే మరో ముప్పు అక్కడ ఆక్వాసాగు, దీనిని నిలువరించండి
– అక్కడే కాదు ఇవాళ టెక్కలి తదితర ప్రాంతాల్లోనూ ఆక్వాసాగు యథేచ్ఛగా సాగిపోతోంది.
– యువతకు ఉపాధి, మహిళలకు సాధికారత అన్నవి వెనుకబడిన ప్రాంతాలలో అత్యావశ్యకం. ఏటా ఊరు వదిలిపోతున్న వలసల
నివారణకు ఇదే తక్షణ ఉపాయం.
– ఉపయోగం లేని సంక్షేమ కన్నా ఉపయోగం ఉంటే అభివృద్ధిపైనే మనసు లగ్నం చేస్తే మేలు. దయచేసి డబ్బులు పంచే స్కీంలు
ఆపండి.. ఏం కాదు.. వాటి వల్ల తక్షణ సాంత్వన ఉంటుంది ప్రయోజనం ఉండదు.
– దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలంటే ఇప్పటి స్థానిక అవసరాలను నెరవేర్చాలి, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి
– ఆన్ లైన్ విధానాన్ని మరింత పటిష్టం చేయాలి
కొత్తగా ఏర్పాటు చెయ్యబోతున్న కార్యనిర్వాహక రాజధానితో పాటు ఇవన్నీ చేస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది.
ఎలానూ ఉత్తరాంధ్రలో మూడు ఐటీడీఏలు ఉన్నాయి. వాటి బలోపేతానికి సరిగా కృషి చేయక, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి వాటిని అనుకూలంగా మలుచుకోక మళ్లీ మళ్లీ రాజకీయ పెత్తనం అన్నది ప్రధాన ధ్యేయం అయితే ఫలితాలు ఆశించిన విధంగా వెల్లడికి నోచుకోవు. గడిచిన కొన్నేళ్లుగా శ్రీకాకుళం అభివృద్ధికి నోచుకున్న దాఖలాలు అంతంతే! అణు విద్యుత్ ఫ్యాక్టరీలు మాత్రం సులువుగా ఏర్పాటవుతాయి. వాటి పేరిట జరిగే రాజకీయం కూడా సులువుగానే సాగిపోతుంది. తప్ప ఈ ప్రాంతానికి ఏ రాజకీయ పార్టీ
పూర్తిగా ప్రయోజన పూర్వకంగా చేసిందేమీ లేదు.
జిల్లా కేంద్రంలో ఎప్పుడో మొదలయిన సమీకృత కలెక్టర్ కార్యాలయం ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉంది. గొప్పగా చెప్పుకునే బీఆర్ఏయూ బాలారిష్టాల్లోనే ఉంది. రిమ్స్ పనితీరు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విద్యా వైద్యం ఈ రెండూ ప్రధానాంశాలుగా తీసుకుని కేంద్ర ప్రాయోజిక పథకాల నిధులను వీటికే ప్రత్యేకంగా కేటాయించి, వీటి ఉన్నతికి కృషి చేయాలన్న ప్రధాన డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నా, సరైన స్ధాయిలో నిరసనలు కానీ ఉద్యమాలు కానీ లేనందున నాయకుల హామీల ఏవీ అమలుకు నోచుకోవడం లేదు.
కనీసం ఒక్కో ప్రజాప్రతినిధి ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో వాటి అభివృద్ధికి సమయం వెచ్చిస్తే చాలు కొంతలో కొంత అయినా చెప్పుకోదగ్గ మార్పు ను ఆశించగలం. కేవలం ఫొటో సెషన్లు, ప్రెస్ మీట్లుకు మాత్రం నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా పరిమితం అవుతున్నారన్నది ఓ విమర్శ. నిర్థిష్ట కార్యాచరణలో గత ప్రభుత్వం విఫలం అయింది. ఇప్పటి జగన్ సర్కార్ అయినా ఆ పొరపాటును పునరావృతం చేయకుంటే మేలు. జిల్లా కో స్కిల్ డెవలప్ సెంటర్ వస్తే మంచిదే కానీ వాటి నిర్వహణ, ఉద్యోగ, ఉపాధి కల్పన సంబంధిత భరోసా అన్నవి నిరంత రం ఉన్నత స్థాయీ వ్యక్తుల పర్యవేక్షణతోనే సాధ్యం అన్న సంగతి మరువకూడదు. స్థానిక ప్రభుత్వాల బలోపేతం అన్నది జరిగితే, ఇప్పటి గ్రామ సచివాలయ వ్యవస్థ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపగలిగితే కాస్తయినా జిల్లాకేంద్రాలలో నిర్వహించే స్పందన తరహా కార్యక్రమాలకు బాధితుల తాకిడి తగ్గుతుంది. స్థానికంగా ఉంటే నాయకులు, అధికారులు సమన్వయంతో ఉంటేనే ఇది ఆచరణ కు నోచుకుంటుంది. ఇవన్నీ జరిగితేనే మూడు రాజధానులు ఆలోచన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.