మహారాష్ట్రలో గత నెల రోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన కు తెరదించుతూ అనూహ్య పరిణామాల మధ్య ఈ రోజు ఉదయాన్నే ఉపముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ తన తండ్రి అడుగులను అనుసరించి ఉంటే ఈ రోజు బాలీవుడ్ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే అందుకు విరుద్ధంగా తన పినతండ్రి “శరద్ పవార్” అనుసరించిన రాజకీయ బాటను ఎంచుకుని అజిత్ పవార్ నేడు మహారాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపులకు కారణభూతునిగా నిలిచాడు.
అజిత్ పవార్ 1959 జూలై 22న శరద్ పవార్ సోదరుడైన అనంత్ పవార్ కు జన్మించాడు. అతని తండ్రి వి. శాంతారాం దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసేవారు. అజిత్ పవార్ ప్రాథమిక విద్య నభ్యసించే నాటికే వారి బాబాయి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. తండ్రి అకాల మరణంతో అజిత్ పవార్ రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమైనది. అజిత్ పవార్ చిన్న నాటి నుండే వారి తాత గారైన గోవింద్ పవార్,పిన తండ్రి శరద్ పవార్ లు స్థానికంగా ఉన్న రైతు సహకార సంఘాలకు నాయకత్వం వహిస్తూ రైతు నాయకులుగా ఎనలేని కీర్తి గడించారు. ఈ పరిణామాలన్నింటిని సునిశితంగా గమనించిన అజిత్ పవార్ తాను కూడా నాయకునిగా ఎదగాలని, ఏ నాటికైనా తన పినతండ్రి లాగా జనాదరణ పొందాలని అనుకునేవాడు.
శరద్ పవార్ రైతు నాయకుడిగా,సహకార సంఘాలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న తీరు అజిత్ పవార్ కు స్పూర్తి గా నిలిచింది. ఈ క్రమంలోనే 1982 వ సంవత్సరంలో సహకార చక్కెర బోర్డుకు ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. తర్వాత కాలంలో 1991లో పూనే డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంక్ కు ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం బారామతి లోక్ సభ సభ్యునిగా కూడా ఎన్నుకోబడ్డారు. అయితే తన పినతండ్రి కోసం తన లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకొన్నాడు. ఆ సమయానికి శరద్ పవార్ పీవీ మంత్రివర్గంలో కేంద్ర రక్షణ మంత్రి. అనంతరం వరుసగా1991,1995,2004,2009,2014 లలో ఆ రాష్ట్ర శాసనసభ కు ఎన్నికవుతూ వచ్చారు. తదనంతర కాలంలో శరద్ పవార్ ముఖ్యమంత్రి కాగా ఆయన మంత్రి వర్గంలో అజిత్ పవార్ పలు కీలక మంత్రిత్వశాఖలు నిర్వహించారు. 1999 లో సోనియా గాంధీ విదేశీయురాలు అన్న భావనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించారు.
బాబాయికి కుడిభుజం లాగా ఉండే అజిత్ పవార్ కూడా ఆయననే అనుసరించారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర లో కాంగ్రెస్, ఎన్సీపీ ల హంగ్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో అజిత్ పవార్ అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అజిత్ పవార్ నీటిపారుదల శాఖా మంత్రిగా ఉండగా ఆ శాఖలో వేలకోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో అది ఆయన రాజీనామాకు దారి తీసింది. 2004లోనే తన ఆస్తులు మూడుకోట్ల రూపాయలున్నాయని ఎన్నికల కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం. 2012 వ సంవత్సరంలో అజిత్ పవార్ భారీగా అవినీతికి పాల్పడ్డారని, అక్షరాలా 70,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మహారాష్ట్ర బ్యూరోక్రాట్ విజయ్ పంథారే ఆరోపించారు. ఆ ఆరోపణలు ఋజువు కాకపోవడంతో ఉపముఖ్యమంత్రి గా తిరిగి నియమించబడ్డాడు. 2013 లో మహారాష్ట్ర లో కరువు విలయతాండవం చేస్తున్న రోజులలో పూనే లో కొంతమంది కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తుంటే డ్యామ్ లలో నీళ్ళు లేనపుడు మూత్రం పోయాలా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పారు. 2014 పార్లమెంట్ ఎన్నికలలో తన అన్న కూతురు సుప్రియా సూలే కు ఓటు వేయకపోతే మీ ప్రాంతానికి నీటి సరఫరా ఆపివేస్తామంటూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎప్పటినుండో మహారాష్ట్ర కు ముఖ్యమంత్రి కావాలనే కలలు కనే అజిత్ పవార్ గత ఎన్నికల సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలే కు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో ఒకింత నిరాశకు గురయ్యాడు. శరద్ పవార్ తరువాత ఎన్సీపీ పగ్గాలు తన చెప్పు చేతులలో ఉంటాయనుకొనే తరుణంలో సుప్రియా సూలే ఆగమనం అజిత్ పవార్ ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. అయినప్పటికీ తన అసంతృప్తి ని ఎక్కడా బయట పెట్టకుండా నివురు గప్పిన నిప్పులాగా బాధను అణిచిపెట్టుకుని ఉండేవాడు. నెల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో ముదిమి వయసులోనూ శరద్ పవార్ కాలికి బలపం కట్టుకుని తిరగడంతో 54 సీట్లు వచ్చాయి. బీజేపీ ని అధికారంలోకి రానీయకుండా విశ్వప్రయత్నాలు చేసిన శరద్ పవార్ ఫలితాల అనంతరం మోదీతో కలిసి రహస్య చర్చలు జరపడం కొసమెరుపు. ఇప్పుడు కాకపోతే మరెప్పడూ ఈ అవకాశం రాదని,అదును కోసం వేచి చూస్తున్న అజిత్ పవార్ అమిత్ షా మంత్రాంగంతో తన అనుకూల సభ్యులతో పావులు కదిపి ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశాడు