iDreamPost

టీడీపీలో సీనియర్లకు లోకేష్ ఎసరు..! అప్పటి పాపం ఇప్పుడు పండింది..!!

టీడీపీలో సీనియర్లకు లోకేష్ ఎసరు..! అప్పటి పాపం ఇప్పుడు పండింది..!!

అసలే కొడిగట్టిన దీపంలా ఉన్న తెలుగుదేశం పార్టీని సీనియర్ల చిన్నచూపు మరింత చిన్నబుచ్చుతోంది. ఇటీవలి కాలంలో పార్టీ సీనియర్ నేతలు ఏదో ఒక రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే దీనికి కారణమని.. తమ పార్టీ నేతల ఆర్థిక మూలలను దెబ్బతీయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఇది చంద్రబాబు, లోకేష్ ల నిర్వాకమేనని పార్టీ నేతల అంతర్గత చర్చలు వెల్లడిస్తున్నాయి. పార్టీనే నమ్ముకున్న సీనియర్ నేతలను గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేసిన ఫలితమే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులని అంటున్నారు. ఇందుకు రెండు తాజా ఉదహరణలను వారు ప్రస్తావిస్తున్నారు.

భూబదలాయింపులో జయభేరికి మొండిచేయి..

రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టడంతో అధికారులు ఆ సంస్థకు సుమారు రూ. 1.50కోట్ల జరిమానా విధించారు. టీడీపీ నేత అయినందునే మురళీమోహన్ సంస్థకు జరిమానా విధించిందన్న ఆరోపణలు వచ్చాయి. అమరావతి రాజధాని అవుతున్నందున డిమాండ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో మురళీమోహన్ సంస్థ పది ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అందులో అపార్టుమెంట్లు నిర్మించి విక్రయించాలని భావించింది.

అయితే ఆ పది ఎకరాలు పూర్తిగా వ్యవసాయ భూమి. అందులో వ్యవసాయం తప్ప ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. నిర్మాణాలు చేపట్టాలంటే ల్యాండ్ కన్వర్షన్ చట్టం ప్రకారం ప్రభుత్వానికి నిర్ణీత ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు మురళీమోహన్ సంస్థ భూమి కొనుగోలు చేసిన వెంటనే దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ మురళీమోహన్ దరఖాస్తు ను మూడేళ్లపాటు ఆ ప్రభుత్వమే తొక్కిపెట్టేసింది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉందికదా అన్న ధీమాతో జయభేరి సంస్థ ఆ స్థలంలో నిర్మాణాలు కొనసాగించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి ఈ విషయం ఈ ఏడాది మొదట్లో వచ్చింది. వెంటనే అధికారులు ఆ సంస్థకు నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆనాడే తమ దరఖాస్తును పరిష్కరించి ఉంటే ఇప్పుడు ఈ బాధ తప్పేదని మురళీమోహన్ మాధనపడినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : తప్పించుకుందామనుకున్నా తప్పలేదు – దేవినేని

సంగం డెయిరీ విషయంలోనూ..

టీడీపీ మరో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విషయంలోనూ అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఇలాగే వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి దాపురించిందని పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంగం డెయిరీలో కొన్ని అంశాలు సహకార చట్టానికి లోబడి లేవని.. ఆ విషయంలో తమకు పాలనాపరమైన సహకారం అందించాలని పలుమార్లు నరేంద్ర అప్పటి సీఎం చంద్రబాబును, ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఏ లోపాలు ఎత్తి చూపిందో.. సరిగ్గా వాటినే పరిష్కరించుకోవాలని నరేంద్ర చేసిన ప్రయత్నాలు అప్పట్లో ఫలించలేదు. తన హెరిటేజ్ పాల వ్యాపారం కోసం అనేక సహకార పాడి సంస్థలను నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు సంగం డెయిరీని సైతం హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించగా.. ధూళిపాళ్ల కుటుంబం అడ్డుకుందని.. అందుకే నరేంద్ర విన్నపాలను ఆనాడు చంద్రబాబు బుట్టదాఖలు చేశారని ఇప్పుడు తెలుస్తోంది. అదే తాజా పరిణామాలకు, నరేంద్ర అరెస్టుకు దారితీసిందంటున్నారు.

పార్టీలో లోకేష్ ఎంట్రీతోనే..

టీడీపీలో మొదటి నుంచి సీనియర్ నేతలకు మంచి గౌరవం, గుర్తింపు ఉండేవి. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఇతర కీలక వ్యవహారాల్లో వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ పార్టీలోకి నారావారి వారసుడు లోకేష్ ఎంట్రీతో పరిస్థితి క్రమంగా మారిపోయిందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువనేతలను పోగేసుకొని కోటరీని తయారు చేసుకున్న లోకేష్ సీనియర్లను దూరం పెట్టడం ప్రారంభించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ నేతలకు విలువ ఇవ్వకపోగా.. వారికి అవసరమైన పనులు కూడా కానివ్వకుండా తొక్కిపెట్టడం ప్రారంభించారాని అంటున్నారు. దాని ఫలితాన్ని ఇప్పుడు ఆయా నేతలు అనుభవిస్తున్నారని చెబుతున్నారు. పార్టీలో చిన్నచూపునకు గురైన మురళీమోహన్, నరేంద్రలాంటి నేతలు చాలామందే ఉన్నారని.. కొందరు పార్టీని వీడి వెళ్లిపోయారని గుర్తుచేస్తున్నారు.

Also Read : ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి