iDreamPost

విరాటపర్వం ఈ సవాల్ దాటితే హిట్టే

విరాటపర్వం ఈ సవాల్ దాటితే హిట్టే

వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న విరాటపర్వం ప్రమోషన్లు జోరుగా ఉన్నాయి. రానా, సాయిపల్లవిలు గత వారం పదిరోజులుగా పూర్తిగా తమ షెడ్యూల్ ని దీనికోసమే కేటాయించారు. పలుమార్లు వాయిదా పడుతూ బజ్ తగ్గిపోయిన ఈ సినిమాకు పబ్లిసిటీ వేగం పెంచారు. నీది నాది ఒక కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విరాటపర్వంలో ప్రియమణి, నందితా దాస్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది. సోలో హీరోగా రానా పెద్ద హిట్టు కొట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. అందులోనూ రిస్కీ అనిపించే ఇలాంటి బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఒక సవాల్ ని ఈ సినిమా దాటాల్సి ఉంది.

ఈ మధ్యకాలంలో నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు అంతగా ఆదరణ ఉండటం లేదు. చిరంజీవి చరణ్ లు కలిసి నటించినప్పటికీ ఆచార్య డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణాల్లో అదొకటి. జనానికి ఆ కాన్సెప్ట్ ఎక్కలేదు. కార్తికేయ నటించిన రాజా విక్రమార్కలోనూ విలన్ ఎపిసోడ్ కు నక్సలిజం ముడి పెట్టి ఏదో హడావిడి చేశారు. మావోయిస్ట్ పదాన్ని ఈజీగా వాడేశారు కానీ బొమ్మ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ విరాట పర్వం అలా ఉండదు. చాలా నిజాయితీగా, అప్పటి సమస్యను రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. నక్సలైట్లకు వ్యవస్థకు మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రేమకథకు ముడిపెట్టి హృద్యంగా చిత్రీకరించారు.

ఇది కనక ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటే విరాటపర్వం హిట్టు ఖాయం. అసలే ఫ్యామిలీ ప్రేక్షకులు ఇలాంటి వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. యూత్, మాస్ అండదండలతోనే గట్టెక్కాల్సి ఉంటుంది. రానా ఇంటర్వ్యూలలో తన కంటే ఎక్కువగా సాయిపల్లవినే హై లైట్ చేయడం బట్టి చూస్తే ఆ క్యారెక్టర్ ఎంత కీలకంగా నిలుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఇంత సీరియస్ జానర్ లో ఒక స్టార్ మూవీ రావడం చాలా గ్యాప్ తర్వాత ఇదే అని చెప్పొచ్చు. ఆర్ నారాయణమూర్తి, మాదాల రంగారావు, టి కృష్ణ చిత్రాలను మినహాయిస్తే ఈ జానర్ లో ట్రై చేసిన సినిమాలు పీపుల్స్ ఎన్ కౌంటర్, సిందూరం లాంటివి కొద్దిమాత్రమే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి