iDreamPost

పరిశ్రమ ముందు పెను సవాళ్లు

పరిశ్రమ ముందు పెను సవాళ్లు

లాక్ డౌన్ పొడిగించారు. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్ల ఓనర్లు ఇప్పటికే నెల రోజులకు పైగా షట్ డౌన్ తో నరకం చూస్తున్నారు. రోజువారీ వేతనం మీద బ్రతికే కార్మికులు సిసిసి వల్ల రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారు కానీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులున్నాయి. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. రిలీజులు ఎప్పుడు ప్లాన్ చేస్తారో అర్థం కావడం లేదు. పోనీ ఫలానా టైంకు మొత్తం నార్మల్ అవుతుందనే డెడ్ లైన్ ఏదైనా ఉందా అంటే అదీ లేదు. మే 4 పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

నిర్మాతల మీద ఫైనాన్షియర్ల ఒత్తిడి ఉంది. థియేటర్లు లీజుకు తీసుకున్నవాళ్ళు అద్దెలు భరించలేరు. స్వంతంగా నడుపుతున్న వాళ్ళు స్టాఫ్ కు జీతాలివ్వడానికే నానా యాతన పడుతున్నారు. మాల్స్ ని కార్పొరేట్ సంస్థలు రన్ చేస్తున్నాయి కాబట్టి ఓ రెండు మూడు నెలలు నిర్వహణ వ్యయాన్ని కష్టమైనా భరించే కెపాసిటీ ఉంటుంది కనక ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదు. కానీ ఇలాగే ఇంకొంత కాలం కొనసాగితే ఏమవుతుందో ఆ దేవుడికే తెలుసు. ల్యాబుల్లో రెడీ టు రిలీజులు బూజు పడుతున్నాయి. మరోవైపు సినిమా ఈవెంట్ల మీదే ఆధారపడుతున్న కంపెనీలు మినిమమ్ రెవిన్యూ లేక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. కాని సడలింపులు వచ్చినా అందులో పరిశ్రమ ఉండే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ తర్వాత అనుమతులు ఇచ్చినా ముందు ఎవరి సినిమా విడుదల చేయాలనేది అతి పెద్ద సవాల్ గా మారబోతోంది. ముందు ఎవరిది వస్తే వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకున్నట్టే. అసలు జనం సినిమాకొచ్చే మూడ్ లో ఉన్నారో లేదో అంత ఈజీగా ఎవరూ గెస్ చేయలేకపోతున్నారు. ఒకవేళ రిస్క్ చేసి రిలీజ్ చేసినా పబ్లిక్ కనక రాకపోతే నిర్మాతతో సహా అందరూ నష్టపోతారు. సురేష్ బాబు అన్నట్టు ఈ ఏడాది చాలా గడ్డుగా ఉండబోతోంది. మరోపక్క ఆర్టిస్టుల కాల్ షీట్స్ సమస్య ఇంకో చిక్కుముడికి దారి తీస్తుంది. ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఇతర బాషల నటీనటులు వాటిలో నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద హీరో సినిమాకు ఇలా జరిగితే వేరే ఆప్షన్ లేక ఇంకో చిన్న ఆర్టిస్టుతో రీ ప్లేస్ చేశారట. ఇదంతా ప్రాధమిక స్థాయిలో వచ్చే సమస్యలు. రోజులు గడిచే కొద్దీ ఇంకా చాలా ఛాలెంజులు ఎదురుకాబోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి