iDreamPost

దక్కన్ క్రానికల్ కథనంపై టీడీపీకి ఉలికిపాటు ఎందుకు ?

దక్కన్ క్రానికల్ కథనంపై టీడీపీకి ఉలికిపాటు ఎందుకు ?

నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లున్న తెలుగుదేశం పరిస్థితి.. ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడేలా చేస్తోంది. అల్ ఫూల్స్ డే సందర్భంగా ఒక ఆంగ్ల పత్రిక టీడీపీపై సరదాగా రాసిన ఓ వ్యాసంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర నేతలు రెచ్చిపోయిన తీరు, పొంతనలేని ఆరోపణలు గుప్పించిన విధానం వారి ఉలికిపాటును స్పష్టంగా బయటపెట్టాయి.

వాళ్ళు ఏం రాశారు.. వీళ్ళు ఏం స్పందించారు..

ఆల్ ఫూల్స్ డే సందర్బంగా ఏప్రిల్ ఒకటో తేదీ సంచికల్లో సరదా కథనాలు పత్రికల్లో రావడం కొత్త కాదు. అదే రీతిలో దక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రిక ఓ వ్యాసం ప్రచురించింది. వరుస ఓటములు, పార్టీ క్యాడర్ వెళ్లిపోతున్న అంశాల ఆధారంగా త్వరలో టీడీపీ బీజేపీలో కలిసిపోతుందంటూ రాసింది. ఈ మేరకు చర్చలు జరిగాయని.. చంద్రబాబుకు కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నది అందులోని సారాంశం. ఫూల్స్ డే సందర్బంగా సరదాగా ఈ వ్యాసం రాశామని.. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో రాయలేదని వ్యాసకర్త అందులో పరోక్షంగా పేర్కొన్నారు.

Also Read : టీడీపీ పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ ఎందుకు..?

అయితే తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ నేతలు దాన్ని స్పోర్టివ్ గా తీసుకోకుండా రెచ్చిపోయారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితే ఆ వ్యాసాన్ని ఖండించడంతో ఆగకుండా.. ఆ కథనానికి, సీఎం జగన్ కు లింక్ పెట్టేశారు. పత్రిక యజమాని, సీఎం సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ కుల మీడియా ద్వారా జగన్ గాలి వార్తలు రాయించుకుంటున్నారని గగ్గోలు పెట్టారు. గాలి హామీలతో అధికారంలోకి వచ్చిన ఫేక్ ముఖ్యమంత్రి అని ఆడిపోసుకున్నారు. లోకేష్ పొంతనలేని ఆరోపణలు జనానికి నవ్వుతెప్పిస్తున్నాయి.

అందుకే అసహనం

గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారానికి దూరమైనప్పటి నుంచి పెదబాబు, చినబాబుల్లో అసహనం, ఉలికిపాటు పెరిగిపోయాయి. వరుసగా నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతుండటం, ఇటీవలి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పూర్తిగా చతికిలపడటంతో సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. దాంతో క్యాడర్ పార్టీని ఖాళీ చేసేస్తోంది. మరోవైపు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ల నేతృత్వలో టీడీపీ పూర్వ వైభవం సంతరించుకునే పరిస్థితి లేదని గ్రహించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేతలు నాయకత్వం మారాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. ఎన్టీఆర్ వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితేనే టీడీపీ తిరిగి గాడిలో పడుతుందని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీడీపీ అగ్రనేతలు ప్రతి చిన్న విషయానికీ ఉలికిపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read : ఎగిసి ‘పడిన’ కెరటం.. తెలుగుదేశం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి