iDreamPost

తెలంగాణాలో ముగిసిన టిడిపి కథ.. టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీ విలీనం

తెలంగాణాలో ముగిసిన టిడిపి కథ..  టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీ విలీనం

ద‌శాబ్దాల చ‌రిత్ర గ‌ల తెలుగుదేశం పార్టీ క‌థ‌ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిపోయింది. రాష్ట్రం ఆవిర్భావం త‌ర్వాత కూడా హ‌వా చాటిన ఆ పార్టీ క‌నుమ‌రుగయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తీ ఎన్నిక‌లోనూ ఓట‌మి పాల‌వుతూ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో దూర‌మైన టీడీపీకి ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మ‌చ్చా నాగేశ్వ‌ర‌రావు తీసుకున్న నిర్ణ‌యంతో భారీ షాక్ త‌గిలింది.

మ‌రో ఎమ్మెల్యే సండ్ర వీర‌య్య ఎప్ప‌టి నుంచో టీఆర్ ఎస్ నిర్ణ‌యాల‌కు అనుగుణంగా న‌డుచుకుంటున్నారు. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌లిసి తెలుగుదేశం పార్టీ లిజిస్లేటివ్ వింగ్‌ను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు లేఖ అందించ‌డంతో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాతినిథ్యం లేన‌ట్లే. ఇదివరకు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి తెలంగాణలో ఎంతో కొంత బలం వుందంటే అది ఖమ్మం జిల్లాలోనే. టీఆర్ఎస్ హోరులోనూ 2018 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ తరపున గెలిచారు. ఇప్పుడు వారు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

2016 సీన్ రిపీట్..

ఉమ్మ‌డి రాష్ట్రంలోను, విభ‌జ‌న త‌ర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆద‌ర‌ణ చెక్కు చెద‌ర‌లేదు. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత తెలంగాణ‌పై సీత క‌న్ను వేస్తున్నార‌న్న ప్ర‌చారంతో ఇక్క‌డ నాయ‌క‌త్వం ప‌క్క చూపులు చూడ‌డం మొద‌లుపెట్టింది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ బ‌లంగానే ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణ అసెంబ్లీకియ 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే నాలుగేళ్ళ కాలంలో వారిలో ఒకరిద్దరు మినహా అంతా గులాబీ పార్టీలోకి జంప్ అయ్యారు. 2015లో తొలుత టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు సలీమ్, బాలసాని లక్ష్మీ నారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, గంగాధర్ గౌడ్‌లు శాసన మండలిలో టీడీపీ పక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేశారు. 2016లో ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యారు. అప్పుడు కూడా ఊహించ‌ని షాక్ తో తెలుగుదేశం పార్టీ కుదేలైంది. ఎమ్మెల్యేలు పోయిన‌ప్ప‌టికీ కేడ‌ర్ ఉండ‌డంతో వాటి ద్వారా తెలంగాణ‌లో టీడీపీ ఉనికి చాటుకుంటూ వ‌స్తోంది.

ఫ‌లించ‌ని ప్ర‌య‌త్నాలు

అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి హీన స్థాయికి పడిపోయింది. ఒంట‌రిగా బ‌రిలో దిగేందుకు కూడా సాహ‌సించ‌లేని ప‌రిస్థితి. దీంతో గ‌త్యంత‌రం లేక సిద్ధాంతాల‌ను సైతం ప‌క్క‌న బెట్టి ఏ పార్టీకి వ్య‌తిరేకంగా టీడీపీ ఆవిర్భ‌వించిందో, ఆ పార్టీతోనే చంద్ర‌బాబు పొత్తుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీతో క‌లిసి 2018 ఎన్నిక‌ల‌కు వెళ్లారు. దశాబ్ధాల పాటు పరస్పరం పోరాడిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆ ఎన్నికల్లో క‌లిసిమెలిసి ప్రచారం నిర్వహించారు. అయిన‌ప్ప‌టికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఏదోలాగా ఎదురీది టీడీపీ కేవలం రెండంటే రెండు సీట్లలో విజయం సాధించింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఖ‌మ్మం జిల్లాకు చెందిన వారే. సత్తుపల్లి నుంచి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య ఎప్ప‌టి నుంచో టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. మ‌చ్చా నాగేశ్వ‌ర‌రావు కూడా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిసి ఎల్. ర‌మ‌ణ‌తో క‌లిసి ప‌లువురు ఆయ‌నతో ప‌లుమార్లు మంత‌నాలు జ‌రిపారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితాలు ఫ‌లించ‌లేదు.

వీర విధేయుడే కానీ…

అశ్వారావు పేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మచ్చా నాగేశ్వర్ రావు మాత్రం జిల్లాలో పార్టీని నిల‌బెట్టేందుకు పోరాడుతూనే ఉండేవారు. తెలుగుదేశం పార్టీకి విధేయుడుగా వ్య‌వ‌హరించేవారు. కానీ కొన్ని నెలలుగా తన నియోజకవర్గం పనుల నిమిత్తం అధికార పార్టీ నేతలను కలుస్తుండడంతో ఆయనపై కూడా గులాబీ నేత‌లు దృష్టి సారించారు. స్థానికంగా ఇరు పార్టీల మ‌ధ్య ఉన్న పోటీని ప‌క్క‌న‌బెట్టి ఆయ‌న‌ను క‌లుపుకునే ప్ర‌య‌త్నంలో టీఆర్ఎస్ నేత‌లు విజ‌యం సాధించారు. మచ్చా నాగేశ్వర రావు కూడా టీఆర్ఎస్ పార్టీకి సన్నిహితమయ్యారు. బుధవారం ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకు ముందే ఆయన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సండ్ర వెంకట వీరయ్యతో కలిసి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో సండ్ర, మచ్చ లిద్దరు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు విలీనం లేఖను అందజేశారు. అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి