iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 32 – ప్రాణాంతక స్నేహం

లాక్ డౌన్ రివ్యూ 32 – ప్రాణాంతక స్నేహం

హిందీలో డైరెక్ట్ ఓటిటి రిలీజుల హవా జోరుగా ఉంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలవి ఒక్కొక్కటిగా చిన్నితెరలపై వచ్చేస్తున్నాయి. వీటికి ఆదరణ కూడా బాగా దక్కుతోంది. ఇంటి నుంచి కాలు కదపకుండా సరికొత్త వినోదాన్ని అందించే ఈ మార్పుకి ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా వసూళ్ళ విషయంలో గ్యారెంటీ లేని పరిస్థితిలో ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు. నిన్న జీ5 ద్వారా విడుదలైన యారా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఆసక్తి రేపే కంటెంట్ ఉందనేలా అభిప్రాయం కలిగించడంతో హింది సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళు దీని మీద లుక్ వేయాలని డిసైడ్ అయ్యారు. మరి వాళ్ళ నమ్మకాన్ని యారీ నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఇండో నేపాల్ సరిహద్దుల్లో కొన్ని అనూహ్య సంఘటనల వల్ల అయినవాళ్లను పోగొట్టుకున్న ఫగున్(విద్యుత్ జమాల్), మిత్వా(అమిత్ సాద్)చిన్నతనం నుంచి బ్రతుకు పోరాటంలో కలిగి తిరుగుతూ ప్రాణ స్నేహితులు అవుతారు. పాట్నాకు చెందిన లోకల్ డాన్ చమన్(సంజయ్ మిశ్రా)ద్వారా ఓ పెద్ద మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెడతారు. అక్కడే మరో ఇద్దరు రిజ్వాన్(విజయ్ వర్మ), బహద్దూర్(కెన్నీ బసుమర్తి)కు కలిసి నలుగురు చౌక్డీ గ్యాంగ్ గా పేరు తెచ్చుకుంటారు. స్మగ్లింగ్ కార్యకలాపాల్లో బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ క్రమంలో పరిచయమైన స్టూడెంట్ నక్సలైట్ గా ముద్రపడిన సుకన్య(శృతి హాసన్)తో ఫగున్ ప్రేమలో పడతాడు. కానీ ఒక గ్యాంగ్ సభ్యుడు చేసిన మోసం వల్ల అందరూ జైలు పాలవుతారు. శిక్ష అనుభవించి బయటికి వచ్చాక చాలా సంఘటనలు జరుగుతాయి. ఫ్రెండ్స్ లో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవడం మొదలవుతుంది. ఒకపక్క శత్రువులు, మరోపక్క పోలీసులు ఇలా పద్మవ్యూహంలో ఇరుక్కుంటారు. చివరికి ఎవరు మిగిలారు అసలు దోషి ఎవరు అనేదే అసలు స్టోరీ బి

నటీనటులు

తుపాకీ, సికందర్ సినిమాలతో మనకూ పరిచయమున్న విద్యుత్ జమాల్ దే ఇందులో కీలక పాత్ర. అందరికీ సమాన ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఎక్కువగా తనే హైలైట్ అవుతాడు. ఫగున్ గా తన పరిధి మేరకు చేయాల్సింది చేశాడు కానీ వీక్ స్క్రిప్ట్ వల్ల ఎంత ట్రై చేసినా క్యారెక్టర్ ఎలివేట్ కాలేకపోయింది. తర్వాత చెప్పుకోదగిన పాత్ర అమిత్ సాద్. అమెజాన్ ప్రైమ్ బ్రీత్ సిరీస్ తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న అమిత్ ఇందులోనూ మంచి లెన్త్ దక్కించుకున్నాడు కానీ తనదీ విద్యుత్ జమాల్ సమస్యే. ఎంత ప్రయత్నించినా ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఉన్నంతలో మేనేజ్ చేశాడు. గ్యాంగ్ లో మిగిలిన ఇద్దరు సంజయ్, కెన్నీలు ఏదో మొక్కుబడిగా ఉన్నారు తప్ప కనీస స్థాయిలో రిజిస్టర్ కాలేనంత పేలవంగా ఉన్నాయి వాళ్ళ పాత్రలు, పెర్ఫార్మెన్సులు.

ఆశ్చర్యకరంగా శృతి హాసన్ ఇందులో అందంగా ఉంది. లుక్స్ తోనే కాదు యాక్టింగ్ తోనూ ఆకట్టుకుంది. కాటమరాయుడులో కొంత గ్లామర్ తగ్గినట్టుగా అనిపించినా ఇందులో మాత్రం మునుపటి స్పార్క్ కనిపించింది. అభిమానుల కోసం కొన్ని హాట్ సీన్స్ ఉన్నాయి కానీ అవి మరీ స్పెషల్ గా అనిపించవు. ఇలాంటి తను ఎప్పుడో డి డేలో జాన్ అబ్రహంతోనే చేసింది. మిగిలిన తారాగణం విషయానికి వస్తే అందరూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఆ గ్యాంగ్ కాకుండ్ ప్రత్యేకంగా గుర్తుండిపోయే స్థాయిలో ఎవరూ లేరు. సిక్కు పోలీస్ ఆఫీసర్ గా నట్గించిన వ్యక్తి కూడా తేలిపోయాడు

డైరెక్టర్ అండ్ టీం

ఇది 2011లో ఓ ఫ్రెంచ్ మూవీ రీమేక్. కథనైతే తీసుకున్నారు కాని అందులో ఆత్మని సరిగ్గా పసిగట్టలేకపోయారు. కథా వస్తువు 1950 నుంచి ప్రారంభమవుతుంది. దానికి తగ్గట్టే రెట్రో లుక్ వచ్చేందుకు ఆర్ట్ డిపార్ట్ మెంట్ చాలా శ్రద్ధ తీసుకుంది కాని బడ్జెట్ పరిమితుల వల్లనేమో అది అంత ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీద కనిపించదు. మూడు కాలాల్లో ఆ గ్యాంగ్ ప్రస్థానాన్ని చూపించాలనుకున్న దర్శకుడు తిగ్మాన్షు ధూలియా ఆలోచన మంచిదే కాని దానికి కావాల్సిన బలమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. పాన్ సింగ్ తోమర్, శాగిర్డ్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ లాంటి విలక్షణమైన సినిమాలు తీసి రచయతగానూ దిల్ సే లాంటి క్లాసిక్స్ కు పని చేసిన ధూలియా నుంచి ఆశించే అవుట్ పుట్ ఇది ముమ్మాటికి కాదు.

ఫస్ట్ హాఫ్ మొత్తం గ్యాంగ్ బిల్డప్ లతో పాటు అనవసర ప్రహసనాలతో చాలా టైం వేస్ట్ అవుతుంది. దానికి తోడు ఇలాంటి సినిమాలకు కావాల్సిన ఎమోషనల్ థ్రెడ్స్ ని చాలా వీక్ గా రాసుకున్నారు ధూలియా. ఏదో మంచి మలుపు తీసుకుంటుందని అనుకునే లోపు ఒక్కసారిగా గ్రాఫ్ ని చాలా కిందకు తెచ్చేశారు. ఉన్నంతలో శృతి హాసన్ ఉన్న ఎపిసోడ్స్ కాస్త ఎంగేజింగ్ గా ఉన్నాయి. వాటిని మినహాయించి చూస్తే అంతా పిప్పే. యారి చూస్తున్నంత సేపు ఆ మధ్య తెలుగులో వచ్చిన రవితేజ డిస్కో రాజానే గుర్తుకు వస్తుంది. అది కూడా ఇదే తరహాలో 70 దశకం నేపధ్యంగా తీసుకుని బోర్లా పడ్డదే. అందులో లాగే సునీల్ క్యారెక్టర్ కు ఇచ్చిన ట్విస్టు యారిలోనూ ప్రయత్నించారు కానీ ఇక్కడా అదే ఫలితం దక్కింది.

విద్యుత్ జమాల్, అమిత్ ల మీదే భారం వేసి మిగిలిన పాత్రలను లైట్ గా తీసుకోవడం కూడా యారిని బాగా దెబ్బ తీసింది. వరసగా మర్డర్లు చూపిస్తూ, పదే పదే రక్తపాతాన్ని చొప్పించినంత మాత్రాన ఆడియన్స్ ఎగ్జైట్ అయిపోరు. దీని కన్నా పదింతల స్థాయిలో ఎన్నో మాఫియా కథలను చూసిన కళ్ళకు యారిలో కించిత్ కొత్తదనం కూడా కనిపించదు. మాములుగా ఇలాంటి స్టోరిస్ లో హీరో ఒక్కడే ఉంటాడు. ఇందులో నలుగురు ఉంటారు. అంతే తేడా. అనవసరమైన బిల్డప్పులు కూడా చాలా చొప్పించారు. ఏదో జమాల్ డై హార్డ్ ఫ్యాన్స్ తప్ప ఇంకెవరికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు.

గౌరవ్-షాన్-సిద్దార్థ్-అంకిత్ నలుగురు కలిసి ఇచ్చిన పాటలు ఫార్వార్డ్ కు మాత్రమే పనికొచ్చాయి. సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కాస్తైనా వినే మూడ్ కూడా ఇవ్వలేదు దర్శకుడు. రిషి పంజాబీ ఛాయాగ్రహణంలో తన సీనియారిటీ కనిపిస్తుంది. చాలా క్వాలిటీ చూపించాడు. గీత సింగ్ ఎడిటింగ్ మాత్రం తీసికట్టుగా ఉంది. కోత వేసే అవకాశం చాలా ఉన్నా వదిలేయడంతో ప్రేక్షకులు తమ మీద తాము జాలి పడాల్సి వచ్చింది. ప్రొడక్షన్ మాత్రం రిచ్ గానే ఉంది. కాంప్రోమైజ్ అయినట్టు కనిపించినా ఇలాంటి క్యాస్టింగ్ మీద ఇంత ఖర్చు పెట్టడమే గొప్ప విషయం

ప్లస్ గా అనిపించేవి

విద్యుత్ జమాల్
శృతి హాసన్
కెమెరా పనితనం
ఆర్ట్ వర్క్

మైనస్ గా తోచేవి

ఆసక్తి రేపని నేపధ్యం
పాత కథ
సంగీతం
ముగ్గురు తప్ప ఇతర ఆర్టిస్టులు

కంక్లూజన్

ఎంత ఇంట్లో నుంచి చూసే సినిమా అయినా మినిమం కంటెంట్ ఆశిస్తారు ప్రేక్షకులు. కేవలం క్యాస్టింగ్ చూసో లేదా ట్రైలర్ ని బట్టో వాళ్ళకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి. యారా వాటిలో దేన్నీ అందుకోలేని స్థాయిలో నిరాశపరిచింది. రెండు గంటల పది నిమిషాల విలువైన సమయాన్ని కేటాయిస్తే దానికి న్యాయం చేకూర్చడంలో ఫెయిల్ అయ్యింది. గ్యాంగ్ స్టార్ సినిమా అనగానే గన్స్, మర్డర్స్ ఉంటె చాలు అనుకునే మేకర్స్ కు యారా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోయింది. ఇంకే ఆప్షన్స్ లేవనుకున్నప్పుడు తప్ప లుక్ వేయొచ్చు కానీ మీ టైం విలువైనదే అయితే యారా మీ కప్ అఫ్ కాఫీ కాదు.

ఒక్క మాటలో

యారా – పాతసీసాలో పాత సారా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి