iDreamPost

అడవి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ – Nostalgia

అడవి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ – Nostalgia

సాధారణంగా స్టార్ హీరోలకు ఒక బ్లాక్ బస్టర్ వచ్చాక ఆటోమేటిక్ గా తర్వాత వచ్చేవాటి మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. దానికి తగ్గట్టే కథలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం బోల్తా కొడుతుంది. సబ్జెక్టు సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటే కంటెంట్ ఎంత సీరియస్ గా ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికో ఉదాహరణ మగాడు. 1989లో అంకుశం దెబ్బకు రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఏ సినిమా అయినా దాని స్థాయిలో ఉండాలని ఆశించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఆ టైంలో మలయాళం బ్లాక్ బస్టర్ అయిన మూన్నం ముర హక్కులు కొన్నారు నిర్మాత బాబు గణేష్.

మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఒరిజినల్ వెర్షన్ కు పెద్దగా మార్పులు చేయకుండా దాన్ని హ్యాండిల్ చేసిన దర్శకుడు కె మధుకే బాధ్యతలు అప్పజెప్పారు. దీనికి జీవిత కూడా నిర్మాణ భాగస్వామి. ఒక బస్సులో ట్రిప్పు కోసం బయలుదేరిన మంత్రి బృందాన్ని ఒక డాన్ ముఠా కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియని ఓ కారడివి బంగాళాలో బంధిస్తుంది. గొంతెమ్మ కోరికలతో వాళ్ళ నాయకుడు (త్యాగరాజన్) ప్రభుత్వానికి డిమాండ్లు పెడతాడు. దీంతో వాళ్ళను కాపాడేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ ని వదిలివెళ్ళిపోయిన ఆఫీసర్(రాజశేఖర్)ని ప్రత్యేకంగా పిలిపిస్తారు. అతను ఆ ప్రమాదకర వలయంలోకి వెళ్లి వాళ్ళను సురక్షితంగా తీసుకొస్తాడు. ఇదే కథ.

సినిమా మొదలైన 50 నిమిషాలకు హీరో ఎంట్రీ ఉన్నా విసుగు రాకుండా స్క్రీన్ ప్లే నడవటం మగాడు విశేషం. షూటింగ్ 89లోనే మొదలుపెట్టినప్పటి ఒక ఛేజ్ ని షూట్ చేస్తున్నప్పుడు రాజశేఖర్ నిజంగానే మేడపై నుంచి పడి గాయాల పాలుకావడంతో రెస్ట్ కోసం చిత్రీకరణ ఆలస్యం చేశారు. ఇందులో రాజ్ కోటి కంపోజ్ చేసిన రెండు పాటలు మాత్రమే ఉంటాయి. ఒకటి హీరోయిన్ జీవితతో ఫ్యామిలీ సాంగ్ కాగా రెండోది హీరో ఉండని బస్సు పాట. నేపధ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. ఇప్పటి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అన్నయ్య రాజేష్ విలన్ గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా ఉంటాడు. ముఖ్య పాత్రల్లో మురళిమోహన్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, బాబుమోహన్ లాంటి వాళ్ళను చూడొచ్చు. 1990 ఆగస్ట్ 17 విడుదలైన మగాడు మంచి విజయం దక్కించుకుంది. రాజశేఖర్ కు ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చింది.

Also Read : సంపాదించుకోవాల్సింది ఆ నలుగురినే – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి