iDreamPost

Natyam Movie : నాట్యం సినిమా రిపోర్ట్

Natyam Movie : నాట్యం సినిమా రిపోర్ట్

ఇవాళ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సందడి లేదు. అన్ని చిన్న చిత్రాలే కావడంతో ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా చూడకపోతే ఉండలేని ప్రేక్షకులకు తప్ప రెగ్యులర్ ఆడియన్స్ కి అంతగా ఛాయస్ లేకపోయింది. ఉన్నంతలో నాట్యం ఓ వర్గం ఆడియన్స్ దృష్టిలో పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ అతిథిగా రావడం, చిరంజీవి బాలకృష్ణ తదితరులు ప్రమోషన్లో భాగం కావడంతో ఈ మాత్రం అంచనాలైనా ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్ లో చూపించిన గ్రాండియర్, పెట్టిన ఖర్చు భారీగా ఉండటంతో ఏదైనా విషయం ఉండకపోదా అని థియేటర్ కు వెళ్ళినవాళ్ళు లేకపోలేదు. మరి ఉన్న తక్కువ హైప్ ని నాట్యం నిలబెట్టుకుందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

బాల్యం నుంచే అద్భుత నాట్య ప్రతిభను సొంతం చేసుకున్న సితార(సంధ్యారాజు)కాదంబరి కథను తన కళ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ క్రమంలో డాన్స్ పోటీల కోసం తిరుగుతున్న రోహిత్(రోహిత్ బెహెల్) ఆమెను కలుస్తాడు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాల మధ్య సితార స్వంత ఊరివాళ్లేకే జవాబు చెప్పాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అసలు సితార ఎదురుకున్న సమస్య ఏమిటి, తన జీవితంలో హరి(కమల్ కామరాజ్) పాత్ర ఏమిటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. స్వతహాగా గొప్ప నర్తకి అయిన సంధ్యారాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

ఆవిడ ఈ సినిమా కోసం ఎంత తపించారో ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. దర్శకుడు రేవంత్ కోరుకొండ ఆవిడ ఆలోచనలను నిజాయితీగా తెరకెక్కించాలని శాయశక్తులా ప్రయత్నించారు కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో చాలా చోట్ల ల్యాగ్ ఎక్కువైపోయి బోర్ కొడుతుంది. కె విశ్వనాథ్ అంతటి దిగ్గజాలే ఎంత కళాత్మకమైన కథలను తీసుకున్నా దానికి సరైన డ్రామాని జొప్పించి విజయాలు అందుకునేవారు. నాట్యంలో అది కొరవడింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇది చాలా మైనస్ అయ్యింది. భానుప్రియ, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్ లాంటి సీనియర్లు నిండుదనం తీసుకొచ్చారు.

నిర్మాణం మాత్రం చాలా రిచ్ గా ఉంది. ఈ రోజుల్లో అందులోనూ కమర్షియల్ సినిమాలో రాజ్యమేలుతున్న కాలంలో ఇలాంటి సిన్సియర్ అటెంప్ట్ చేసినందుకు నిశ్రింకళ బ్యానర్ ని మెచ్చుకోవలసిందే. అయితే రైటింగ్ లో ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే మంచి ల్యాండ్ మార్క్ మూవీ అయ్యేది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. ఆర్ట్ వర్క్ తో సహా సాంకేతిక విభాగాలన్నీ బాగా కష్టపడ్డాయి. ఆ అవుట్ ఫుట్ తెరమీద కనిపిస్తుంది. కానీ ప్రయోజనం నెరవేరలేదు. అయినా కూడా రెగ్యులర్ ధోరణికి భిన్నంగా ఓ సాహసోపేతమైన ప్రయత్నం చేసిన సంతృప్తి మాత్రమే మేకర్స్ కి మిగిలింది

Also Read : Heads And Tales : హెడ్స్ అండ్ టేల్స్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి