iDreamPost

ఏపీలో ఉదయనిధి స్టాలిన్ పోస్టర్లకు పాలాభిషేకం

ఏపీలో ఉదయనిధి స్టాలిన్ పోస్టర్లకు పాలాభిషేకం

దేశ వ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానుతున్న రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేకెత్తించిన సంగతి విదితమే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, దాన్ని సమూలంగా నాశనం చేయాలంటూ ఉదయనిధి అనడంపై ముఖ్యంగా హిందూత్వ సంఘాలు, ఆధ్యాత్మిక వేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనితో పాటు బీజెపీ శ్రేణులు సైతం విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇక అయోధ్య స్వామిజీ అయితే తొలుత .. అతడి తల నరికి తీసుకు వస్తే రూ. 10 కోట్లు ఆఫర్ చేసి.. ఆ తర్వాత రూ. 20 కోట్లకు పెంచాడు. దీనికి ఉదయనిధి స్టాలిన్ కూడా గట్టి కౌంటరిచ్చారు. అలాగే అతనిపై  ఉత్తరప్రదేశ్ తో సహా  పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.

దేశంలోని సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు కొంత మంది తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు ఉదయనిధి. తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఇదిలా ఉంటే ఆయన తండ్రి, తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం కుమారుడికి మద్దుతుగా నిలిచారు. తమిళనాడులోని రాజకీయ, సినీ రాజకీయ ప్రముఖులు అతడికి అండగా నిలుస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అతడి వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. అతడిని వ్యతిరేకిస్తూ విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొడితే రూ. 10 లక్షలు నజారానా ఇస్తానంటూ జన జాగరణ సమితి ప్రకటించిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే ఏపీలో మరికొంత మంది ఉదయనిధికి మద్దతుగా నినాదాలు చేస్తూ.. ఆయన పోస్టర్లకు పాలాభిషేకం చేశారు.

బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆయన చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేస్తూ.. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అద్దంకిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయనిధి స్టాలిన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రజా సంఘాల నేతలు క్షీరాభిషేకం చేశారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, కొన్ని హిందు సంస్థలు తప్పుగా చిత్రీకరించాయని మండిపడ్డారు. సనాతన ధర్మంలోని మూఢ నమ్మకాలను నిర్మూలించాలని ఉదయనిధి అన్నారని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉదయనిధికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వర్ధిల్లాలి ఉదయనిధి నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. అయితే ఇది ఎంత రభస ఎంత వరకు వెళుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి