iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 43 – సడక్ 2

లాక్ డౌన్ రివ్యూ 43 – సడక్ 2

హోమ్ మల్టీ ప్లెక్స్ కాన్సెప్ట్ తో సరికొత్త సినిమాలను నేరుగా ఇంటికే తీసుకొస్తున్న హాట్ స్టార్ ఇవాళ సడక్ 2 విడుదల చేసింది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నెపోటిజం వ్యతిరేకదారులకు మెయిన్ టార్గెట్ గా మారిన ఈ సినిమా ఇప్పటికే 12 మిలియన్ల డిజ్ లైకులుతో కొత్త రికార్డు సృష్టించింది. సంజయ్ దత్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా క్వాలిటీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో ప్రచారంలో ఉంటూ వచ్చిన సడక్ 2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలతో తగ్గట్టు ఉందా లేక ట్రాలింగ్ కు మరింత అవకాశం ఇచ్చిందా రివ్యూలో చూద్దాం

కథ

జనాన్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న దొంగ బాబా గ్యాన్ ప్రకాష్(మకరంద్ దేశ్ పాండే)కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటుంది ఆర్యా(అలియా భట్). బాగా డబ్బున్నప్పటికీ తన తండ్రి(జిస్సు సేన్ గుప్తా)కూడా అతని మాయలోనే ఉండటంతో ఇల్లు వదిలి విశాల్ (ఆదిత్య రాయ్ కపూర్)తో కలిసి ఓ టాక్సీ డ్రైవర్ రవి కిషోర్(సంజయ్ దత్)సహాయంతో కైలాష్ యాత్రకు బయలుదేరుతుంది. కానీ మధ్యలో ఆటంకాలు ఎదురై ముగ్గురి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. దీనికంతా అసలు కారణం తెలుసుకుని ఆర్యా షాక్ తింటుంది. గతంలోనే భార్యను కోల్పోయి చావు కోసం ఎదురు చూస్తున్న రవి కిషోర్ ఆర్యా ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరమీద చూసి తరించాల్సిందే.

నటీనటులు

సడక్ 2 మీద అభిమానులు ఆసక్తి చూపించడానికి మొదటి కారణం సంజయ్ దత్ . మూడు దశాబ్దాల క్రితం ఇదే టైటిల్ తో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఇప్పటికీ ఎందరికో గుర్తుండిపోయింది. అందుకే దానికి కొనసాగింపు అనగానే ఈ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి. అప్పుడంటే మాంచి హుషారు మీదున్న ఉడుకు రక్తం కాబట్టి సంజు చెలరేగిపోయాడు కానీ ఇప్పుడు కూడా అదే స్థాయి ఆశించడం కరెక్ట్ కాదు.

అయినప్పటికీ తనవంతుగా రవి కిశోర్ రోల్ లో బెస్ట్ ఇచ్చాడు. మిగిలిన క్యారెక్టర్లు బాలన్స్ తప్పుతున్నా, కథనం పక్కదారి పడుతున్నా సాధ్యమైనంత మేరకు తన సీనియారిటీతో నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశాడు. కాకపోతే అసలు సడక్ ని తలుచుకోకుండా చూస్తేనే బెటర్. అందులో కంటెంట్ కనిపిస్తే ఇందులో హంగులు డామినేట్ చేశాయి. అందుకే అసంతృప్తి కలిగే ఛాన్స్ ఉంది.

ఇక అలియా భట్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయింది. రాజీ లాంటి గొప్ప పాత్రల ముందు ఇవన్ని పెద్దగా ఆనవు కానీ ఉన్నంతలో డీసెంట్ గానే చేసింది. కాకపోతే ఇటీవలి కాలంలో ఒకే తరహా ఎక్స్ ప్రెషన్లు రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. తను నటనను ఇంకాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ లో సీత లాంటి బరువైన పాత్ర ఎలా మోస్తుందో చూడాలి. ఆదిత్య రాయ్ కపూర్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.

టాలెంట్ అంతంత మాత్రంగానే ఉన్న ఇతగాడిని దర్శకులు సరైన రీతిలో వాడుకోక మొక్కుబడిగా మిగిలిపోతున్నాడు. చాలా కాలం తర్వాత గుల్షన్ గ్రోవర్ విలన్ గా అలరించాడు. భీష్మతో ఇక్కడా ఉనికిని చాటుకున్న జిస్సుసేన్ గుప్తా వయసుకు మించిన పాత్ర చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. దొంగ బాబాగా మకరంద్ దేశ్ పాండే అతి అనిపించాడు. ఇతర ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

భారతీయ సినిమా చరిత్రలో ఒక్క బాహుబలిని మినహాయించి ఇప్పటిదాకా సీక్వెల్స్ పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు. అందులోనూ ఇప్పటి తరానికి పెద్దగా అవగాహన లేని సడక్ కి కంటిన్యుయేషన్ అంటే అంతగా ఆసక్తి లేకపోవడానికే అవకాశాలు ఎక్కువ. అయితే క్యాస్టింగ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్ వల్ల దీనికి మంచి హైప్ వచ్చింది. కానీ దర్శకత్వానికి ఎప్పుడో టాటా చెప్పిన మహేష్ భట్ తన బ్రాండ్ కు తగ్గ కథను ఎంచుకోవడంలోనే మొదటి తప్పు చేశారు.

దొంగబాబాల కాన్సెప్ట్ వినడానికి ఇంటరెస్టింగ్ గా అనిపించినా దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో సరైన మలుపులతో కూర్చుకోవడంలో చేసిన తప్పుల వల్ల సడక్ 2 భరించలేని నసగా మారిపోయింది. గంట గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో ఎంతకీ ముందుకు సాగదు. ఏదో పూజా భట్ ఇప్పటికీ ప్రేక్షకుల ఆరాద్య దేవత అనుకున్నారు కాబోలు అవసరానికి మించి అసలు సినిమాలోనే లేని ఆమె పాత్ర చుట్టూ ఓవర్ డ్రామా నడిపించి సంజయ్ దత్ లాంటి యాక్టర్ ని సైతం నిస్సహాయంగా మార్చేశాడు.

నిజానికి సడక్ టైటిల్ కి స్టోరీకి పెద్దగా సంబంధం లేదు. ఏదో కనెక్ట్ చేయాలి కాబట్టి అన్నట్టు అలియాను రోడ్డు మీదకు తీసుకొచ్చారు కానీ ఫస్ట్ సీన్లోనే మెంటల్ హాస్పిటల్ నుంచి అంత ఈజీగా తప్పించుకోవడంలో లాజిక్ ని పూర్తిగా వదిలేశారు. అక్కడితో మొదలు సంజయ్ దత్ తో పరిచయాన్ని ఎమోషనల్ గా ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. పాత్రలన్నీ చాలా కృత్రిమంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మహేష్ భట్ ఆలోచనలు ఎంత ఫేడ్ అవుట్ అయ్యాయో ఆణువణువూ కనిపిస్తూనే ఉంటుంది.

రెండో సగంలో రెండు మూడు యాక్షన్ సీన్స్ లో తప్ప ఎక్కడా టెంపో కనిపించదు. థియేటర్ అయ్యుంటే లేచి రావాలి అనిపించేలా స్క్రీన్ ప్లే సాగింది. ఓటిటి కావడంతో హాయిగా రిమోట్ కంట్రోల్ కు పని చెప్పక తప్పలేదు. కథనాన్ని బిగుతుగా రాసుకుని ఎంగేజ్ చేసే సన్నివేశాలు సెట్ చేసుకుని ఉంటే సడక్ 2 కనీసం డీసెంట్ వాచ్ గా అయినా నిలిచేది. సబ్జెక్టులో విషయం లేనప్పుడు ఎంత మంచి తారాగణమైనా చేష్టలుడిగి పోవాల్సిందే అని చెప్పడానికి ఈ సినిమా చూపించొచ్చు

అంకిత్ తివారి-జీత్ గంగూలీ-సామిద్ ముఖర్జీ-ఉర్వి-సునిజిత్ ఇలా ఐదుగురు కలిసి ఇంతోటి దానికి సంగీతం సమకూర్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. పాటలు, నేపధ్య సంగీతం రెండూ పోటీపడి నీరసం తెప్పించాయి. జే ఐ పటేల్ ఛాయాగ్రహణం మరీ ఛాలెంజింగ్ గా ఏమి లేదు. కష్టపడకుండానే పని జరిగిపోయింది. సందీప్ కురూప్ ఎడిటింగ్ సోసోనే. విషేశ్-ఫోక్స్ స్టార్ సంస్థలకు మరీ భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం పడలేదు

ప్లస్ గా అనిపించేవి

సంజయ్ దత్
ఓటిటిలో చూడటం
కొంతమేర అలియా
జిస్సు సేన్

మైనస్ గా తోచేవి

నీరసమైన కథనం
సంగీతం
అవుట్ డేటెడ్ టేకింగ్
ఇంకా చాలా ఉన్నాయి

కంక్లూజన్

లాక్ డౌన్ టైంలో ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే వెసులుబాటు కలగడం ప్రేక్షకులకు ఇలాంటి సినిమాల విషయంలో కరెక్టే అనిపిస్తుంది. పేరున్న యాక్టర్లు ఉంటే సరిపోదు కాస్త దమ్మున్న కథ కూడా ఉండాలని మహేష్ భట్ లాంటి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ మర్చిపోయి సడక్ 2 లాంటి మూవీ ఇస్తారని ఎవరూ ఊహించరు. ఏ కారణంతోనో సోషల్ మీడియా ట్రోలింగ్ అవసరం లేదు ఇందులో కంటెంట్ చాలు అనేలా నెటిజెన్లకు కావలసినంత స్టఫ్ ఇచ్చేశారు మహేష్ భట్.అతి కష్టం మీద సంజయ్ దత్ వీరాభిమానులు ఆయన కోసం ఓ లుక్ వేయొచ్చు కానీ అంతకు మించి ఇంకేది ఆశించినా సినిమా చూశాక కలిగే పరిణామాలకు స్వీయ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

సడక్ 2 – గతుకుల రోడ్డు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి