iDreamPost

కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు బెయిల్‌

కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు బెయిల్‌

దొంగతనం కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ అబ్దుల్‌సలాం కేసులో నిన్న అరెస్ట్‌ అయిన నంద్యాల ఒన్‌ టౌన్‌ సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లకు ఈ రోజు బెయిల్‌ మంజూరైంది.

ఈ ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం శనివారం ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను నియమించింది. వీరితోపాటు కర్నూలు డీఐజీ వెంకటరామిరెడ్డి కేసును పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఆదివారం సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్‌ చేశారు. అంతకు ముందే సీఐను సస్పెండ్‌ చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ సీఐ సస్పెన్షన్‌లో ఉంటారని డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు.

అబ్దుల్‌ సలాం ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో 70 వేల రూపాయలు కనిపించకుండా పోయాయనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నగదు అబ్దుల్‌ సలాం తీశాడనే కోణంలో అతనిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో పోలీసులు ఒత్తిడి భరించలేక అబ్దుల్‌ సలాం తన భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి పాణ్యం సమీపంలో రైలు కింద పడి చనిపోయారు. తనకు జరిగిన అన్యాయంపై అబ్దుల్‌ సలాం తీసుకున్న సెల్పీ వీడియో వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి