iDreamPost

ఆ రంగంలో సమూల మార్పులు.. అందుకేనా..?

ఆ రంగంలో సమూల మార్పులు.. అందుకేనా..?

ఎప్పుడో మన తాత ముత్తాతలు వాడిన మోటారు సైకిల్, కారు, ఇతర వాహనాలు అతి భద్రంగా బాగు చేయించుకుని వాడుకోవడం మనం చూస్తూనే ఉంటుంటాం. అయితే పర్యావరణ పరమైన నిబంధనల అమలులో ఉదాశీనత కారణంగానే ‘సెంటిమెంట్‌’ను కారణం చూపించి నిర్ణీత గడువు తీరిన వాహనాలను కూడా మన దేశంలో ఇంకా వినియోగించడం ఎక్కువగానే కొనసాగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో వాహన రంగం ముఖచిత్రం మారిపోయేందుకు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో అసలు మనం ఇప్పుడు వాడుతున్న పెట్రోల్, డీజిల్‌ వాహనాలు వినియోగంలో లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది ఇప్పటికప్పుడు అమలులోకొచ్చే మార్పు కాకపోయినా, భవిష్యత్తులో తప్పని సరిగా అనుసరించాల్సిన మార్గం కావడం గమనార్హం.

శిలాజ ఇంథనాల వాడకం పర్యావరణానికి తీరని హాని చేస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే ప్రపంచం మొత్తం పర్యావరణ హాని ద్వారా ఏర్పడే ముప్పును భారీగానే ఎదుర్కొంటోందిప్పుడు. గ్రీన్‌హౌస్‌ వాయువులు, అకాల వర్షాలు, విపరీత వాతావరణ పరిస్థితులు, మంచు ఖండాలు కరిగిపోవడం, సముద్రమట్టాలు పెరుగుదల తదితరాల ముప్పు ముంగిట ప్రపంచం నిలబడిందిప్పుడు. ఈ నేపథ్యంలో శిలాజ ఇంథనాల వినియోగాన్ని దశలవారీగా పరిమితం చేయడం, తద్వారా వినియోగించకుండా చూడడం వంటి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి.

అందులో భాగంగా లండన్‌లో రానున్న పదేళ్ళలో అంటే 2030 నాటికి డీజిల్, పెట్రోల్‌ వంటి వాటితో నడిచే వాహనాల అమ్మకాలను నిషేధించేందుకు రంగం సిద్ధమైనట్లు సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే.. భవిష్యత్తులో ఇప్పుడు మనం చూస్తున్న వాహన రంగం ముఖచిత్రం మొత్తం తప్పకుండా మారిపోతుందనడంలో సందేహమే లేదంటున్నారు నిపుణులు.

శిలాజ ఇంథనాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఎలక్ట్రిక్, సోలార్‌ వాహనాల వైపు మారాల్సి ఉంటుందంటున్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలనే లండన్‌లో దాదాపు డెబ్బైశాతం మందికిపైగా కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అంటే వాహన రంగం మార్పునకు ఇంకా వారు చాలాదూరమే ప్రయాణించాల్సిన అవసరముందన్నమాట. అయినప్పటికీ తొలి అడుగుగా అమ్మకాల నిషేధం ఉండబోతోందన్నది వివరిస్తున్నారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అనుసరించేందుకు అవకాశాలున్నాయంటున్నారు. లేకపోతే పర్యావరణ పరంగా జరిగే నష్టానికి సదరు నిర్లక్ష్యం చేసే దేశాన్ని బాధ్యులుగా సహచర దేశాలు చూపెట్టేందుకు అవకాశం చిక్కుతుందంటున్నారు.

పర్యావరణపరిరక్షణ పరంగా నిపుణులు అనేక మార్పులను సూచిస్తున్నారు. అయితే పలు దేశాలు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే దేశాలే పర్యావరణ నిబంధనలను తుంగలోకి తొక్కి తమతమ పారిశ్రామిక విధానాలను అమలు చేస్తుండడం పట్ల పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆవేదనను అనేక వేదికలపై వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లండన్‌ ఒకడుగు ముందుకు వేసి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నాలు చేయడం పట్ల వారి నుంచి అభినందనలు హోరెత్తడం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి