iDreamPost

నెల్లిమర్ల నెత్తుటి బావుటా

నెల్లిమర్ల నెత్తుటి బావుటా

నేడు నెల్లిమర్ల సంస్మరణ దినోత్సవం. జనపనార పరిశ్రమ విస్తరిస్తున్నా నేటికీ నెల్లిమర్ల కార్మికుల జీవితాల్లోకి వెలుగులు మాత్రం ప్రసరించడంలేదు. భవన నిర్మాణ కార్మికుల కంటే తక్కువ కూలీకి పని చేయాల్సి వస్తోంది.

ఇరవైఐదు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున కార్మికోద్యమ చరిత్రలో ” నెల్లిమర్ల” నెత్తుటి మైలు రాయిగా మారింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్ మిల్ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జరిగిన రైల్ రోకోపై పేలిన పోలీసు తూటాలకు ఐదుగురు కార్మికులు మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరు గంటలకు పైగా పట్టువదలక పట్టాలపై నుంచి కదలని ఆడామగా, పిల్లాపాపలకు గట్టి గుణపాఠం చెప్పాలనే ప్రభుత్వం చీకటి పడగానే కాల్పులు జరిపించింది. పోరాడే ప్రజలే నాయకత్వాన్ని తయారు చేసుకుంటారనే ఇంగితం లేని పాలకులు ఆ పోరాట నేతను మట్టుపెట్టాలని యత్నించారు. అయినా బతికి బయటపడి నాటి పోరాట స్మృతులను కలబోసుకోడానికి రచయిత మిగిలి ఉన్నాడంటే కారణం… రెండు వేల మంది మహిళలు నిర్మించిన మానవ రక్షణ కవచమే. ఒంటి మీది రవికను తీసి, ఎర్ర జెండాను చేసి ఎగరేసిన నాటి మహిళా పోరాట చైతన్యం రెండు దశాబ్దాల తర్వాత నేటికీ స్ఫూర్తిని కలుగజేస్తుంది. రెండేళ్లకు పైగా సాగిన నెల్లిమర్ల కార్మికోద్యమంలో సాధారణ గృహిణులైన మహిళలు నిర్వహించిన వీరోచిత పాత్రకు తగిన గుర్తింపు లభించలేదు.

బోనస్ బకాయిల వంటి డిమాండ్లను పోరాడి సాధించుకున్న కార్మిక సంఘటిత శక్తిని దెబ్బతీసే కుట్రతో మిల్లు యాజ మాన్యం 1992 జూన్ 1న మిల్లును మూసేసింది. అంతకు ముందు మహిళలు కార్మికోద్యమంలో భాగస్వాములు కాలేదు. కార్మికుల ఆకలిపోరు రాజ్య వ్యతిరేక పోరాటంగా మారిపోతుండటాన్ని గ్రహించిన కార్మిక సంఘం ఉద్యమంలోకి స్త్రీలు, పిల్లల్ని సమీకరించే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి కార్మికులు కాని గృహిణులు ఉద్యమంలో అగ్రశ్రేణి పోరాట యోధులుగా నిలిచారు.

జూన్ 11న చేపట్టిన ‘పొయ్యి వెలగొద్దు – ముద్ద ముట్టొద్దు’ అనే వినూత్న నిరసనలో 35 గ్రామాల్లో ఏ ఇంటిలోనూ పొయ్యి వెలగ లేదు. నెల్లిమర్ల ఎస్‌ఐ, ఎమ్మార్వోల భార్యలు సహా ప్రతి ఇల్లాలూ ఆ నిరసనలో పాల్గొనేలా చేసిన ఘనత కార్మిక గృహిణులదే. కార్మికులకు వేతనాలను చెల్లించకుండానే మిల్లులోంచి సంచులను తరలించుకు పోవడానికి వచ్చిన గూడ్స్ రైలుకు జూన్ 14న కార్మికులు అడ్డుపడ్డా… పోలీసు రక్షణతో కదిలిన రైలుకు అడ్డుపడి ఓ మహిళ ఒంటి మీది ఎర్ర రవికను కర్రకు కట్టి ఎగరేసి నిలిపేసింది. నిర్ణీత గడువులోగా జీతాల బకాయిల చెల్లింపు హామీ లభించాక…92 గంటలకు గానీ రైలును కదలనివ్వలేదు. కొన్ని రోజులకే మహిళలు మాత్రమే కలెక్టర్‌కు వినతి పత్రం ఇద్దామని విజయనగరం వెళ్లారు. మొహం చాటు చేయాలని చూసిన కలెక్టర్ వచ్చే వరకు అర్థరాత్రి అయినా కార్యాలయం ముందే బైఠాయించారు.

1993 జూలై 5న మరోసారి యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మరుసటి రోజు యాజమాన్య ప్రతినిధులు రహస్యంగా మిల్లులోకి ప్రవేశించడాన్ని కనిపెట్టిన కార్మికులు మిల్లును చుట్టుముట్టారు. 42 గంటల పాటూ జరిగిన ఆ పోరాటంలో కార్మికులు పోలీసు లాఠీ చార్జీలకు, బాష్పవాయు ప్రయోగానికి వెరవలేదు. మహిళలు తెగించి ముందుకు పోయి బాష్పవాయువుకు విరుగుడుగా కార్మికులకు ఉల్లిపాయలు అందించారు. ‘ఉల్లిపాయల పోరాటం’ అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. యాజమాన్యం బకాయిల చెల్లింపునకు అంగీ కరించక తప్పలేదు. ర్యాలీలు, ఆకలి యాత్రలు వంటి పోరాటాలకు యాజమాన్యం, ప్రభుత్వం చలించకపోవడంతో కార్మిక కుటుంబాలు 1994 డిసెంబర్ 29న రైల్ రోకోకు దిగాయి. నాటి పోరాటంలో మహిళలు ప్రదర్శించిన తెగింపు నేటికీ మరువలేనిది.

నాటి కాల్పుల్లో ఒరిగిన కాళ్ల అప్పల సత్యనారాయణ, నల్లి ముత్యాలనాయుడు, దువ్వారపు చిన్నా, కోకా అచ్చప్పడు, కల్లూరు రాంబాబుల భార్యలు తమ భర్తలను పది మంది కోసం ప్రాణాలర్పించిన అమరయోధులని గర్విస్తుండటమే వారి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. నేడు జనుము ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతున్నా, పరిశ్రమ విస్తరిస్తున్నా నెల్లిమర్ల కార్మికుల కుటుంబాల జీవితాల్లోకి వెలుగులు మాత్రం ప్రసరించడంలేదు. భవన నిర్మాణ కార్మికుల కంటే తక్కువ కూలీకి పని చేయాల్సివస్తోంది. యాజమాన్యం కొమ్ముకాస్తున్న నాయకులు గత పదేళ్లుగా కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు లేకుండా అమలు చేయిస్తున్న నిరంకుశత్వం ఫలితమిది.  లాకౌట్ ఎత్తివేత ఒప్పందం పేరిట నాటి మంత్రి ఒకరు … యాజమాన్యం దగ్గర గ్రాట్యుటీ చెల్లింపులకు డబ్బు లేదన్న సాకుతో ఒక్కొక్క కార్మికుని కూలీలో రోజుకి రూ.18 కోతను రుద్దారు. నాలుగు నెలల తర్వాత దాన్ని తిరిగి చెల్లించే విషయాన్ని చర్చిస్తామని ఇచ్చిన హామీని ఆ మంత్రి అప్పుడే మరిచారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ నెల్లిమర్ల కార్మికులు రెండు దశాబ్దాల క్రితం నాటి తమ త్యాగాల చరిత్రను తిరిగి ఆవాహన చేస్తున్నారు.

గతంలో ఐదు వేలమంది కార్మికులతో కళలాడుతూ నడిచిన నెల్లిమర్ల జ్యుట్ మిల్లు ఇప్పుడు కుంటుతూ నడుస్తోంది. ఇప్పుడు 3000 మంది పని చేస్తున్నారు. జ్యుట్ కు ప్రత్యామ్నాయంగా పాలిథిన్ కవర్లు రావడం, జ్యుట్ సాగు ,నార తీయడం వంటివి 
ఇప్పుడు ఇబ్బంది కావడంతో జ్యుట్ కు ఆదరణ తగ్గింది. దీంతో మిల్లు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దానికితోడు మిల్లులో జీతాలు తక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో జూట్ మిల్లులోకి కొత్తగా పని చేసేందుకు వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు. కర్ణుడి చావుకు వందకారణాలు అన్నట్లుగా ఈ ప్రతికూల పరిస్థితులన్ని కలిపి జూట్ మిల్లులను మూసివేత దిశగా నడిపించాయి. విజయనగరం జిల్లాలోని అరుణ జూట్ మిల్లు, ఆంధ్రా ఫైబర్స్, లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు మూతబడ్డాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి