iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 55 – మిస్ ఇండియా

లాక్ డౌన్ రివ్యూ 55 – మిస్ ఇండియా

మహానటి ద్వారా జాతీయ అవార్డుతో పాటు తెలుగు ప్రేక్షకుల ఆశేష ఆదరాభిమానాలు సంపాదించుకున్న కీర్తి సురేష్ కొత్త సినిమా మిస్ ఇండియా ఇవాళ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ రూపంలో విడుదలయ్యింది. ట్రైలర్ వచ్చాక ఫ్యామిలి ఆడియన్స్ లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పరుచుకున్న మిస్ ఇండియా ద్వారా నరేంద్రనాధ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. క్యాస్టింగ్ కూడా భారీగా కనిపించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

విశాఖపట్నం లంబసింగి ప్రాంతంలో మధ్యతరగతిలో పుట్టిన మానస సంయుక్త(కీర్తి సురేష్)కు చిన్నప్పటి నుంచే ఎంబిఎ చేసి వ్యాపారవేత్తగా స్థిరపడాలని లక్ష్యం ఉంటుంది. అందుకోసం తాతయ్య(రాజేంద్రప్రసాద్)నేర్పించిన టీ విధానాన్ని ఒంటబట్టించుకుని అందులో మెళకువలు పెంచుకుంటుంది. అన్నయ్య అర్జున్(కమల్ కామరాజు)కు అమెరికాలో ఉద్యోగం రావడంతో కుటుంబం మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. చదువు పూర్తయ్యాక సంయుక్తకు చేస్తున్న ఉద్యోగం నచ్చక మిస్ ఇండియా పేరుతో ఛాయ్ వ్యాపారం మొదలుపెట్టి అప్పటికే కాఫీ రంగంలో స్థిరపడిన కైలాష్ శివకుమార్(జగపతిబాబు)తో పోటీ పడేందుకు సిద్ధపడుతుంది. ఈ క్రమంలో తనను అండగా నిలుస్తాడు విక్రమ్(సమంత్ శైలేంద్ర). అయితే ఓ అనూహ్యమైన సంఘటన సంయుక్త స్థాపించిన సామ్రాజ్యం చిక్కుల్లో పడుతుంది. వాటిని దాటుకుని తన గమ్యాన్ని ఎలా చేరుకుందనేదే అసలు స్టోరీ

నటీనటులు

కీర్తి సురేష్ నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. మహానటిలోనే తన బెస్ట్ ఇచ్చేసిన ఈ అమ్మాయిలో ఇందులో దాన్ని మించే ఛాలెంజింగ్ రోల్ దక్కిందేమో అని ఆశిస్తాం కానీ అలాంటిదేమి జరగలేదు. క్యారెక్టర్ పరంగా పేపర్ మీద పవర్ ఫుల్ గా కనిపించే ఈ పాత్ర కథనంలోని లోపాల వల్ల అతి మాములుగా మారిపోయింది. బిల్డప్ షాట్స్ వల్ల అక్కడక్కడా స్టైలిష్ గా కనిపించడం ఒక్కటే తనను కొత్తగా కనిపించేలా చేసింది. కొన్ని సీన్స్ లో ఎందుకో మరీ సహజత్వానికి దూరంగా కృత్రిమంగా నటించినట్టు కూడా అనిపించడం స్క్రిప్ట్ లోని లోపమో లేక మునుపటి స్పార్క్ మాయమయ్యిందో అర్థం కాదు. కానీ ఫైనల్ గా చూసుకుంటే తనవరకు సంయుక్త పాత్రలోని చాలా బలహీనతలను కాపాడే ప్రయత్నాన్ని గట్టిగానే నెరవేర్చింది.

జగపతిబాబుది పరమ రొటీన్ విలనీ. క్రూరమైన షేడ్స్ లేవు కానీ ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు చేసి ఆయనకే బోర్ కొట్టిన బిజినెస్ మెన్ గా మరోసారి చూపించారు. వేరే నటుడిని తీసుకున్నా కాస్త చేంజ్ అనిపించేది కానీ రిస్క్ అనుకున్నారు కాబోలు. నవీన్ చంద్ర ఫస్ట్ హాఫ్ కే పరిమితమయ్యాడు. ప్రత్యేకంగా మెరుపులంటూ ఏమి లేవు. తెలుగులో చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకునే నదియా ఇలాంటి రోల్ ని ఎలా ఒప్పుకున్నారో మరి. రాజేంద్ర ప్రసాద్ ఉన్నది పది నిమిషాలే. మొక్కుబడిగా ముగించేశారు. నరేష్, కమల్ కామరాజు, సుమంత్ శైలేంద్రలు పర్వాలేదనిపించారు. అందరికీ స్పేస్ దొరికింది కానీ సినిమా అయ్యాక ఎవరూ గుర్తుండరు. పూజిత పొన్నాడ, దివ్యశ్రీపాద,ప్రవీణ్ అందరూ మమ అనిపించారు అంతే

డైరెక్టర్ అండ్ టీమ్

నిజానికిది బయోపిక్ లాంటి కల్పిత కథ. ఎవరో పాపులర్ సెలబ్రిటీని స్ఫూర్తిగా తీసుకుని హక్కులు కొనుక్కుని ప్రయాస పడటం ఎందుకని దర్శకుడు నరేంద్రనాధ్ ఈ మిస్ ఇండియాను తన ఊహలకు తగ్గట్టు రెండు మూడు మలుపులతో సింపుల్ గా రాసుకున్నాడు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎక్కడో యుఎస్ లో మన దేశం గర్వపడే స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం. దాన్ని ప్రేక్షకులు ఫీలవ్వాలంటే అంత అద్భుతమైన ప్రయాణాన్ని తెరమీద చూపించాలి. చూస్తున్నంత సేపు తన సంతోషాన్ని బాధను ఆడియన్స్ కూడా పంచుకోవాలి. చక్కని భావోద్వేగాలు కుదరాలి. కానీ మిస్ ఇండియాలో ఇవన్నీ మిస్ అయ్యాయి. సినిమా మొదలయ్యాక చైల్డ్ ఎపిసోడ్ తో మొదలుపెట్టి ఆ తర్వాత యుఎస్ వెళ్ళాక ఇంటర్వెల్ దాకా అవసరం లేని ప్రేమకథతో చాలా టైం వేస్ట్ చేశారు.

స్కూల్ కు వెళ్లే వయసులోనే సంయుక్తను మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా చూపించినప్పుడు ఆ లక్షణాలు పెద్దయ్యే కొద్దీ ఇంకా మెరుగుపడేలా ఉండాలి. కానీ నాటకీయత కోసం దర్శకుడు నరేంద్ర తనను ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు. అన్నయ్య ఓ రెండు మాటలు అనగానే ఇష్టం లేని ఉద్యోగంలో చేరుతుంది. ఓ యువకుడు డిన్నర్ తో మొదలుపెట్టిన పరిచయం ప్రేమదాకా వెళ్తున్నా గుర్తించకుండా తను వచ్చిన పనిని మర్చిపోయి అతనితో కలిసి తిరుగుతుంది. అతనే బయటపడ్డాక అప్పుడు గోల్ గుర్తొచ్చి సారీ నాకు బిజినెస్ ఇంపార్టెంట్ అని గుడ్ బై చెబుతుంది. సెకండ్ హాఫ్ లోనూ తనకు చేయూతనిచ్చిన వ్యక్తిని సైతం గుడ్డిగా వ్యాపారాన్ని సాకుగా చెప్పి తిరస్కరిస్తుందే తప్ప సంయుక్త వైపు కన్విన్సింగ్ గా మనకెలాంటి రీజన్ కనిపించదు.

ఇలాంటి డ్రామాలు పండాలంటే మలుపులు ఉండాలి. థ్రిల్ అవ్వకపోయినా లీడ్ క్యారెక్టర్ ఎదుర్కుంటున్న పెయిన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయనివ్వాలి. కానీ నరేంద్రనాధ్ ఈ విషయంలో చాలా పొరపాట్లే చేశారు. ప్రతి క్యారెక్టర్ అవకాశం దొరికినప్పుడంతా క్లాసులు తీసుకుంటుంది. చాగంటి తరహాలో ప్రవచనాలు చెబుతుంది. కానీ దానికి తగ్గట్టు ప్రవర్తనలు మాత్రం ఉండవు. కైలాష్ ఇంట్రో సీన్ లో బోయపాటి రేంజ్ లో సైడ్ క్యారెక్టర్ తో డైలాగు ఎలివేషన్ ఇప్పించడం లాంటి ఆర్టిఫీషియల్ సెటప్పులు ఇలాంటి బ్యాక్ డ్రాప్ కు అవసరం లేదు.

ఛాయ్ అమ్మే ఓ పెద్ద సైజు రెస్టారెంట్ వందల కోట్ల టర్నోవర్ ఉన్న కైలాష్ సంస్థని దెబ్బ తీయడం ఏంటో, ఇంతోటి సెటప్ కు బోర్డు అఫ్ డైరెక్టర్స్ అంటూ మీటింగ్ రూమ్ హడావిడి ఏంటో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు. అంత గొప్ప స్థాయిలో ఉన్న కైలాష్ సంయుక్తను ఎదురుకోవడం కోసం వేసిన సిల్లీ బిజినెస్ స్ట్రాటజీలు చూస్తే పదో క్లాసు పిల్లాడు సైతం నవ్వుకోవడం ఖాయం. ఇలాంటి మచ్చుతునకలు ఎన్నో ఉన్నాయి. ఓ రొటీన్ సెటప్ తో నరేంద్రనాథ్ మిస్ ఇండియా రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయాడు.

థమన్ సంగీతంలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. పాటలు సోసోనే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలాసార్లు విన్నట్టే అనిపిస్తుంది. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం బాగుంది. అమెరికా అందాలను మంచి క్వాలిటీతో తెరమీద చూపించారు. రిచ్ నెస్ కనిపిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కొంత సాగతీతకు కారణమయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కోతకు అవకాశం ఉన్నా వదిలేశారు. తరుణ్-నరేంద్రనాధ్ ల సంభాషణలు మాములుగా ఉన్నాయి. మహేష్ కోనేరు బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. స్క్రీన్ మీద పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ గా అనిపించేవి

కీర్తి సురేష్
ఛాయాగ్రహణం
నిర్మాణ విలువలు

మైనస్ గా తోచేవి

జీరో ఎమోషన్
రొటీన్ కథాకథనాలు
నిడివి

చివరి మాట

మిస్ ఇండియా లాంటి చక్కని టైటిల్ తో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా నుంచి ఎంత తక్కువ ఆశిస్తే అంత మంచిది. మంచి క్యాస్టింగ్ దొరికితే సరిపోదు. దాన్ని సరైన రీతిలో వాడుకునే కథాకథనాలు కంటెంట్ రూపంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే థియేటర్ అయినా ఓటిటి అయినా ప్రేక్షకులు నిరాశ చెందుతారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఎమోషన్స్ లేకుండా ఒక వ్యక్తి ఎదుగుదలను తెరమీద చూడటం కష్టం. వాటిని పండించినప్పుడే సంయుక్త లాంటి పాత్రలను ప్రేక్షకులు ప్రేమిస్తారు. లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవు.

మిస్ ఇండియా – ‘టీ’లో టేస్ట్ ‘మిస్’

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి