iDreamPost

సనాతన ధర్మానికి మద్దతుగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సనాతన ధర్మానికి మద్దతుగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా ఇటీవల పెను దుమారం రేపిన అంశం సనాతన ధర్మం. సనాతన ధర్మం మలేరియా, టైఫాయిడ్, కరోనా లాంటిదని, దాన్ని సమూలంగా నాశనం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్రీడల శాఖ మంత్రి, నటుడు ఉదయ నిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజెపీ నేతలు, హిందూ ధార్మిక సంఘాల సభ్యులు విరుచుకుపడిన సంగతి విదితమే. తాను తప్పేమీ మాట్లాడలేదని, తన మాటలు కొంత మంది కావాలని వక్రీకరించారని, తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు ఉదయ నిధి సమర్థించుకున్నారు. అటు తండ్రి, సీఎం స్టాలిన్, తమిళనాడులోని సినీ ప్రముఖులు ఉదయనిధికి మద్దుతుగా నిలిచారు. ఇటు బీజెపీ మంత్రులు, స్వామిజీలు అతడిపై విరుచుకుపడ్డారు. దీనిపై ప్రధాని మోడీ సైతం మాట్లాడిన సంగతి విదితమే. కాగా, ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

“సనాతన ధర్మం అనేది హిందూ జీవన విధానం. దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల కర్తవ్యంతో వ్యవహరించే మంచి విధానాలు ఎలా ఉంటాయో.. సనాతన ధర్మం కూడా అలాంటి శాశ్వతమైన విధుల సమాహారం. అలాంటి విధులను ఎందుకు నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చల గురించి నాకు అవగాహన ఉంది, దీని గురించి ఆందోళన చెందుతున్నానని” జస్టిస్ ఎన్ శేషసాయి నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసం పేర్కొంది. సనాతన ధర్మం అనేది ఓ జీవన విధానంగా ఉద్దేశించినప్పటికీ.. ఎక్కడో ఓ చోట కులతత్వం, అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుందన్న భావన ఉందని తెలిపింది. దీన్ని తాను తిరస్కరిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తమిళనాడులోని తిరువారూర్‌ పట్టణంలోని ఓ ప్రభుత్వ కాలేజీ ‘సనాతన వ్యతిరేకత’ అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకోవాలని ఓ సర్క్యూలర్‌ జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ ఇళంగోవన్‌ అనే వ్యక్తి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హై కోర్టు.. ‘‘సనాతన ధర్మం కేవలం కులతత్వం, అంటరానితనాన్ని మాత్రమే ప్రోత్సహించినట్లు భావన బలపడింది. పౌరులంతా సమానం అనుకున్న సమాజంలో దీన్ని సహించలేం. ఎక్కడో సూత్రాలకు లోబడి ఉన్నట్లు కనిపించినా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది’ అని పేర్కొంది. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్చ ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. విద్వేషపూరిత ప్రసంగాలుగా మారకూడదని పేర్కొంది. ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. నిష్ఫక్షపాతంగా, ఆరోగ్యకరమైన, సమాజం ముందుకు సాగేందుకు ఉపయోగపడే బహిరంగ చర్చలను ప్రోత్సహిస్తే ప్రశంసనీయమని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి