iDreamPost

మొన్న క్షేమంగా బయటపడి.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన MLA లాస్య నందిత!

Lasya Nanditha Passed away: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాద సంఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Lasya Nanditha Passed away: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాద సంఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మొన్న క్షేమంగా బయటపడి.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన MLA లాస్య నందిత!

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అందుకు వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని అంటారు పెద్దలు. ఒక్కసారి కాదు రెండు సార్లు మృత్యువు ఆమెను వెంటాడినా.. అదృష్టం కొద్ది బయటపడ్డారు. కానీ మూడోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేక మృతి చెందారు. ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33). సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారు ఝామున ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్ ని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు.

ప్రమాదం గురించి తెలిసి వెంటనే పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.  కారు వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనా స్థలంలోనే మరణించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం డ్రైవర్ ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ విషయం గురించి తెలిసిన బీఆర్ఎస్ నేతలు ఒక్కాసారిగా షాక్ కి గురయ్యారు. లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు. ఆయన స్థానంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్​ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 17,169 ఓట్ల మెజార్టీలతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా లాస్య నందిత గెలిచినప్పటి నుంచి ప్రమాదాలు ఆమెను వెంటాడుతూ వచ్చాయి.

గత ఏడాది డిసెంబర్ లో బోయిన్ పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి లిఫ్టులో వెళ్తున్నారు. ఆ సమయంలో లిఫ్ట్ లో కెపాసిటికి మించి ఉండటంతో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే అలర్ట్ అయి లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి ఎమ్మెల్యే నందితతో పాటు మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అలా ఆమె మొదటి ప్రమాదం తప్పింది. పది రోజుల క్రితం మరోసారి మృత్యువు వెంటాడింది.   నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఎదురుగా మారుతీ స్విఫ్ట్ కారు అదుపు తప్పి బలంగా ఢీ కొట్టింది. కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న హూంగార్డు మృతి చెందాడు. లాస్య నందిత తలకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్ద ప్రమాదం నుంచి బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మూడోసారి ఆమెను మృత్యువు కబలించింది. శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన యాక్సిడెంట్ లో అక్కడిక్కడే మృత్యువడిలోకి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. నందిత మృతి కుటుంబ సభ్యుల్లోనే కాదు.. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏది ఏమైనా చిన్న వయసులో ఎమ్మెల్యే అయి మంచి భవిష్యత్ ఉన్న లాస్య నందిత మృతి చెందడం అందరి హృదయాలను కలచి వేస్తుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి