iDreamPost

ప్రశాంత్ కిషర్ మీద విచారణ?

ప్రశాంత్ కిషర్ మీద విచారణ?

దేశంలో అమలులో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ (పీకే)‌ ఢిల్లీ నుంచి కోల్‌క‌తాకు ప్ర‌యాణించార‌నే వార్త‌ల‌పై కేంద్రం విచార‌ణ చేపట్టింది.కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం, ప్రతిపక్షాల ఆరోపించాయి.దీంతో విమర్శలను తిప్పికొట్టడానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నుంచి సలహా కోసం ప్రశాంత్ కిశోర్‌కు పిలుపు వచ్చిందని చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో మమతా పిలుపు మేరకు ఆయన కార్గో విమానంలో కోల్‌క‌తాకు రహస్యంగా వెళ్లాడ‌ని ఆరోప‌ణ‌లు గుప్పుమన్నాయి.

ప్రశాంత్ కిశోర్ ప్రయాణం గురించి గ‌త మూడు రోజులుగా ఢిల్లీ,కోల్‌క‌తా మార్గాల గుండా ప్ర‌యాణించిన కార్గో విమాన‌యాన సంస్థ‌ల‌ను విచారిస్తున్నట్లు కేంద్ర విమానాయ‌న శాఖ వెల్ల‌డించింది.అయితే ప్ర‌శాంత్ త‌మ విమానాల్లో ప్ర‌యాణించ‌లేద‌ని స‌ద‌రు సంస్థ‌లు తెలిపాయని కేంద్రం ప్రకటించింది. మ‌రోవైపు రెండు న‌గ‌రాల విమానాశ్రయాలలో సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు పేర్కొంది. రెండు,మూడు రోజులలో పీకే ప్రయాణంపై డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ దర్యాప్తు పూర్తి చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.

అయితే తాను కార్గో విమానంలో రహస్యంగా కోల్‌కతా వెళ్లి వచ్చినట్లు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. మార్చి 19 తర్వాత నేను దేశంలోని ఏ విమానాశ్రయానికి వెళ్లలేదు.ఏవైనా రుజువులు ఉంటే నిరూపించాలని పీకే సవాల్ విసిరారు.కాగా మమతా బెనర్జీతో వరుస సమావేశాల తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ మార్చి 19న కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెళ్లిపోయినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి