iDreamPost

ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లేనా ??

ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లేనా ??

రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్,పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్‌ని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. గురువారం విలేకరులతో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సిద్ధూ తమతో కలిసి పని చేస్తే సంతోషంగా ఉంటుందని,”ఆయనకు స్వాగతం” అని వ్యాఖ్యానించారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌లో చేరికపై సిద్ధూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి.కేజ్రీవాల్‌ చేసిన తాజా వ్యాఖ్యలతో సిద్ధూ ఆప్‌లో చేరికపై వెలువడుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.2017 శాసనసభ ఎన్నికలకు ముందు బిజెపితో తన 12 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకొని 2016 సెప్టెంబర్ 14న రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాడు.

ఇక 2017 అసెంబ్లీ ఎన్నికలలో శిరోమణి అకాలీదళ్-బిజెపి కూటమిని ఓడించి పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.117 మంది సభ్యులు గల అసెంబ్లీలో కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొందగా,ఆమ్‌ ఆద్మీ 20 సీట్లతో రెండో పెద్ద పార్టీగా నిలిచింది.తొలిసారి పంజాబ్ శాసనసభ ఎన్నికలలో బరిలో దిగిన ఆప్ 20 స్థానాలు సాధించి మెరుగైన ప్రదర్శన కనబర్చింది.ఆ ఎన్నికలలో అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుండి గెలిచి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టాడు.తర్వాత కాలంలో సీఎంతో ఏర్పడిన అభిప్రాయ భేదాల వలన తన మంత్రి పదవికి 2019 జూలై 14 న సిద్ధూ రాజీనామా చేశారు.

ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆప్ సిద్ధూతో చర్చలు జరిపింది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలనే షరతును నాడు ఆప్ జాతీయ కన్వీనర్‌ క్రేజీవాల్ ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు.మంత్రి పదవికి రాజీనామా అనంతరం సిద్ధూ రాజకీయంగా స్తబ్ధుగా ఉండి పోయాడు.అయితే సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఆప్‌ నుంచి ఆయనకి ఆహ్వానం వచ్చింది. అలాగే గత మార్చిలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ శాఖ చీఫ్ అధ్యక్షుడు భగవత్ మాన్, సిద్ధూ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే ఆయనకు స్వాగతం పలికే మొదటి వ్యక్తిని తానేనని ప్రకటించాడు.దీంతో సిద్ధూ ఆప్‌లో చేరికపై పంజాబ్ రాష్ట్ర రాజకీయాలలో ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆప్,సిద్దూ మధ్య రాజకీయ చర్చలు నడుపుతున్న ప్రశాంత్ కిషోర్ 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కోసం ప్రచార వ్యూహాన్ని రచించి,పనిచేసిన సంగతి తెలిసిందే.అయితే 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌ కోసం ఆయన పని చేశారు.ఇక రాజకీయాలు, క్రీడలలో ఏ నిమిషాన ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఆప్‌లో చేరి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే సిద్ధూ కలలు నెరవేరుతాయే లేదో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎదురుచూడక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి