iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 33 – భావోద్వేగాల గణితం

లాక్ డౌన్ రివ్యూ 33  – భావోద్వేగాల గణితం

చక్కని వినోదం డిజిటల్ రూపంలో థియేటర్లలో కాకుండా నేరుగా స్మార్ ఫోన్లు, టీవీలోకి వచ్చేస్తుంటే ఎంటర్ టైన్మెంట్ కి కొత్త అర్థం దొరుకుతున్న మాట వాస్తవం. చిన్నా చితక సినిమాలు కాకూండా స్టార్లు ఉన్న మూవీస్ కూడా ఓటిటిలోకి డైరెక్ట్ రిలీజ్ అవుతుండటం పరిశ్రమకు కొత్త దారి చూపిస్తోంది. ఇది స్థిరంగా ఉంటుందా లేక లాక్ డౌన్ అయ్యాక తగ్గిపోతుందా అనేది ఇప్పటికి చెప్పలేం కానీ రిస్క్ లేకుండా సరికొత్త చిత్రాలను హ్యాపీగా కుటుంబంతో సహా చూడటం మాత్రం ఎవ్వరూ ఊహించనిది. ఈ సిరీస్ లో తాజాగా విడుదలైన శకుంతలా దేవి మీద ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. నిజ జీవిత బయోపిక్ ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో పాటు విద్యా బాలన్ టైటిల్ రోల్ పోషించడం ఆసక్తిని రేపింది. మరి దానికి తగ్గట్టు ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

కర్ణాటకలో పుట్టిపెరిగిన శకుంతలాదేవి(విద్యా బాలన్) ఐదేళ్ళ ప్రాయంలోనే అసాధారణ రీతిలో మ్యాథ్స్ ప్రాబ్లెమ్స్ ని పరిష్కరించడంలో అశేష ప్రతిభ చూపుతూ ఉంటుంది. దీన్ని గుర్తించిన తండ్రి(ప్రకాష్ బెల్వాడి)తనను స్కూల్ కు పంపకుండా షోలు చేయిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. వయసొచ్చాక తొలిప్రేమలో శకుంతల మోసపోతుంది. దీంతో మనసు విరిగి అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతుంది. అక్కడ పరిచయమైన స్పానిష్ దేశస్థుడు జేవియర్(లుసా కల్వాని)సహాయంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోతాడు.

అప్పుడు పరిచయమైన పారితోష్(జిస్సు సేన్ గుప్తా)తో ప్రేమ పెళ్లి దాకా వెళ్తుంది. ఆడపిల్ల పుట్టాక తన పెంపకం విషయంలో అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటారు. తల్లి దగ్గరే పెరిగిన అనుపమ(సాన్య మల్హోత్రా) నాన్నకు దూరమైన బాధ శకుంతల మీద ద్వేషం పెంచుకుంటుంది. అజయ్(అమిత్ సాద్)ని లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. కొన్ని పరిణామాల తర్వాత శకుంతల మీదే అనుపమ క్రిమినల్ కేసు పెట్టేదాకా పరిస్థితి వస్తుంది. అసలేం జరిగింది, వీళ్ళ జీవితం ఎందుకు ఇన్ని మలుపులు తీసుకుంది అనేది తెరమీదే చూడాలి

నటీనటులు

ఇది పూర్తిగా విద్యాబాలన్ ఒంటిచేత్తో నడిపించిన మ్యాజికల్ యాక్టింగ్ షో. ది డర్టీ పిక్చర్-తుమారి సులు-కహాని-బేబీ జాసూస్-మిషన్ మంగళ్ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో వాటిని నిలబెట్టిన విద్యా బాలన్ ఇందులో మరోసారి తన పెర్ఫార్మన్స్ తో ఆదరగొట్టింది. కథ ప్రకారం మూడు దశల వయసులో కనిపించాలి కాబట్టి దానికి తగ్గట్టే వేషబాషలతోనే కాదు ఆహార్యం, మేకప్, హావభావాలతోనే చాలా జాగ్రత్తలు తీసుకుని దటీజ్ విద్యా అనిపించింది.

శకుంతలాదేవి స్వభావం స్వతహాగా చాలా దుందుడుకుగా ఉంటుంది. తన మాటే నెగ్గాలన్న పంతం, తాను కోరుకున్నదే జరగాలన్న పట్టుదల ఆమె లక్షణాలు. వీటిని విద్యా బాలన్ ఆవాహన చేసుకుని మరీ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆద్యంతం కట్టిపడేస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో తానెం పోగొట్టుకున్నానో గుర్తించి బిడ్డకు దగ్గరయ్యే ఎపిసోడ్ గురించి చెప్పాలంటే జీవించిదన్న మాట చిన్నదే. నిజానికి అక్కడక్కడా వీక్ గా అనిపించే స్క్రిప్ట్ ని తన బలంతో చివరిదాకా చూసేలా చేసింది విద్యా బాలనే .

కూతురిగా నటించిన సాన్యా మల్హోత్రా తనకిచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చింది. విద్యా తర్వాత ఎక్కువ గుర్తుండిపోయేది తనే. ఈ మధ్య వెబ్ సిరీస్ సీరియస్ రోల్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న అమిత్ సాద్ ఇందులో వెరైటీగా మంచి హోమ్లీ హస్బండ్ గా మెప్పిస్తాడు. భీష్మ విలన్ జిస్సు సేన్ గుప్తా శకుంతలా భర్తగా నప్పాడు. కాకపోతే వయసయ్యాక వచ్చే సన్నివేశాల్లో మేకప్ సరిగ్గా అతకలేదు. ఉన్నదీ కాసేపే అయినా శకుంతల కెరీర్ ని మలుపు తిప్పే జేవియర్ గా చేసిన లూసా కల్వని బాగున్నాడు. షీబా చద్దా, నైలా మసూద్, బేబీ చాహత్ తేవాని, బేబీ స్పందన్ చతుర్వేది, ఇష్పితా చక్రవర్తి, పూర్ణేందు తదితరులు అందరూ ఇలా కనిపించి అలా వెళ్ళిపోయేవాళ్ళే. కొద్ది నిమిషాలే అయినా ఓపెనింగ్ లో చిన్ని శకుంతలాదేవిగా చేసిన ఆరైన నంద్ ఆకట్టుకుంది.

డైరెక్టర్ అండ్ టీం

రాను రాను బయోపిక్కులు రొటీన్ గా మారుతున్న తరుణంలో అను మీనన్ తీసుకున్న శకుంతలాదేవి కథ నిజంగా ఆసక్తికరమైనదే. అందులో సందేహం లేదు. కోట్లలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే దేవుడు కానుకగా ఇచ్చే టాలెంట్ ని, అలాంటి ప్రయాణాన్ని తెరమీద చూపాలనుకోవడం మంచి ప్రయత్నమే. నిజానికి ఇలాంటివాళ్ళు ఉన్నారని కూడా తెలిసిన ప్రేక్షకులు తక్కువే. అందుకే అను మీనన్ చాలా తెలివిగా ఈ ప్లాట్ ను ఎంచుకున్నారు. అయితే శకుంతలాదేవికి ఎంత గొప్ప ప్రతిభ ఉన్నా ఆవిడ జీవితంలో స్క్రీన్ మీద గొప్పగా పండేంత డ్రామా లేదు. భర్తతో విడాకులు, కన్నబిడ్డ తనకు ఇష్టపడకపోవడం అనే రెండు కీలక మలుపులు తప్ప ఈవిడ లైఫ్ లో ఇంకే ప్రత్యేకత లేదు.

ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకునే అను మీనన్ సినిమాటిక్ ఎమోషన్స్ ని చొప్పించే ప్రయత్నం బలంగా చేశారు. ఇందులో చాలా మటుకు సక్సెస్ అయ్యారు కూడా. తల్లితండ్రులు-కన్నకూతురు మధ్య నడిచే ట్రాక్స్ ని చాలా చక్కగా డిజైన్ చేసుకుని ఆర్టిస్టుల సహకారంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యే ప్రయత్నం సఫలీకృతమయ్యింది. కానీ శకుంతలాదేవికున్న అద్భుత ప్రతిభ ఎలా వచ్చిందనే కారణం భగవంతుడి కానుకగా చూపించినప్పటికీ తన ప్రయాణంలో ఆవిడ ఎదురుకున్న అరుదైన సంఘటనలు ఏవైనా చూపించి ఉంటే బాగుండేది. మ్యాథ్స్ ఎక్స్ పర్ట్ అనే ప్రత్యేక లక్షణాన్ని పక్కనపెట్టి చూస్తే ఈ సినిమా చాలా మాములుగా అనిపిస్తుంది.

ఆవిడ టాలెంట్ ని చూపించే ఎపిసోడ్స్ లో కూడా షోలకు వచ్చిన ఆడియన్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం దానికి వెంటనే క్షణాల్లో సొల్యూషన్ చెప్పేయడం ఇదంతా ఒకదశ దాటాక రిపీట్ అనిపించే ఫీలింగ్ ఇస్తుంది. అయినప్పటికీ విసుగు రాకుండా విద్యా బాలన్, స్క్రీన్ ప్లే రెండు కంచుకోటలాగా కాపాడాయి. చివరిదాకా చూసేలా చేయడంలో ఈ రెండే కీలక పాత్ర పోషించాయి. దానికి తోడు భావోద్వేగాలు కూడా చక్కగా పండటంతో శకుంతలాదేవి బ్యాడ్ ఫిలిం అనే ముద్ర నుంచి చాలా సేఫ్ గా బయట పడింది. కాకపోతే ఆవిడ లైఫ్ లో ఎదురుకున్న సవాళ్లు, కష్టాలు, కన్నీళ్లు ఇంకాస్త డ్రమాటిక్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ నిరాశపరిచే ఛాన్స్ అయితే లేదు.

సచిన్-జిగర్ సంయుక్తంగా కంపోజ్ చేసిన పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. కథలో లీనమయ్యాక వాటితో పెద్దగా అవసరం లేదనిపిస్తుంది కనక ఎంత వద్దనుకున్నా ఆటోమేటిక్ గా వేలు ఫార్వార్డ్ ఆప్షన్ వైపు వెళ్ళిపోతుంది. కరణ్ కులకర్ణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. కేల్కో నకహార ఛాయాగ్రహణం థీమ్ కు తగ్గట్టు రెట్రో లుక్ ని చూపించడంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో పోటీ పడి మంచి అవుట్ పుట్ ఇచ్చింది. అంతర లాహిరి ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ అయితే పది నిముషాలు దాకా తగ్గి ఇంకాస్త వేగం పెరిగేది. ఇషా మల్హోత్రా సంభాషణలు న్యాచురల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. స్టార్లు లేని ఇలాంటి సబ్జెక్టు మీద బాగానే ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

విద్యా బాలన్ నటన
ఎమోషన్స్
కథనం
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

సింగిల్ లైన్ స్టొరీ
కొంత సాగతీత
గొప్ప మలుపులు లేకపోవడం

కంక్లూజన్

ఇప్పటికే ఎన్నో బయోపిక్కులు చూసేసిన ప్రేక్షకులకు శకుంతలాదేవి మరీ గొప్పగా అనిపించదు కానీ ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ముఖ్యంగా శకుంతలాదేవి పాత్రలో విద్యా బాలన్ లీనమైన తీరు కట్టిపడేస్తుంది. ఎమోషన్స్ కూడా సరైన రీతిలో ఆవిష్కృతం కావడంతో ఓవరాల్ గా డీసెంట్ వాచ్ గా నిలిచింది. కానీ ఆవిడ జీవితంలో ఏవేవో మలుపులు, ఊహించని సంఘటనలు ఆశిస్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. ఇది ఒక వండర్ విమెన్ లైఫ్ జర్నీ కన్నా ఎక్కువగా ఆమె ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్ గా తీయడంతో ఆ కోణంలో చూస్తేనే శకుంతలాదేవి మెప్పిస్తుంది నచ్చుతుంది.

ఒక్క మాటలో

శకుంతలాదేవి – విద్యాబాలన్ వన్ విమెన్ షో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి