iDreamPost

రూ.200 ప్రయోగంతో నోబెల్ ప్రైజ్

రూ.200 ప్రయోగంతో నోబెల్ ప్రైజ్

ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ విదేశీ శాస్త్రవేత్తలే కనిపెట్టారు. కానీ విదేశీ శాస్త్రవేత్తలకు ధీటుగా కేవలం 200 ఖర్చుతో అందుబాటులో ఉన్న పరికరాలతోనే సీవీ రామన్ “రామన్ ఎఫెక్ట్” ను కనుగొన్నారు. ఆయన ఆవిష్కరణకు ఫలితంగా ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డును సైతం గెలుపొందారు. సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న ఫిభ్రవరి 28న ప్రతీ సంవత్సరం “జాతీయ సైన్స్ దినోత్సవంగా” జరుపుకుంటున్నాం.

భారతదేశంలో విజ్ఞాన రంగంలో మొదటి నోబెల్ బహుమతి సీవీ రామన్ కే దక్కింది. స్వాతంత్య్రానికి పూర్వం అరకొర సౌకర్యాలతోనే సీవీ రామన్ ఈ ఘనత సాధించడం విశేషం. భారతదేశంలో కూడా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసింది సీవీ రామన్ వల్లే.

1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు. తండ్రి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో చిన్నవయసునుండే సీవీ రామన్ కి భౌతిక శాస్త్రంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. సీవీ రామన్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో మూడు తరగతులు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేశారు. విద్యార్థి వయసునుండే రామన్ అత్యంత చురుకుగా ఉండేవారు.

తన విద్యాభ్యాసం పూర్తైన తర్వాత కలకత్తాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరినా సీవీ రామన్ మనసు ప్రయోగాలు నిర్వహించడంపైనే ఉండేది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి The Indian association of cultivation science అనే సంస్థలో చేరారు. ఇంగ్లాండ్ లో సైన్స్ సభలో పాల్గొన్న ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

సైన్స్ సభలో పాల్గొనడానికి వెళ్తున్నపుడు సముద్రం,ఆకాశం నీలి రంగులో ఉండటం గమనించి ఆ నీలి రంగుకి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించారు. ఆ ఆలోచనల ఫలితంగా కాంతి పరిక్షేపణం చెందడం గురించి కనుగొన్నారు. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ వివరించారు.

రామన్ చేసిన ఈ ప్రయోగం ఫలితంగా అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్ హుడ్ బిరుదుతో రామన్ ను సత్కరించింది.ఈ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్రానికి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేసింది. సైన్స్‌కు రామన్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికి పాటుపడ్డ సీవీ రామన్ 1970 నవంబర్ 21న కన్నుమాశారు.

1987 ఫిబ్రవరి 28 నుంచి సీవీ రామన్, రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు జ్ఞాపకార్థం ప్రతి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది. ఈ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్‌‌గా “ఉమెన్ ఇన్ సైన్స్” ను ఎంచుకున్నారు. శాస్త్ర పరిశోధనల్లో మహిళలు మరింత చురుకుగా పాల్గొనేలా చేయాలని, వారికి ఈ రంగంపై ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో దీనిని ఎంపిక చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి