iDreamPost

బోసిపోతున్న తహసీల్దార్‌ కార్యాలయాలు

బోసిపోతున్న తహసీల్దార్‌ కార్యాలయాలు


ఒక్క ఐడీయా జీవితాన్నే మార్చేస్తుందటారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆలోచన ఆ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల జీవితాన్నే మార్చేసింది. ఆదే ఐడీయా తహసీల్దార్ల కార్యాలయాలను బోసిపోయేలా కూడా చేసింది. ఇంతకూ అదేమిటనేగా.. మీరు ఆలోచిస్తుంది..? ఆ ఆలోచనే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు.

ముఖ్యమంగా గ్రామ సచివాలయాలతో గ్రామీణ ప్రజలకు, రైతులకు చెప్పలేనంత మేలు జరుగుతోంది.
రైతులకు అత్యంత ప్రధానమైన సమస్య భూమి తాలుకూ పత్రాలు సరిగా లేకపోవడం. పట్టాదార్‌ పాసు పుస్తకాలు ఉంటే.. రైతుకు వడ్డీ రాయితీ రుణాలు, విత్తనాలు, ఎరువులు.. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందుతాయి. బ్రిటీష్‌ హాయంలోని వివరాల ప్రకారమే.. నేటికి పట్టాదార్‌ పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు. భూమలు అమ్మకాలు, కొనుగోళ్లలో గతంలో గ్రామాల్లో అగ్రిమెంట్లతోనే పనులు జరిగేవి. అవి రిజిస్ట్రేషన్‌ వరకూ వచ్చేవి కావు.

ఈ నేపథ్యంలో తరాలు మారడంతో.. భూముల సమస్యలు బాగా పెరిగిపోయాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూములు కూడా వారసుల అనుభవంలో ఉన్నా వాటికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు ఉండేవి కావు. దీంతో రైతులు తమ పనులు మానుకొని తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. నిబంధనలు తెలియకపోవడం.. నిరక్షరాస్యత వల్ల రైతులు తమ భూమి సమస్యలు పరిష్కరించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రైతుల పరిస్థితిని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని అధికారులు, దళారులు సొమ్ము చేసుకున్నారు. చేయి తడపందే పాస్‌పుస్తకం జారీ కాదంటే అతిశయోక్తి కాదు.


వైఎస్‌ జగన్‌ సీఎంగా అయిన తర్వాత ఆరు నెలలకే ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయాల వల్ల భూముల వ్యవహారాలన్నీ అక్కడే పరిష్కారమవుతున్నాయి. పైగా రైతుల అక్కడకు వెళ్లాల్సిన అవసరంకూడా లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడుతోంది. రైతుల పని ఏమిటో తెలుసుకుంటున్న వాలంటీర్లు.. అందుకు అవసరమైన పత్రాలు తీసుకుని. రైతుల ఇంటి వద్దే ఆర్జీ రాయించి.. దానిపై వారి సంతకం లేదా వేలిముద్ర వేయించుకుని గ్రామ సచివాలయంలో వీఆర్‌వో, సర్వేయర్లకు అందిస్తున్నారు. ఆ పని పూర్తయిన తర్వాత సంబంధిత పత్రాలు తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నారు.
ఈ విధానం వల్ల రైతులు అధికారుల వద్దకు వెళ్లే పని తప్పింది.

ఫలితంగా మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాలు బోసిపోతున్నాయి. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు, రైతులు.. వారితో వచ్చే గ్రామ స్థాయి నేతలతో కళకళలాడేవి. అంతేకాకుండా అధికారులకు పై ఆదాయం దండిగా వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి, పట్టణాలల్లో ప్రతి నాలుగువేల మందికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 14,944 గ్రామ, వార్డు సచివాలయాలను వైఎస్‌ జగన్‌ సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో 11,158 గ్రామ సచివాలయాల ద్వారా గ్రామీణ ప్రజలకు గత నెల 26వ తేదీ నుంచి సేవలు అందుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి