iDreamPost

నందిగ్రామ్ ఆర్వోకు బెదిరింపులు?

నందిగ్రామ్ ఆర్వోకు బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్లో బంపర్ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత.. నందిగ్రామ్ లో తన ఓటమిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఆమె ఇంతటితో వదిలిపెట్టేలా లేరు. ఇక్కడ రీ కౌంటింగ్ విషయంలో రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు. అందుకే రీ కౌంటింగ్ చేపట్టాలన్న తమ పార్టీ డిమాండ్ ను తిరస్కరించారని పేర్కొన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ నందిగ్రామ్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏదో మతలబు జరిగింది

హ్యాట్రిక్ సీఎం గా మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఒకవైపు సన్నాహాలు జరుగుతున్నా.. మరోవైపు నందిగ్రామ్ ఫలితం మారిపోవడం వెనుక ఏం జరిగిందన్నది దీదీ ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఒక ఆడియోను మీడియాకు వినిపించారు. అలాగే ఓట్ల రీ కౌంటింగుకు అనుమతిస్తే తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుందంటూ నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారి వేరెవరికో రాసిన లేఖ ఎస్సెమ్మెస్ రూపంలో తనకు అందిందని మమత వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఫలితం మారడం వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

మొదట 1200 ఓట్లతో తన విజయాన్ని ప్రకటించారని.. నందిగ్రామ్ లో విజయం సాధించినందుకు రాష్ట్ర గవర్నర్ కూడా శుభాకాంక్షలు చెప్పారన్నారు. కానీ అంతలోనే ఫలితం మారిపోవడం.. తాను ఓడిపోయానని ఎన్నికల అధికారులు ప్రకటించడం విస్మయం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సుమారు నాలుగు గంటలపాటు ఈసీ సర్వర్ డౌన్ అయ్యిందన్నారు. ఫలితం మారడంపై అనుమానాలు ఉన్నందున మళ్లీ ఓట్లు లెక్కించాలన్న తమ విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించిందని చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు

మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మమత సన్నాహాలు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచీ దీనిపై పార్టీ నేతలతో ఆమె మంతనాలు జరువుతూ బిజీగా గడిపారు. రాష్ట్ర గవర్నర్ ను ఈ రాత్రికే కలిసి ఎన్నికల్లో టీఎంసీ గెలిచిన విషయాన్ని వివరించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ ఇవ్వనున్నారు. గవర్నర్ తో భేటీ సందర్బంగా నందిగ్రామ్ ఫలితంపై తన అనుమానాలను మమత ప్రస్తావించే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read : నందిగ్రామ్‌లో హైడ్రామా.. మమత ఓటమి..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి