iDreamPost

ఆ ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్ర‌జ‌ల్లోకి..!

ఆ ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్ర‌జ‌ల్లోకి..!

తెలుగుదేశంలో ఉండ‌గా జ‌నంలోకి వెళ్ల‌డానికి జంకేవారు. అధినేత చంద్ర‌బాబు నాయుడి ప్ర‌క‌ట‌న‌లు, అవ‌లంబిస్తున్న తీరుతో స్థానికంగా ఇబ్బందులు ప‌డేవారు. ముఖ్యంగా విశాఖ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేశ్ కు ఆ ఇబ్బందులు ఎక్కువ‌గా ఉండేవి. విశాఖ ను రాజ‌ధానిగా చంద్ర‌బాబు వ్య‌తిరేకిస్తూ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం, జూమ్ మీటింగ్ లు పెట్ట‌డం తో ఆయ‌న స్థానిక ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హానికి గుర‌య్యే వారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డానికి సంశ‌యించేవారు. దాదాపు 15 నెల‌ల పాటు ఆయ‌న ఈ న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన‌ట్లు వైసీపీ లో చేరిన త‌ర్వాత గ‌ణేశ్ చేసిన వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం, మద్ధాళి గిరి వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు.

నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్క‌ర్లు…

వైసీపీ కి మ‌ద్ద‌తు ప‌లికిన త‌ర్వాత వాసుప‌ల్లి గ‌ణేశ్ స‌హా టీడీపీకి చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు స‌గ‌ర్వంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నారు. ప్ర‌ధానంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసుపల్లి గణేశ్ స్థానికంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల జోరు పెంచారు. ఆయన ఇద్దరు కుమారులను వైసీపీలో చేర్చి, ఆయ‌న కూడా ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. జగన్ నిజంగా గట్స్ ఉన్న నాయకుడంటూ ప్రశంసించిన‌ గ‌ణేశ్.. ఆయ‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లోకి తిర‌గ‌డానికి ఆలోచించే గ‌ణేశ్ వైసీపీ కి మ‌ద్ద‌తు ఇచ్చిన త‌ర్వాత త‌న కార్య‌క్ర‌మాల స్పీడు పెంచారు. శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో బిజీగా గ‌డుపుతున్నారు.

వైసీపీ విశాఖ‌ను పరిపాలనా రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డం.. టీడీపీ వ్య‌తిరేకించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇటీవ‌లే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ఆయనకు విన్నవించారు. వీటితోపాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పడంతో ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్తాన‌ని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి