iDreamPost

రాధాకృష్ణ బండారం బయట పెట్టిన ముద్రగడ

రాధాకృష్ణ బండారం బయట పెట్టిన ముద్రగడ

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ బండారాన్ని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం బయటపెట్టారు. ఒక సామాన్య జర్నలిస్ట్‌గా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రస్థానం ప్రారంభించిన రాధాకృష్ణ ఏ విధంగా ఆ సంస్థల ఎండీ స్థాయికి ఎదిగారన్నది వ్యంగ్యంగా ముద్రగడ వివరించారు. రాధాకృష్ణ ఆ మధ్య చేసిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ముద్రగడపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి బదులుగా ముద్రగడ బుధవారం రాధాకృష్ణకు బహిరంగలేఖ రాస్తూ ఆయన ఆర్థికంగా అడ్డుగోలుగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు.

పేదల చదువులు, ఉద్యోగాల కోసమే కాపు ఉద్యమం..

ముద్రగడ పద్మనాభం వగైరా వాళ్లు కాపుల గురించి మాట్లాడతారు కదా.. ఒకరినైనా ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అని రాధాకృష్ణ ఆ ఇంటర్వ్యూలో రామానాయుడిని ప్రశ్నించగా ఆయన ‘సున్నా’ అని బదులిచ్చారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ నేను ఉద్యమం చేసింది పేద వారి పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికే మాత్రమే. చిన్న వ్యక్తిని లక్షాధికారిని, లక్షాధికారిని కోటీశ్వరుడిని, కోటీశ్వరుడిని అపర కోటీశ్వరుడిని చేయడానికి కాదు అని స్పష్టం చేశారు. తన ప్రయత్నాన్ని కాపులు హర్షించారో.. లేదో.. తెలియదు కాని రాధాకృష్ణ చెప్పినట్టు నడచుకొని లక్షలాది మంది పేదలను వదిలేసి ఒకరికో, ఇద్దరికో సాయం చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు.

కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ను కుర్చీలోంచి లాగేసి అందులో కూర్చున్నారు…

రాధాకృష్ణ ఎదుటివారిని ఏకవచనంలో సంబోధించడంపై ముద్రగడ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ పత్రిక అధిపతి ఎదుటివారిని అలా సంబోధించరు అని ప్రస్తావిస్తూ మర్యాద అంటూ చూడవలసి వస్తే ఈనాడు అధినేత రామోజీరావు గారిని చెప్పుకోవాలి అని పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి పత్రికలో మీరు రిపోర్టరుగా డొక్కు సైకిల్‌పై, స్కూటర్‌పై తిరిగిన సంగతి నాకు తెలుసు. ఈ రోజు మీ పరిస్థితి…… . ఆంధ్రజ్యోతి యజమాని కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ను కుర్చీలోంచి కాళ్లు పట్టుకు లాగేసి.. ఆ కుర్చీలో కూర్చున్న ఘనత తమరిది అని పేర్కొన్నారు. ఇలాంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదు. ఎవరూ మీలాగా అపర కోటీశ్వరులు అవ్వలేరు. నాలాంటి వారి చరిత్ర కన్న మీలాంటి వారి చరిత్ర చదవాలి. యజమానిని ఎలా కుర్చీలోంచి లాగేసి, అందులో కూర్చోవాలో సమాజానికి మీరు ఆదర్శంగా సందేశం ఇవ్వాలి’ అని రాధాకృష్ణను ముద్రగడ కోరారు.

డబ్బులు వసూలు చేసే పద్ధతి సమాజానికి నేర్పండి..

‘రూ.500, రూ.1,000 నోట్లు రద్దయినప్పుడు నేలమాళిగలో దాచిన నల్లడబ్బును బంగారు షాపుల వారిని బెదిరించి చలామణిలోకి తెచ్చిన విషయం, రెండు తలలు కలసిపోయి పుట్టిన పిల్లలను విడదీయడం కోసం డబ్బులు వసూలు చేసే పద్థతి కూడా మీ సందేశంలో ఉండాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెట్టింగులు ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి. యజమానిని పాతాళానికి తొక్కి ఆకాశమంత ఎదిగిన మిమ్మల్ని విమర్శించడానికి నాలాంటి వారు సరిపోరు. నేను మీపై ఇలా రాసినందుకు కోపంతో నా పై పుస్తకాలు ప్రింట్‌ చేసి, మీరు అభిమానించే పార్టీ మీటింగ్‌లల్లో పంచి పెట్టగల సమర్థులు. అంతశక్తి ఎవరికి ఉంటుందండి? అని ముద్రగడ ప్రశ్నించారు.

బాబు పతనానికి మీరూ కారణమే..

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పతనానికి కారణమైన ఇద్దరు పెద్ద అధికారులతోపాటు తమరి పాత్ర కూడా చాలా ఉంది. నేను ఇమేజీ పెంచుకోవడానికే ఉద్యమాలు చేస్తానని, పేదవారి కోసం కాదని ఆ ఇంటర్వ్యూ సందర్భంగా మీరిద్దరూ అనుకోవడం నా దురదృష్టం అంటూ ముద్రగడ తన లేఖను ముగించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి