iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 22 – యువర్ హానర్

లాక్ డౌన్ రివ్యూ 22 – యువర్ హానర్

మంచి కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలాసార్లు రుజువయ్యింది. కాకపోతే వాటిలో మెప్పించే కంటెంట్ ఉండాలంతే. అందులోనూ ఇబ్బడిముబ్బడిగా స్ట్రీమింగ్ యాప్స్ పెరిగిపోయక ఎందులో కంటెంట్ బాగుంటుందో వెతికి పట్టుకోవడం చూసేవాళ్ళకు పెద్ద సవాల్ గా మారిపోయింది. అందుకే బడ్జెట్ సైతం లెక్క చేయకుండా కంపెనీలు వీటి మీద భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఓటిటి అనగానే మనకు ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి రెండో మూడో గుర్తొస్తాయి తప్ప నిజానికి ఇంకా చాలానే తెలియనివి ఉన్నాయి. అందులో సోనీ లివ్ ఒకటి. పోటీ విషయంలో ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్న ఈ సంస్థ ఇటీవలే విడుదల చేసిన సిరీస్ యువర్ హానర్. 12 ఎపిసోడ్లతో మొత్తం ఏడున్నర గంటల పాటు సాగే ఈ క్రైమ్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం .

స్టొరీ

హైకోర్ట్ లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న జస్టిస్ బిషన్ ఘోస్లా(జిమ్మీ షేర్గిల్) ఒక్కగానొక్క టీనేజ్ సంతానం అబీర్ (పుల్కిత్ మకోల్)హైవే మీద కారులో వస్తూ ఒక యువకుడికి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. తీరా చూస్తే అతను కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ సత్బీర్( మహావీర్ బుల్లర్)రెండో కొడుకని తెలిసి బిషన్ తన కొడుకుని కేసు నుంచి తప్పించేందుకు మిలిటరీలో పని చేసే ఆఫీసర్ కాశి(వరుణ్ బదోలా)సహాయం కోరతాడు.

ఇద్దరూ కలిసి సాక్ష్యాలు మాయం చేయడం మొదలుపెడతారు . ఫలితంగా అబీర్ బదులు గుడ్దన్(పరాగ్ గుప్తా)తప్పుడు నేరం మీద జైలుకు వెళ్తాడు. దీని విచారణ చేపట్టిన లేడీ పోలీస్ ఆఫీసర్ కిరణ్(మిటా వశిస్ట్)అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కానీ బిషన్ అనుకున్నంత తేలికగా వ్యవహారాలు జరగవు. ఊహించని మలుపులతో ఎవరెవరో బిషన్ జీవితంలోకి ప్రవేశిస్తారు. అతను తన కొడుకుని చివరికి కాపాడుకోగలిగాడా, సత్బీర్ గ్యాంగ్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ ఎలా తప్పించుకుంది లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే అసలు కథ

నటీనటులు

ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మొహబ్బతే సినిమాలో పాలు గారే బుగ్గలతో లవర్ బాయ్ గా అలరించిన జిమ్మీ షెర్గిల్ ఇందులో వయసు మళ్ళిన తండ్రిగా సమాజంలో తన పరువుతో పాటు బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని తాపత్రయపడే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఖచ్చితంగా చెప్పాలంటే జీవించాడు. బిషన్ ఎక్కడా అరవడు. కేకలు వేయడు. తన సంఘర్షణని కేవలం హావభావాలతోనే ఎక్కువ పలికించాలి. ఈ విషయంలో మొదటి నుంచి చివరిదాకా జిమ్మీ బెస్ట్ ఇచ్చాడు. ఇన్నేళ్ళు ఎక్కువ సినిమాలు చేయకుండా ఎందుకు మిన్నకున్నాడా అనే సందేహం కలుగుతుంది పూర్తిగా చూశాక. బిషన్ స్నేహితుడు మిలిటరీ ఆఫీసర్ గా నటించిన వరుణ్ బదోలా తాను తప్ప ఇంకేవారిని ఊహించుకోలేనంత గొప్పగా పండించాడు. కథలో సెంట్రల్ పాయింట్ అయిన అబీర్ గా కుర్రాడు పుల్కిత్ మకోల్ నూటికి నూరు శాతం దానికి న్యాయం చేశాడు.

ఖాకీ దుస్తులు వేసుకున్న కరుడుగట్టిన ఆఫీసర్ గా నటించిన మీటా వశిష్ట్ గురించి చిన్న మాటల్లో చెప్పలేం. ఒళ్లంతా పొగరుతో తప్పు చేసినా తనదే పైచేయి అని మిడిసిపడే పాత్రలో సింప్లీ సూపర్బ్ అనిపించేసింది. జైలుకు వెళ్ళినప్పుడు ఫోన్ లో తన బిడ్డతో మాట్లాడే ఒక్క సీన్లో షబానా ఆజ్మీ రేంజ్ కనిపిస్తుంది. బిషన్ దగ్గర అప్రెంటీస్ గా చేసిన పరుల్ గులాటి, స్థానిక రౌడీగా నటించిన యష్ పాల్ శర్మ, జడ్జ్ అత్తయ్యగా సుహాసిని మూలే, బిషన్ కొలీగ్ గా బిక్రంజిత్ కన్వర్ పాల్ ఇలా ఇంకా పెద్ద క్యాస్టింగే ఉంది కాని ఫలానా వారే బాగా చేశారని చెప్పడానికి లేనట్టుగా దర్శకుడు వీళ్ళ నుంచి నటన రాబట్టుకున్నాడు. నువ్వే కావాలితో మనకూ బాగా పరిచయమున్న రిచా పల్లాడ్ కాశి భార్యగా మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కించుకుంది. ఆకట్టుకుంది కూడా. లిస్టు చెప్పుకుంటూ పోతే పెద్దదే ఉంది కాని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది మాత్రం వీళ్ళ గురించే

డైరెక్టర్ అండ్ టీం

దర్శకుడు నివాస్ ఇరానీ వెబ్ సిరీస్ ని రీమేక్ గా ఎంచుకున్నప్పటికీ ఇందులో ఇండియన్ సోల్ ఉండేలా రాసుకున్న ట్రీట్మెంట్ యువర్ హానర్ దాకా చివరిదాకా చూసేలా చేసింది. నిజానికిది కోర్ట్ రూమ్ డ్రామా కాదు. పోస్టర్లు ప్రోమోలు చూసి అలా అనుకుంటారు కానీ కోర్టుని పక్కదారి పట్టించేందుకు బయట ఎన్ని రకాల ఎత్తుగడలు వేయొచ్చో చూపించే డిఫరెంట్ జానర్ ఇది. మొత్తం కోర్టులో నడిచే సీన్లు అరగంట కన్నా ఎక్కువ ఉండవు. అంతా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంది. ఇషాన్ త్రివేది రచనలో ఎక్కడ బిగిసడలకుండా నివాస్ దీన్ని పరుగులు పెట్టించాడు.

మధ్యలో కొంత ల్యాగ్ అనిపించినా దాన్ని కూడా క్షమించేంత గొప్ప స్క్రీన్ ప్లే ఇందులో సమకూర్చుకున్నారు. క్యాస్టింగ్ లోనూ తన ప్రతిభను చాటుకున్న నివాస్ ఏడు గంటల నిడివినే ఇంత చక్కగా ట్యాకిల్ చేయగలిగినప్పుడు ఫీచర్ ఫిలింని ఇంతకన్నా గొప్పగా తీర్చిద్దిద్దగలడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నివాస్ మన తెలుగువాడే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు. మనోజ్ బాజ్ పాయ్ తో తీసిన శూల్(తెలుగు నాంది) తోనే తన ప్రతిభను చాటుకున్నాడు. 20 ఏళ్ళ అనుభవాన్ని గొప్పగా రంగరించి యువర్ హానర్ ని హిట్ చేశాడు

కరెల్ ఆంటోనిన్ సంగీతం థీమ్ కు తగ్గట్టు సాగింది. ఎక్కడా భారీ శబ్దాలు లేకుండా క్రైమ్ థ్రిల్లర్ కు కావాల్సిన మూడ్ ని చక్కగా క్యారీ చేసింది. మంచి ఇంటెన్సిటీ ఉన్న సన్నివేశాల్లో ఇతని ప్రతిభ కనిపిస్తుంది. బ్రిజితేష్ జె ఛాయాగ్రహణం 35 ఎంఎంలోనూ బ్రహ్మాండమైన క్వాలిటీతో అదరగొట్టింది. కౌశిక్ దాస్ ఎడిటింగ్ టెక్నికల్ గా ఉన్నతంగా ఉంది. ఎక్కడా మరీ బోర్ అనిపించకుండా సాధ్యమైనంత వేగంగా పరుగులు పెట్టేలా కత్తెరకు నీట్ గా పని చెప్పారు. ఇషాన్ సంభాషణలు చురుకుగా ఉన్నాయి. సమీర్ అండ్ టీమ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెచ్చుకోదగ్గవే. చిన్న తెర అనే ఫీలింగ్ రాకుండా సినిమా స్థాయిలో ఖర్చు పెట్టారు

చివరి మాట

వెబ్ సిరీస్ ల ప్రధాన లక్ష్యం ఎక్కువ నిడివిని ప్రేక్షకులతో ఎంగేజ్ చేయించడం. విసుగు రాకుండా కథనాన్ని నడిపినప్పుడే ప్రేక్షకులు చివరిదాకా అన్ని ఎపిసోడ్లు చూస్తారు. తాము ఖర్చు పెట్టిన డబ్బుకు సమయానికి న్యాయం జరిగిందా లేదాని ఆలోచిస్తారు. ఆ కోణంలో చూస్తే యువర్ హానర్ డిస్టిన్ట్షన్ లో పాసయ్యింది. కోర్ట్ డ్రామా అంటే గంటల తరబడి వాదోపవాదాలే ఉంటాయనే అభిప్రాయాన్ని బద్దలు కొడుతూ వెలుపల జరిగే అసలైన డ్రామాను రక్తికట్టించేలా చూపించిన యువర్ ఆనర్ నిరాశపరిచే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే మొదలుపెడితే బ్రేకులు లేకుండా ఏకబిగిన చూసే ఆప్షన్ పెట్టుకోండి. చివరిలో కనీస సంతృప్తిని ఖచ్చితంగా మిగులుస్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి