iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 34 – ఒంటరి రాత్రి హత్యలు

లాక్ డౌన్ రివ్యూ 34 – ఒంటరి రాత్రి హత్యలు

ఊహించని ఉత్పాతం కరోనా రూపంలో దాడి చేసిన వేళ తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేయడం తప్ప ప్రస్తుతానికి నిర్మాతలకు వేరే మార్గం కనిపించడం లేదు . అందరూ కాకపోయినా కొందరైతే ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే డిజిటల్ రిలీజులు జరగగా మరికొన్ని భారీ సినిమాలు రాబోవు రోజులలో సందడి చేయబోతున్నాయి. తాజాగా వచ్చిన మూవీ రాత్ అకేలీ హై. నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ మూవీ మీద క్రైమ్ జానర్ లవర్స్ కు మంచి అంచనాలు ఉన్నాయి. నవజుద్దిన్ సిద్దిక్- రాధికా ఆప్టే కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి వాటిని అందుకునేలా రాత్ అకేలీ హై ఉందో లేదో రివ్యూ

కథ

బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన రఘుబీర్ సింగ్(ఖలీద్ త్యాగి)ముసలి వయసులో రాధ(రాధికా ఆప్టే)తో రెండో పెళ్ళికి సిద్ధపడతాడు. అదే రోజు రాత్రి శోభనం గదిలో అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడతాడు. దీన్ని విచారించడానికి వస్తాడు జతిల్ యాదవ్(నవాజుద్దీన్ సిద్ధిక్). ఏ చిన్న క్లూ దొరకని పరిస్థితిలో అనుమానం ఆ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే స్థానిక ఎమ్మెల్యే మున్నా రాజా(ఆదిత్య శ్రీవాస్తవ) మీద వస్తుంది. అయినప్పటికీ ఆధారాలు దొరకవు. ఈలోగా చాలా పరిణామాలు చోటు చేసుకుని ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు చంపబడతారు. జతిల్ యాదవ్ దీన్ని సవాల్ గా తీసుకుని ఛేదించడం మొదలుపెడతాడు. నివ్వెరపోయే రీతిలో అసలు హంతకులు, దాని తాలూకు సంఘటనలు బయట పడతాయి. అవేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే

నటీనటులు

ఇందులో యాక్టర్స్ ఎందరు ఉన్నారనేది పక్కన పెడితే దాదాపుగా ప్రతి ఫ్రేమ్ లో నవాజుద్దీన్ సిద్ధిక్, రాధికా ఆప్టేలే కనపడతారు. తనకు బాగా అలవాటున్న ఇలాంటి పాత్రను నవాజ్ అలవోకగా చేసుకుంటూ పోయాడు. పరిస్థితులు తనకు ఎదురు తిరుగుతున్నా చలించకుండా కర్తవ్యం పాటించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా దీనికి చాలా ప్లస్ అయ్యాడు. అయితే ఇది మరీ స్పెషల్ రోల్ అయితే కాదు. ఒకరకంగా ఇతనితో సహా ఎందరో హీరోలు ఎన్నోసార్లు పోషించిన పాత్ర. పెద్ద తేడా ఏముండదు.

కాకపోతే తన బాడీ లాంగ్వేజ్, తనకు మాత్రమే సొంతమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. రాధికా ఆప్టే దగాపడిన పేద అమ్మాయిగా ఒదిగిపోయి నటించింది. లోపాలు ఎత్తిచూపే అవకాశం ఇవ్వలేదు. ఎస్పి గా చేసిన సీనియర్ నటుడు దర్శకుడు తిగ్మాన్షు ధూళియా, నెగటివ్ టచ్ ఉన్న విక్రమ్ సింగ్ పాత్రలో నిశాంత్ దహియాలు బాగానే చేశారు. శ్వేతా త్రిపాఠి, శివాని రఘువంశీ, ఆదిత్య శ్రీవాస్తవ, పద్మావతి రావు, ఇలా అరుణ్, స్వానంద్, శ్రీధర్ దూబే తదితరులు చాలా సహజంగా ఉన్నారు. ఇంకొన్ని కీలక పెర్ఫార్మన్సుల గురించి చెప్పుకోవచ్చు కానీ ట్విస్టులు రివీల్ అవుతాయి కాబట్టి చెప్పడం లేదు

డైరెక్టర్ అండ్ టీం

ఓపెనింగ్ సీన్లో ఒళ్ళు గగుర్పొడిచే విధంగా రెండు హత్యలు జరుగుతాయి. ఇది చూడగానే మనమో గొప్ప ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని చూడబోతున్నామని ప్రిపేర్ అయిపోతాం. ఆ తర్వాత కొద్దినిమిషాలకే మరో మర్డర్ జరగడంతో ఆసక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. అయితే అటుపై మనం ఆశించినంత వేగంగా కథ సాగదు. అసలు ట్విస్టులు ఓపెన్ చేయడానికి దర్శకులు హనీ ట్రెహన్ చాలా సమయం తీసుకోవడంతో ఒకదశలో కథ ఎంతకీ ముందుకు సాగని ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కో పాత్ర మీద అనుమానాలు రేకెత్తించేలా రాసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో టేకాఫ్ కు టైం పట్టింది. చివరి గంట అంతో ఇంతో వేగంగా పరిగెత్తింది కానీ వాటే థ్రిల్లర్ అనే ఫీలింగ్ అయితే కలిగించలేకపోయింది. అయినప్పటికీ ఈ జానర్ ని విపరీతంగా ఇష్టపడే ప్రేక్షకులను అకేలీ రాత్ ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తుంది కానీ రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం అంతగా కనెక్ట్ కాలేకపోతారు.

నిజానికి ఇలాంటి మర్డర్ మిస్టరీ స్టోరీస్ నుంచి మరీ ఎక్కువ వెరైటీని ఆశించలేము కానీ ఉన్నంతలో ఊపిరి బిగబట్టేలా సాగే మలుపులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకదశలో హంతకుల గురించి క్లూస్ ఇచ్చేసిన దర్శకులు ఆ తర్వాత చాలాసేపు సాగదీశారు. అసలు నేరస్తులు బయట పడ్డాక కూడా సినిమా పావు గంటకు పైగానే ఉంటుంది. అందులోనూ ఒకే ఇంటి లొకేషన్లో ఎక్కువ సేపు మూవీ రన్ అవుతుంది కాబట్టి బోర్ తప్పించుకోకుండా ఉండలేం. అయితే ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టు మాత్రం ఖచ్చితంగా ఊహించనిది. అంత ఈజీగా ఎవరు గెస్ చేయలేని విధంగా ముగింపు ఇవ్వడం కొంత సంతృప్తిని కలిగిస్తుంది. అక్కడ కూడా రెండు మెలికలు పెట్టడం షాక్ అనిపించినా మొత్తానికి ఎక్కువ అంచనాలను మాత్రం అందుకోలేదు

స్నేహా కాల్వర్కర్ సంగీతం యావరేజ్ గానే ఉంది. ఉన్న రెండు చిన్న పాటలు పర్వాలేదు. చాలా రోజుల తర్వాత సుఖ్విందర్ సింగ్ గాత్రం వినడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. సోసోగానే ఉంది. పంజక్ కుమార్ ఛాయాగ్రహణం నీట్ గా ఉంది. తెలుగువాడైన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మాత్రం కత్తెర విషయంలో మొహమాటపడింది. ఈ స్టోరీకి రెండున్నర గంటల నిడివి చాలా ఎక్కువ. రచయిత స్మిత సింగ్ స్క్రిప్ట్ స్టేజిలోనే కొంత జాగ్రత్త పడి ఉంటే ఇంకాస్త క్రిస్పీగా వచ్చి ఫాస్ట్ గా సాగేది. నిర్మాణ విలువల గురించి చెప్పేదేమీ లేదు. సింపుల్ గా నాలుగైదు లొకేషన్లలో మేనేజ్ చేసి తక్కువ బడ్జెట్ లో క్లోజ్ చేశారు

ప్లస్ గా అనిపించేవి

నవాజుద్దీన్, రాధికా ఆప్టే
కీలకమైన ట్విస్టులు
కెమెరా వర్క్
ప్రీ క్లైమాక్స్

మైనస్ గా తోచేవి

ఎక్కువ నిడివి (రెండున్నర గంటలు)
మాములుగా అనిపించే బిజిఎం
మధ్యలో సాగతీత
సంగీతం

కంక్లూజన్

క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ ఒక హత్య చుట్టూ తిరగడం తిరగడం సర్వసాధారణం. దాని చుట్టూ ఎలాంటి డ్రామా ఉంటుందన్న దాని మీదే వీటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రాత్ అకేలీ హైలో అన్నీ ఉన్నాయి కానీ బెస్ట్ క్యాటగిరీలో పడడానికి కావలసిన సెటప్ తగిన మోతాదులో లేకపోవడం వల్ల యావరేజ్ గా అనిపిస్తుందే తప్ప మరీ బెస్ట్ గా అయితే నిలవలేదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్సులు దన్నుగా నిలిచాయి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇంకా తక్కువ స్థాయిలోనే నిలిచేది. ఎక్కువ హైప్ ని పెంచుకోకుండా చేతిలో తగినంత సమయం ఉంటే నిక్షేపంగా ఈ ఒంటరి రాత్రిని ఓసారి చూడొచ్చు. .

ఒక్క మాటలో

రాత్ అకేలీ హై – పిక్చర్ యావరేజ్ హై

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి