iDreamPost

లాక్‌డౌన్‌ 3.0 … శ్రీకారం చుట్టిన పంజాబ్

లాక్‌డౌన్‌ 3.0 … శ్రీకారం చుట్టిన పంజాబ్

మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 3.0 కి శ్రీకారం చుట్టింది. లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు రాష్ట్రంలో పొడుస్తున్నట్టు అమరేందర్ సింగ్ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 3వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో మరో 14 రోజుల పాటు అంటే మే 17వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చుకునేందుకు మాత్రం యధావిధిగా అనుమతిస్తామని పేర్కొంది.

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈరోజు వరకు కరోనా సోకిన వారి సంఖ్య 31,787 కి చేరింది. ఇందులో 1,008 మంది ప్రాణాలు కోల్పోగా 7,797 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మహారాష్ట్ర 8,590 కేసులతో మొదటి స్థానంలో ఉండగా తరువాత గుజరాత్ 3548 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ లో 3,198 కేసులు నమోదయ్యాయి. ఇక పంజాబ్ లో 313 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో ఆ రాష్ట్రం 15వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు కరోనా వల్ల పంజాబ్ లో18 ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా పంజాబ్ ప్రభుత్వం ఏమాత్రం అవకాశం తీసుకోవడం లేదు. లాక్ డౌన్ పొడిగింపు కే ఆదినుంచి మొగ్గుచూపుతోంది.

ఈనెల 14వ తేదీన లాక్ డౌన్ మొదటి దఫా ముగుస్తున్న నేపథ్యంలో అంతకు వారం రోజులకు ముందే పంజాబ్ ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా అలాంటి విధానాన్ని మరోసారి అవలంబించింది. ఈనెల 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రుల నుంచి అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో లాక్ డౌన్ రెండో దఫా గడువు ముగుస్తున్న నేపథ్యంలో పంజాబీ ప్రభుత్వం మూడో దఫా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. రెండో దఫా లాక్ డౌన్ పొడిగింపు ప్రకటనను కేంద్ర ప్రభుత్వం చేయకముందే.. దేశంలో తెలంగాణ, పంజాబ్, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగిస్తున్నట్లు ముందుగానే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణించగా.. ఆ బాటలో ఏ ఏ రాష్ట్రాలు పయనిస్తాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి