iDreamPost

ZEE5 మా నీళ్ల ట్యాంక్ రిపోర్ట్

ZEE5 మా నీళ్ల ట్యాంక్ రిపోర్ట్

అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయిన సుశాంత్ అల వైకుంఠపురముతో సపోర్టింగ్ రోల్స్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డిజిటల్ డెబ్యూ కూడా చేసేశాడు. గత ఏడాది వరుడు కావలెనుతో ప్రయత్నం చేసి ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకురాలు లక్ష్మి సౌజన్యకు ఓటిటి డెబ్యూ ఇది. మా నీళ్ల ట్యాంక్ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇవాళ్టి నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. ట్రైలర్ గట్రా ప్రమోషన్లు ఏదో ఎంటర్ టైనర్ అనే ఫీలింగ్ ఇవ్వడంతో జనంలో చూడాలనే ఆసక్తి నెలకొంది. ఇటీవలే రెక్కీతో మంచి సక్సెస్ అందుకున్న జీకి ఇది కూడా వర్కౌట్ అయ్యిందా లేదా రిపోర్ట్ లో చూద్దాం.

అదో చిన్న పల్లెటూరు. గోపాల్(సుదర్శన్) అదే ఊరిలో ఉండే సురేఖ(ప్రియా ఆనంద్)ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆమెకు ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీంతో మనస్థాపం చెందిన గోపాల్ సురేఖ తిరిగిరావాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య బెదిరింపుతో నీళ్ల ట్యాంక్ ఎక్కుతాడు. దీంతో ఊరి సర్పంచ్, గోపాల్ తండ్రి కోదండం(ప్రేమ్ సాగర్)ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకురమ్మని పోలీస్ ఇన్స్ పెక్టర్ వంశీ(సుశాంత్)సహాయం కోరతాడు. ఈ పెళ్ళికి ఆ ట్యాంక్ రిపేర్ కు అందరికీ కోదండం హామీ ఇస్తాడు. మరి ఈ వ్యవహారం ఎలా కొలిక్కి వచ్చింది, నిజంగానే సురేఖ తిరిగి వచ్చి గోపాల్ ని పెళ్లి చేసుకుండా లేదా అనేది సిరీస్ లో చూడాలి.

ఎనిమిది ఎపిసోడ్లతో మొత్తం నాలుగు గంటల లోపే నిడివి ఉన్న నీళ్ల ట్యాంక్ పూర్తిగా కామెడీ మీద ఆధారపడింది. సుదర్శన్ కు ఎక్కువ లెన్త్ దొరకడంతో పెర్ఫార్మెన్స్ తో ఆడేసుకున్నాడు. సుశాంత్, ప్రియా ఆనంద్ లు ఆ పాత్రలకు బాగా సరిపోయారు. కామెడీ కొన్ని చోట్ల పేలింది కానీ సరైన కథనం లేకపోవడం వల్ల మా నీళ్ల ట్యాంక్ ఆశించినంత గొప్పగా సాగదు. చిన్న లైన్ ని అంత నిడివికి పొడిగించే ఉద్దేశంతో రాసుకున్న చాలా ఎపిసోడ్లు వినోదానికి బదులు విసుగు పంచాయి. ఫ్లో సరైన దిశానిర్దేశనం లేకుండా సాగింది. ఓపెనింగ్ బాగానే ఉన్నప్పటికీ ముందుకు వెళ్లే కొద్దీ బోర్ గా మారింది. గ్రామీణ నేపధ్యాన్ని బాగా ఇష్టపడి యావరేజ్ కామెడీతో సర్దుకునే వాళ్లకు ఓ మోస్తరు టైం పాస్ చేయిస్తుంది కానీ ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ట్యాంక్ లోని నీళ్లు పూర్తి దాహం తీర్చేలా లేవన్నది వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి