iDreamPost

బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు.. ట్విట్టర్ లో అందరి మనసు గెలుచుకున్నాడు.

బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు.. ట్విట్టర్ లో అందరి మనసు గెలుచుకున్నాడు.

ఎదిగిన కొడుకు వృద్ధిలోకి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. చాలాసార్లు చిన్న విషయాలు కూడా వెలకట్టలేని ఆనందాన్ని అందిస్తాయి. అలాంటిదే ఈ కొడుకు చేసిన పని. జన్మనిచ్చిన వారి విషయంలో ఆతని సున్నితమైన ఆలోచనలు, మంచి మనసుతో అందరి మన్ననలు పొందుతున్నాడు.

అమెరికాలో నివాసం ఉంటున్న గౌరవ్ తన తల్లిదండ్రుల అమెరికా పర్యటన కోసం బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు.వాస్తవానికి ఇది చాలా సాధారణమైన విషయం. కానీ, దీని వెనుక అతని భావోద్వేగం, ఆలోచనలే  ప్రశంసలకు కారణమయ్యాయి. ఇండియాలో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి చేసిన ప్రయాణాలను గుర్తుచేసుకున్నారు గౌరవ్.

 

ఒక హైవే బ్రిడ్జ్ ఇంజనీర్ కు కొడుకుగా, గౌరవ్ తన బాల్యంలో ఎన్నో ప్రాంతాలకు ప్రయాణాలు చేశారు. ఆ సమయంలో గౌరవ్ తల్లి 16-24 గంటల పాటు కనీసం మంచినీళ్ళు కూడా తాగుకుండా ఉండేవారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా భావోద్వేగమైన అంశాన్ని పంచుకున్నారు గౌరవ్.

80, 90ల కాలంలోని ప్రయాణాల్లో మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చాలా సున్నితంగా పేర్కొన్నారు గౌరవ్. తాను ఎక్కువగా నీళ్ళు తాగేవాడినని, కానీ అమ్మ మాత్రం ఎన్ని గంటలు ప్రయాణం చేసినా నీళ్ళు పెద్దగా తాగేది కాదని అన్నారు. అమ్మ అలా ఎందుకు ఉండేదో తనకు చిన్న వయసులో అర్థం కాలేదని, ఒక వయసొచ్చాక తాను ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకున్నట్లుగా రాసుకొచ్చారు.

ప్రయాణాలు చేసే సమయంలో భారతీయ మహిళలకు కలిగే అసౌకర్యాన్ని క్లుప్తంగా, చక్కగా వివరించారు గౌరవ్. అందుకే ఈసారి తన తల్లిదండ్రుల అమెరికా పర్యటనకు సాధారణ టికెట్లు కాకుండా, బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేసినట్లు తెలిపారు. దీనివల్ల తన తల్లిదండ్రులు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం చేస్తారని, విమానం దిగగానే తన తల్లి చిన్న పిల్లలా కేరింతలు కొడుతుందని అన్నారు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి