iDreamPost

సర్పంచ్‌ని కోటీశ్వర్రాలు చేసిన టమాటా.. నెల రోజుల వ్యవధిలోనే!

  • Published Jul 22, 2023 | 9:26 AMUpdated Jul 22, 2023 | 9:26 AM
  • Published Jul 22, 2023 | 9:26 AMUpdated Jul 22, 2023 | 9:26 AM
సర్పంచ్‌ని కోటీశ్వర్రాలు చేసిన టమాటా.. నెల రోజుల వ్యవధిలోనే!

మన దేశంలో రైతే రాజు.. దేశానికి వెన్నుముక అంటారు. కానీ అలాంటి రైతన్న వెన్ను విరిగేంత అప్పుల భారంలో కూరుకుపోయి.. ఆఖరకు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని నిర్లిప్త సమాజంలో ఉన్నాం. మన జీవితం సంతోషంగా సాగాలని పని చేస్తాం. కానీ రైతన్న మాత్రం నేలతల్లి మీద ప్రేమతో వ్యవసాయం చేస్తాడు. ఆఖరికి ప్రకృతి రూపంలో ఆ దేవుడు సైతం తనను మోసం చేసినా సరే.. ఏటా మళ్లీ నమ్మకం, ప్రేమతో అదే పని మొదలు పెడతాడు. ఇన్నాళ్లు రైతులంటే కేవలం అప్పుల భారం మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఈ ఏడాది మరీ ముఖ్యంగా నెల రోజుల నుంచి అనూహ్యంగా కోటీశ్వరులైన రైతుల గురించి బోలేడు వార్తలు చూస్తున్నాం. మరి ఒక్క నెలలో రైతుల తల రాత మార్చినది ఏంటి అంటే టమాటా. అవును ప్రస్తుతం టమాటా సాగుచేస్తోన్న రైతు లక్షలు ఆర్జిస్తున్నాడు. ఇక తాజాగా టమాటా కారణంగా ఓ సర్పంచ్‌ కోటీశ్వరురాలయ్యింది. ఆమె వివరాలు..

గత కొన్ని రోజులుగా ట‌మాటాలు అమ్మి దేశంలో చాలా మంది ఉన్నట్టుండి కోటీశ్వరులైన వారి గురించి బోలేడు వార్తలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. టమాటా సాగు చేసిన ఓ సర్పంచ్‌.. కోటీశ్వర్రాలయ్యింది. వారే మెద‌క్ జిల్లాలోని కౌడిప‌ల్లికి చెందిన రైతు మ‌హిపాల్ రెడ్డి (37), దివ్య దంపతులు. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దివ్య మ‌హ‌మ్మద్ న‌గ‌ర్ స‌ర్పంచ్‌గా కొనసాగుతున్నారు. కాగా.. వీళ్లు గత ‍కొన్నేళ్లుగా త‌మకున్న 40 ఎక‌రాల భూమిలో అనేక రకాల కాయగూరలు పండిస్తుంటారు. ఈసారి కూడా అలాగే కూరగాయల పంటలు వేయగా.. అందులో 8 ఎక‌రాల్లో మాత్రం కేవ‌లం ట‌మాటా మాత్రమే వేశారు. దాంతో వారి దశ తిరిగింది.

ఎనిమిది ఎకరాల్లో సాగు చేసిన టమాటాను కౌడిప‌ల్లి నుంచి ప‌టాన్‌చెరు, షాపూర్, బోయిన్‌ప‌ల్లి మార్కెట్లకు త‌ర‌లించి విక్రయించిన‌ట్లు మ‌హిపాల్ రెడ్డి తెలిపాడు. గ‌త 20 ఏళ్లుగా కూర‌గాయ‌లు పండిస్తున్నట్టు చెప్పుకొచ్చిన మహిపాల్ రెడ్డి.. ఈ ఏడాది వచ్చినంత లాభం గతంలో ఎప్పుడూ రాలేద‌ని తెలిపాడు. ఈ ఏడాది టమాటా సాగు మీద కేవలం నెల రోజుల వ్యవ‌ధిలోనే కోటి రూపాయలు సంపాదించ‌డం చాలా సంతోషంగానే కాకుండా నమ్మలేకుండా ఉందంటున్నాడు. ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు మొత్తం 7 వేల బాక్సుల ట‌మాటాను అమ్మగా.. ఒక్కో బాక్సు రూ. 2,600కు అమ్ముడైనట్లు వెల్లడించాడు. దాంతో నెల రోజుల వ్యవధిలోనే టమాటా తమని కోటీశ్వరులను చేసిందని సంతోషం వ్యక్తం చేశాడు మహిపాల్‌ రెడ్డి.

అయితే.. మహిపాల్ రెడ్డి ప‌దో త‌ర‌గతి ఫెయిల్ కాగా.. అప్పటి నుంచి వ్యవ‌సాయంపైనే దృష్టి సారించాడు. పెళ్లయ్యాక.. త‌న భార్య దివ్య స‌హ‌కారంతో కూర‌గాయ‌ల సాగు ప్రారంభించాడు. అయితే.. 20 ఏళ్ల నుంచి కష్టపడుతుంటే మొత్తానికి టమాట రూపంలో మ‌హిపాల్ రెడ్డి, దివ్య దంపతుల పంట పండింది. దీంతో.. ఇప్పటివరకు టమాట పండించి కోటీశ్వరులైన రైతులే కాకుండా.. కోటీశ్వరురాలైన రైతు సర్పంచ్‌‌గా దివ్య నిలిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి