iDreamPost

ముగ్గురు మొనగాళ్లు రిపోర్ట్

ముగ్గురు మొనగాళ్లు రిపోర్ట్

అసలే ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి వాడిన టైటిల్. అందులోనూ ఆయన త్రిపాత్రాభినయం చేసిన ఒకే ఒక్క సినిమా. ఆ పేరుతో ఓ మూవీ వస్తోందంటే దాని మీద అంతో ఇంతో అంచనాలు ఉండటం సహజం. అయితే అదేమీ లేకుండా అసలు వచ్చిందా లేదా అని అనుమానం వచ్చేలా నిన్న గుట్టుచప్పుడు కాకుండా రిలీజైన చిత్రం ముగ్గురు మొనగాళ్లు. కమెడియన్లను హీరోలుగా పెట్టి చేసిన ఈ ఎంటర్ టైనర్ కి కనీస ప్రమోషన్ కరువ్వడంతో చాలా చోట్ల మినిమం ఓపెనింగ్స్ లేక షోలు రద్దు చేయడం లేదా ఎస్ఆర్ కల్యాణ మండపానికి కేటాయించడమో చేశారు. మరి కొంచెం కూడా హడావిడి లేకుండా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

నగరంలో వరసగా రాజకీయ నాయకుల హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకులెవరో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో ముగ్గురికి ఈ కేసుతో కనెక్షన్ ఏర్పడుతుంది. చెవులు వినిపించని సుశాంత్(శ్రీనివాస రెడ్డి), మాట్లాడలేని కిషోర్(దీక్షిత్ శెట్టి ), కళ్ళు కనిపించని దీపక్(వెన్నెల రామారావు)లకు ఈ మర్డర్లకు సంబంధించిన కీలకమైన క్లూ దొరుకుతుంది. అసలు వీళ్లకు ఆ క్రైమ్ కి కనెక్షన్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ పొలిటికల్ మర్డర్స్ జరిగాయనే దాని మీదే కథ సాగుతుంది. సరదాగా సాగుతూ నవ్విస్తూనే బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ టైపు లో ఇన్వెస్టిగేషన్ చూపించాలనే ప్రయత్నం ఇందులో జరిగింది.

దర్శకుడు అభిలాష్ రెడ్డి తీసుకున్న పాయింట్ కొత్తదే కానీ దాని చుట్టూ అల్లుకున్న కథా కథనాలు కనీస స్థాయిలో ఎంటర్ టైన్ చేసే విధంగా లేకపోవడం ఈ సినిమాకున్న ప్రధానమైన మైనస్. బలం లేని సన్నివేశాలతో ముగ్గురు హాస్యనటులు కామెడీని పండించడానికి యధాశక్తులా ప్రయత్నించారు కానీ అది కొంత వరకే ఫలితమిచ్చింది. అసలు ఎక్కడా ఒక టెంపోతో స్టోరీ నడవదు. అవసరం లేని ఎపిసోడ్లు అలా వచ్చి పోతూ ఉంటాయి. ఏదీ ఆసక్తి కలిగించేలా ఉండదు. ఇక మిగిలిన శాఖల గురించి మాట్లాడుకోకపోవడం ఉత్తమం. ఎంత ఖాళీ సమయం ఉన్నా ఓ లుక్ వేసి ఓకే అనిపించుకునే ఛాన్స్ ముగ్గురు మొనగాళ్లు ఇవ్వలేకపోయింది

Also Read : అల్లు అర్జున్ స్పెషల్ రోల్ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి