iDreamPost

పవన్ సభలపై మంత్రుల ప్రశ్నలు

పవన్ సభలపై మంత్రుల ప్రశ్నలు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌డుతున్న కౌలు రైతుల పాద‌యాత్ర రాజ‌కీయంగా అగ్గి రాజేస్తోంది. రైతు కుటుంబాల ప‌రామ‌ర్శ‌ల‌కే ప‌రిమితం కాకుండా ప‌వ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. కొద్దిరోజులుగా ప‌వ‌న్ అదే పంథా అవ‌లంబిస్తున్నారు. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. ఒకేరోజు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు.. ఆయ‌న‌కు కౌంట‌ర్లు ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్ కళ్యాణ్‌ను పావుగా వాడుకునే చంద్రబాబుకు కాపు సామాజికవర్గం వ్యతిరేకంగా ఉందని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎరగా వేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలని నాకు లేదు అన్న పవన్ కళ్యాణ్ మాటలు వాస్తవమే అని.. ఎందుకంటే చంద్రబాబును గద్దెను ఎక్కించటమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడికే ఉంటుందా.. మాకు ఉండదా అని నిలదీశారు.

వ్య‌వ‌సాయం తెలుసా..?

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అని ఆరోపించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం మినహా పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడా లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అర్హత కూడా పవన్ కళ్యాణ్‌కు లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పవన్‌ను విమర్శించారు. జగన్ సర్కారుపై చంద్రబాబు దత్తపుత్రుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

మీ సినిమా అట్టర్‌ ఫ్లాప్ గ్యారంటీ

మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అమర్నాథ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు రైతుల ఆత్మహత్యలకు మూలం. టీడీపీ హయాంలో కౌలురైతుల ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి