iDreamPost

BRSకు ఓటేయమన్న మోదీ.. ఏం జరిగింది అంటే!

  • Published Jun 28, 2023 | 12:50 PMUpdated Jun 28, 2023 | 12:50 PM
  • Published Jun 28, 2023 | 12:50 PMUpdated Jun 28, 2023 | 12:50 PM
BRSకు ఓటేయమన్న మోదీ.. ఏం జరిగింది అంటే!

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నయం అని కాషాయ నేతలు బల్లగుద్ది మరీ చెబుతుంటారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో పట్టు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా.. తదితర నేతలంతా తరచుగా రాష్ట్రంలో పర్యటిస్తుంటారు. ఇక మరికొన్ని నెలల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం.. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటేయమని పిలుపునిచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు మోదీ. ఆ వివరాలు..

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో మంగళవారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కుటుంబంపై విమర్శలు గుప్పించారు. ‘కరుణానిధి కుటుంబ సంక్షేమం కావాలంటే డీఎంకేకు ఓటు వేయండి.. కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత క్షేమం కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి.. అలా కాకుండా.. మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మనవళ్ల సంక్షేమం కోరుకుంటే బీజేపీకి ఓటేయండి’’ అంటూ ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని రోజులుగా.. బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కవితపై నమోదైన కేసు దర్యాప్తులో ఇటీవల దూకుడు తగ్గడంతో బీజేపీ, బీఆర్ఎస్‌లు దగ్గరవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. వాటికి చెక్‌ పెట్టడం కోసం ప్రధాని మోదీ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక ఢిల్లీ మద్యం కేసులో కవిత పేరు రెండు చార్జిషీట్లలో ఉండగా.. ఏప్రిల్‌లో దాఖలు చేసిన మూడో ఛార్జిషీట్‌లో మాత్రం ఆమె పేరు తొలగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ దగ్గరవుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. వీటిని వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం నిలబెట్టుకునే దిశగా కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లాంఛనంగా అక్కడ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ బూత్ స్థాయి వర్కర్లతో సమావేశమై ఎన్నికలపై దిశనిర్దేశనం చేశారు. త్వరలనే ప్రధాని మోదీ తెలంగాణలో కూడా పర్యటించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి