iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 51 – నిశ్శబ్దం

లాక్ డౌన్ రివ్యూ 51 – నిశ్శబ్దం

రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేసిన సినిమాగా నిశ్శబ్దం మీద ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. భాగమతితో గతంలో హారర్ జానర్ లో కనిపించిన స్వీటీ మళ్ళీ ఇదే దర్శనమివ్వడం. అందులోనూ మూగ చెవిటి అమ్మాయిగా మొదటిసారి నటించడం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. దాని తోడు ట్రైలర్లు, ప్రోమోలు తదితరాల్లో హాలీవుడ్ రేంజ్ టేకింగ్ ఉన్నట్టు శాంపిల్స్ చూపించడంతో సహజంగానే హైప్ వచ్చేసింది. థియేటర్లో చూద్దామనుకున్న ప్రేక్షకులు ఆ విషయంగా కొంత నిరాశ చెందినప్పటికీ ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఇంత కొత్త భారీ సినిమా చూసే అవకాశం దక్కడం నిజంగా విశేషమే. మరి ఇంత సైలెంట్ గా చిన్నితెరలపై వచ్చేసిన నిశ్శబ్దం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

అమెరికా సియాటెల్ లో ఉండే మూగ చెవిటి చిత్రకారిణి సాక్షి(అనుష్క) సుప్రసిద్ధ మ్యుజీషియన్ ఆంటోనీ(మాధవన్)ని ప్రేమించి ఎంగేజ్ మెంట్ చేసుకుంటుంది. ఒక వింటేజ్ పెయింటింగ్ కోసం ఇద్దరూ ఒక హాంటెడ్ విల్లాకు వెళ్తారు. అక్కడ అనూహ్యంగా దెయ్యం చేతిలో ఆంటోనీ హత్యకు గురైతే సాక్షి తీవ్ర గాయాలతో తప్పించుకుని బయట పడుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ డిటెక్టివ్స్ మహా(అంజలి)ఆమె హెడ్ రిచర్డ్(మైకేల్ మ్యాడ్సన్)రంగంలోకి దిగుతారు. దీనికి కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన సాక్షి ప్రాణ స్నేహితురాలు అంజలి(షాలిని పాండే)కి ఏదో కనెక్షన్ ఉందని అర్థమవుతుంది. అసలు ఇదంతా ఎవరు చేశారు హంతకుడు ఎవరు అనేది తెరమీద చూసి తెలుసుకోవాలి

నటీనటులు

15 ఏళ్ళ కెరీర్లో అనుష్క ఎన్నో పాత్రలు చేసింది. జేజెమ్మగా భయపెట్టి పరాక్రమం చూపించినా, విక్రమార్కుడులో గ్లామర్ ఒలకబోసినా, బాహుబలిలో ప్రభాస్ తల్లిగా పగను కళ్ళతోనే పలికించినా తను ఎన్నడూ నిరాశపరచలేదు. కానీ ఇందులో సాక్షి క్యారెక్టర్ మాత్రం వాటితో ఏ మాత్రం పోల్చలేని ఒక స్పెషల్ క్యాటగిరీగా చెప్పుకోవచ్చు. మాటలే లేకుండా కేవలం హావభావాలతో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద భారాన్ని మంచి నేర్పుతో నెరవేర్చింది. ఇప్పటిదాకా తనను ఎప్పుడూ ఇలా చూడకపోవడంతో ఒకరకమైన కొత్త ఫీల్ కలుగుతుంది. తనకు ఇది బెస్ట్ అని చెప్పలేం కానీ ఇంత నిరీక్షణకు అర్హత కలిగిన సినిమా అయితే ముమ్మాటికీ కాదు.

మాధవన్ ఎప్పటిలాగే డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని అలవోకగా చేసుకుంటూ పోయాడు. నెగటివ్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో మంచి నేర్పు ఉన్న ఇతను తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. షాలిని పాండే రోల్ కీలకమైనదే అయినప్పటికీ ఎందుకో తాను చాలా సన్నివేశాలలో అనీజీగా కనిపించింది. నటనకూ పెద్దగా స్కోప్ దక్కలేదు. అంజలి ఒక్కతే సపోర్టింగ్ క్యాస్ట్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో కనిపిస్తుంది. సుబ్బరాజు సోసోనే. మైకేల్ మ్యాడ్సన్ పర్వాలేదు. అవసరాల శ్రీనివాస్ అవసరం లేకున్నా ఇరికించారు. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఇక వీళ్ళు తప్ప అన్ని అమెరికా మొహాలే. తెల్లతోలు గుంపులో ఫేసులు కూడా గుర్తుండవు

డైరెక్టర్ అండ్ టీమ్

ప్రపంచ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల అరచేతుల్లోకి వచ్చేసింది. ఇంగ్లీష్ ఏం ఖర్మ కొరియన్, ఫిలిప్పైన్, చైనీస్, స్పెయిన్ ఇలా బాషా భేదం లేకుండా అన్ని రకాల చిత్రాలను ఇంట్లోనే చూస్తున్నారు ఇండియన్ మూవీ లవర్స్. అందులోనూ హారర్, సస్పెన్స్, క్రైమ్ జానర్ మూవీస్ ఎక్కడ ఏ లాంగ్వేజ్ లో వచ్చినా వెతికి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాటి స్ఫూర్తితో కథలు రాసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ నిజాన్ని విస్మరించి ఓ అరిగిపోయిన క్రైమ్ కథకు మూగ చెవిటి హీరోయిన్ ని జోడించి ఆడియన్స్ ని థ్రిల్ చేద్దామని చూశాడు.

కానీ స్క్రీన్ ప్లే లోపాలతో అడుగడుగునా ఏ రకమైన ఆసక్తిని రేపకుండా నిశ్శబ్దం చాలా నీరసంగా కదులుతుంది. ఇంట్రో సీన్ లో హారర్ థ్రిల్లర్ లాగా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత ఏదో గొప్ప ట్విస్టులతో స్టోరీ నడిపిస్తున్నాననుకున్న హేమంత్ నిజానికి తెలిసో తెలియకో సులభంగా గెస్ చేయగలిగే ట్విస్టులను క్లూలను ఫస్ట్ హాఫ్ లోనే ఇచ్చేశాడు. దీంతో ఇంటరెస్ట్ తగ్గిపోయి ఊహించనిది ఏదైనా జరగక్కపోతుందా అని ఎదురు చూసే లోపే రెండు గంటల సమయం కరిగిపోయి నిట్టూర్పు మిగులుతుంది.

కొన్ని హత్యలు జరగడం, వాటిని ప్రధాన పాత్రధారుల్లో ఎవరో ఒకరు చేయించి ఉండటం, దానికో బలమైన ఫ్లాష్ బ్యాక్ నడపడం ఇదంతా ఏ క్రైమ్ సినిమాలోనైనా ఉండే బేసిక్ మెటీరియల్. ఇందులో పెద్దగా మార్పు ఉండదు. కానీ సన్నివేశాల కూర్పు, మలుపుల నేర్పు ఫలితాన్ని శాశిస్తాయి. గత ఏడాది వచ్చిన రాక్షసుడు అంతగా సక్సెస్ కావడానికి కారణం వయొలెన్సో లేదా మర్డర్లో కాదు. బిగిసడలకుండా ఎక్కడిక్కడ కట్టిపడేసే కథనంతో ఊహాకతీతంగా వేగంతో పరిగెత్తించడం. కానీ నిశ్శబ్దంలో అది అక్కడక్కడా ఓ ఐదు పది నిమిషాలకు మించి కనిపిస్తే ఒట్టు. అసలు దోషిని రివీల్ చేసినప్పుడు ఎక్కువసేపు సాగదీయకూడదు. కానీ ఇందులో మాత్రం ముప్పాతిక గంట అలా వెళ్తూనే ఉంటుంది.

అందులోనూ కిల్లర్ ఎవరో చెప్పేశాక తనకు సెట్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎప్పుడో కమల్ హాసన్ ఎర్రగులాబీల నుంచి శింబు మన్మధన్ దాకా చాలాసార్లు వాడిపారేసిన ట్రాకే. అందుకే అదంతా ఏ మాత్రం కనెక్ట్ అయ్యే వ్యవహారంలా ఉండదు. ఇలాంటి వీక్ నెస్ లు చాలా ఉండటం వల్లే చిన్న తప్పులు కూడా లాజిక్ లెస్ గా అనిపిస్తాయి . క్వాలిటీ తారాగణం కూడా ఒకదశలో నిస్తేజంగా కనిపిస్తుంది. పైగా హాలీవుడ్ స్టాండర్డ్ లో చూపించాలన్న తాపత్రయం కాబోలు ఇది రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. ఇలాంటివి ఎప్పుడో దశాబ్దాల వెనుక వచ్చాయి కాబట్టి యుఎస్ జనాలకు కనెక్ట్ కాదు. తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటంతో మనవాళ్ళూ సొంతం చేసుకునే ఛాన్స్ లేదు.

సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇచ్చిన పాటలు ఫార్వార్డ్ కోసం మాత్రమే పనికొచ్చాయి. ఇలాంటి కథలకు ఇవి అక్కర్లేకపోయినా ఏదో అనుష్క ఫ్యాన్స్ ఫీలవుతారని పెట్టినట్టు ఉంది తప్ప తీసేసినా నష్టం ఉండేది కాదు. గిరీష్ గోపాల కృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తీసికట్టుగా ఉంది. కొన్ని మంచి సీన్స్ ని సైతం ఎలివేట్ చేయలేకపోయారు. కోన వెంకట్ రచన ఆయన స్థాయిలో లేదు. ఇలాంటి కథల్లో డైలాగులకు పెద్దగా పనుండకపోయినా కోన మార్క్ అయితే ఎక్కడా కనిపించలేదు. షానియల్ డియో ఛాయాగ్రహణం మాత్రం అచ్చం ఏదో ఇంగ్లీష్ సినిమాకు పని చేసినట్టు ఉంది. తన లోపమేమి లేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కనీసం సాంగ్స్ నైనా తీసేయాల్సింది. నిర్మాతలు సినిమా మొత్తం అమెరికాలోనే తీశారు కాబట్టి బడ్జెట్ పరంగా బాగానే ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

అనుష్క
మాధవన్
ఓ రెండు ట్విస్టులు
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

ఆసక్తి రేపని కథనం
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
సినిమా లెన్త్
పాటలు

కంక్లూజన్

అనుష్క అభిమానులు గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూసిన నిశ్శబ్దం ఎక్కువ శబ్దం చేయకుండానే నిరాశ పరిచింది. డార్క్ క్రైమ్ థ్రిల్లర్ గా ముందు నుంచి ప్రమోట్ అవుతూ వచ్చిన ఈ సినిమాని ఎంత తక్కువ అంచనాలతో చూసినా ఓ మోస్తరుగా మెప్పించడం కూడా కష్టమే అనిపిస్తుంది. అందులోనూ సినిమా మొత్తం అమెరికాలోనే సాగడంతో కనీస నేటివిటీ లేక, ఇలాంటి థ్రిల్లర్లను పదులు వందల్లో చూసేసిన ప్రేక్షకులకు ఎలాంటి కొత్తదనం కనిపించక ఇంత భారీ చిత్రం బిలో యావరేజ్ మూవీగా నిలిచిపోయింది. ఓటిటి కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఓ రెండు గంటలు ఖర్చు పెట్టడం కన్నా రిస్కు ఉండదు. ఒకవేళ ఈ కోణంలో ఆలోచించి పోయేది టైం కదా అనుకుంటే నిశ్శబ్డం ట్రై చేయండి. కానీ మీరు పడిన యాతన ఎవరికీ చెప్పుకోకుండా నిశ్శబ్దంగా ఉండటం మాత్రం కష్టమే.

నిశ్శబ్దం – నిరాశ నిస్పృహ నీరసం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి