iDreamPost

హాజీపూర్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. జడ్జి ఎదుట నిందితుడు ఏం చెప్పాడంటే..

హాజీపూర్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. జడ్జి ఎదుట నిందితుడు ఏం చెప్పాడంటే..

హాజీపూర్‌ హత్యల కేసులో పోక్సో స్పెషల్‌ కోర్టు ఈ రోజు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్‌ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన విషయం పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చినీయాంశమయ్యాయి.

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన పాములు శ్రావణి కేసు మొదట వెలుగులోకి వచ్చింది. హాజీపూర్‌కు వెళ్లేదారిలోని తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించగా.. మనీషా, కల్పనలను అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ మూడు కేసులలో వేగంగా దర్యాప్తు చేపట్టిన యాదాద్రి పోలీసులు 90 రోజుల్లో కోర్టుకు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఈ మూడు హత్యలకు సంబంధించి పోక్సో స్పెషల్‌ కోర్టు వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులలో హంతకుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు.. మనీషా కేసులో జీవితఖైదు విధించింది. గత ఏడాది జూలై 31న నల్లగొండలోని పోక్సో స్పెషల్‌ కోర్టులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్‌ 14 నుంచి ఈ కేసులలో కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో గత నెల 17వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టు తీర్పు వెలువరించింది.

కాగా, నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా, ఇప్పటికే నేరం నిరూపితమైంది.. శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా? అని శ్రీనివాస్ రెడ్డిని న్యాయమూర్తి అడిగారు. తనకు ఈ హత్యలతో సంబంధం లేదని, అనవసరంగా తన ఇల్లు తగలబెట్టారని, తన భూములను లాగేసుకున్నారని శ్రీనివాస్ రెడ్డి రోధిస్తూ చెప్పాడు. మూడు కేసుల్లోనూ నేరం నిరూపితమైందని, 11 ఏళ్ల బాలికను ముక్కు మూసి చంపినట్లుగా తేలిందని న్యాయమూర్తి చెప్పగా, మళ్లీ తాను నిరపరాధిననే శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. తన తల్లిదండ్రులకు ఎలాంటి ఆసరా లేదని వాపోయాడు. వారు ప్రస్తుతం ఎక్కడున్నారని జడ్జి ప్రశ్నించగా.. తనకు తెలియదని చెప్పడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి