iDreamPost

ఇక నుంచి ఆ ఆలయంలో మొబైల్‌ ఫోన్లు నిషేధం!

ఇక నుంచి ఆ ఆలయంలో మొబైల్‌ ఫోన్లు నిషేధం!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగి పోయింది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. కొందరు ఫేమస్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, గుడి,బడి..వంటి ప్రాంతాల్లో వీడియోలు చేస్తున్నారు. ఇక  దారుణం ఏమిటంటే ఎక్కడ ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి రీల్స్‌ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. చివరకు ఆలయాల్లో కూడా వారి పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ప్రముఖ దేవాలయం కీలక నిర్ణయం తీసుకుంది.

శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయ ఒకటి. ఏటా ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇటీవలే ఈ ఆలయ  ప్రాంగణంలో ఓ ప్రేమ జంట ప్రపోజ్‌ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటివి చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు.  చాలా ఆలయాల్లో మొబైల్ ఫోన్లలపై నిషేధం ఉంది. ఫోన్లు ఆలయం లోపలికి అనుమతించరు. ఫోన్లు లేని వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఆ ఆలయాల్లో మాదిరిగానే కేదార్‌నాథ్‌లో కూడా  మొబైల్ ఫోన్లను నిషేధించాలని భక్తులు కోరారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అలా చేస్తే.. మరెవరు ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీసుకునేందుకు, ఫోన్లను వినియోగించుకునేందుకు సాహసం చేయరని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక భక్తుల అభ్యంతరాలపై ఆలయ కమిటీ స్పందించింది. త్వరలో మొబైల్‌ ఫోన్‌లను నిషేధిస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది. అలానే లవర్స్  వీడియోపై పోలీసు ఉన్నాతాధికారులకు ఆలయ కమిటీ లేఖ రాసింది. భక్తుల ఫోన్‌లను భద్రపరుచుకోవడానికి లాకర్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఇకపై ఆలయ ప్రాంగణంలో ఎవరైనా రీల్స్‌  చేసినట్లు గుర్తిస్తే.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇలాంటి వీడియోలు చేసే వారి కారణంగా భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని,  భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ కార్యనిర్వహణ అధికారి రమేష్‌ చంద్ర తివారీ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఆలయ ప్రాంగణంలోకి ఫోన్‌లు తీసుకురాకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టినా ఫలించలేదని ఆలయ అధికారి అజేంద్ర అజయ్‌ తెలిపారు. అయితే త్వరలో మాత్రం ఆలయం ప్రాంగణంలోకి ఫోన్లను నిషేధిస్తామని తెలిపారు. మరి.. కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి