iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 29 – ఓటమిలో గెలుపు

లాక్ డౌన్ రివ్యూ 29 –  ఓటమిలో గెలుపు

తెలుగులో ఇటీవలి కాలంలో వెబ్ సిరీసుల నిర్మాణం ఊపందుకుంటోంది. లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రేక్షకులకూ వీటి మీద అవగాహన రావడంతో ఓ లుక్ వేస్తున్న వాళ్ళ సంఖ్య బాగానే ఉంది. ఇటీవలే జీ5 ద్వారా విడుదలైన లూజర్ ప్రమోషన్ స్టేజి నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. అందులోనూ ప్రియదర్శి, శాశాంత్ లాంటి నొటెడ్ యాక్టర్స్ ఉండటంతో అంచనాలు తెచ్చేసుకుంది. ఎపిసోడ్ల వారిగా నాలుగున్నర గంటల నిడివి ఉన్న లూజర్ గురించి రివ్యూలో చూద్దాం

కథ

ఇది మూడు కాలాలకు సంబంధించిన ముగ్గురు క్రీడాకారుల కథ. 1985 ప్రాంతానికి చెందిన విల్సన్ (శశాంక్)దుందుడుకు స్వభావం ఉన్న క్రికెటర్. తన కోపం కారణంగా బంగారం లాంటి కెరీర్ ని పోగొట్టుకుని తాగుడుకి బానిసైపోతాడు. 1993లో షబానా(అన్నీ)అనే స్కూల్ వెళ్లే అమ్మాయి తండ్రికి తెలియకుండా బ్యాట్మింటన్ లో నైపుణ్యం పెంచుకుంటుంది. కానీ పెళ్ళయాక జీవితం మారిపోతుంది. 2007లో సూరి యాదవ్(ప్రియదర్శి)నేషనల్ లెవెల్ లో షూటింగ్ ఛాంపియన్ గా ఎదగాలని లక్ష్యం పెట్టుకున్నాడు. దానికి 5 లక్షలు అవసరమవుతాయి. కానీ ఆర్థిక స్థోమత ఉండదు. ఈ ముగ్గురికీ ఏదైనా కనెక్షన్ ఉందా, వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందనేది తెలియాలంటే మొత్తం పది ఎపిసోడ్ల సిరీస్ చూడాల్సిందే

నటీనటులు

లూజర్ కున్న ప్రధాన బలం క్యాస్టింగ్. ఆర్టిస్టుల సెలక్షన్ లో తీసుకున్న జాగ్రత్తలు చాలా మంచి అవుట్ ఫుట్ వచ్చేలా చేసింది. సినిమా తరహాలో వెబ్ సిరీస్ కు తక్కువ నిడివి ఉండదు. ఎన్ని గంటలు తీసినా ఆరిస్టుల నుంచి ఒకేరకమైన కన్సిస్టెన్సీ రాబట్టుకోవడం అంత తేలిక కాదు. దర్శకుడు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. నటీనటుల విషయంలో రాజీ అన్నమాటకు తావివ్వలేదు కాబట్టి షియాజీ షిండే లాంటి సీనియర్లను సైతం చక్కగా వాడుకున్నాడు. టాలెంట్ ఎంత ఉన్నప్పటికి కేవలం అదృష్టం పూర్తిగా కలిసిరాకపోవడం వల్ల వెనుకబడిన శశాంక్ తనలో రియల్ ఆర్టిస్ట్ ని ఇందులో మరోసారి బయటికి తీశాడు. హెవీ ఎమోషన్స్ ఉన్న పాత్రలో చాలా సాలిడ్ గా ఒదిగిపోయాడు. తనను నిజంగా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో వాడుకోలేదన్న మాట వాస్తవం.

యంగ్ షబానాగా చేసిన అన్నీ ఆ రోల్ ని ఆడేసుకుంది. ఒకరకంగా పరకాయప్రవేశం చేసిందని చెప్పొచ్చు. పెళ్ళయ్యాక షబానాగా నటించిన కల్పికా గణేష్ కూడా ఆదరగోట్టింది. భర్త పెట్టే యాతన భరిస్తూ మరోవైపు తన చేజారిన కెరీర్ ఇంకెవరికి అలా జరగకూడదని తపనపడే ముస్లిం భార్యగా జీవించేసింది. ప్రియదర్శి చాలా సాలిడ్ గా చేశాడు. మల్లేశంలో బయటపడిన కొన్ని బలహీనతలను ఇందులో పూర్తిగా ఓవర్ కం అయ్యాడు. కేవలం కామెడీ లేదా సపోర్టింగ్ రోల్స్ కే కాకుండా కరెక్ట్ గా చూస్తే ప్రియదర్శిలో యాక్టింగ్ మెటీరియల్ చాలా ఉందన్న విషయం బయటపడుతుంది. పావని గంగిరెడ్డి కూడా చాలా గ్యాప్ తర్వాత తన ఉనికిని చాటుకుంది. ఈ ఐదుగురు కాకుండా ఇంకా తారాగణం ఉన్నారు కానీ సిరీస్ అయ్యాక పదే పదే వెంటాడే వాళ్ళు మాత్రం నిస్సందేహంగా వీళ్ళే.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు అభిలాష్ రెడ్డి తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి కొత్తదనం లేదు. అయితే ఇందులో గొప్పదనమంతా చెప్పే విధానంలో ఉంది. ఇప్పటికే హిందీలో చక్ దే ఇండియాతో మొదలుకుని తెలుగులో నాని జెర్సీ దాకా ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. చాలా మటుకు విజయవంతం అయ్యాయి కూడా. వాటిలోనూ ఎమోషన్స్ అద్భుతంగా పండి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాయి. అయితే లెన్త్ పరంగా ఉన్న అడ్డంకి వల్ల కొన్ని భావోద్వేగాలను పూర్తి స్థాయిలో ఆవిష్కరించినవి తక్కువ. అభిలాష్ రెడ్డికి అలాంటి సమస్య లేకపోవడంతో తన స్వేచ్ఛను పూర్తిగా వాడుకున్నాడు. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు, వాటిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రెజెంట్ చేసిన తీరు చివరి దాకా విసుగు లేకుండా చేశాయి.

ఇదెప్పుడూ చూడలేదే అన్న ఫీలింగ్ లూసర్ చూస్తున్నప్పుడు ముమ్మాటికీ కలిగదు. అయితే కథనం నడిపించిన తీరు పాత్రలకు కనెక్ట్ అయ్యేలా చేయడంతో అభిలాష్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అయితే వెబ్ సిరీస్ కాబట్టి నిడివి కోసం స్క్రిప్ట్ లెన్త్ పెంచిన తీరు అక్కడక్కడా కొంచెం ఇబ్బంది కలిగించినా అది కూడా మొత్తం ఒకేసారి చూసినప్పుడు తప్ప ఎపిసోడ్ల వారీగా అయితే ఆ ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఇంత మంచి స్టోరీలోనూ సహజత్వం పేరుతో కొన్ని బోల్డ్ డైలాగ్స్ రెండు మూడు సీన్స్ పెట్టడం అవసరం లేదనిపిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేయడానికి స్కోప్ ఉన్నప్పుడు ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. సంభాషణలు మాత్రం పేలాయి. అభిలాష్-శ్రవణ్ రైటింగ్ ఇంప్రెస్ చేస్తుంది.

సంగీత దర్శకుడు సాయి శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్ చక్కగా ఉంది. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేశాడు. హార్ట్ టచింగ్ సీన్స్ లోనూ తనదైన మార్కు చూపించాడు. సరైన అవకాశాలు వస్తే మంచి టాలెంట్ టాలీవుడ్ కి దొరికినట్టే. నరేష్ రామదురై ఛాయాగ్రహణం కూడా హై స్టాండర్డ్స్ లో ఉంది. మూడు కాలాల మధ్య వేరియేషన్స్ చూపడంలో తీసుకున్న శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. కుమార్ పి అనిల్ ఎడిటింగ్ గురించి ఎక్కువ కామెంట్ చేయడానికి లేదు. వెబ్ సిరీస్ అంటేనే సుదీర్ఘమైన మేకింగ్ కాబట్టి సాధ్యమైనంత వేగంగా టెంపో ఉంచడానికి ట్రై చేశాడు కానీ ఫైనల్ గా కొంచెం తగ్గిస్తే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. అన్నపూర్ణ బ్యానర్ కు తగ్గట్టే నిర్మాణ విలువలు బాగున్నాయి

చివరి మాట

ఇలాంటి కంటెంట్ బేస్డ్ వెబ్ సిరీసులు తెలుగులో రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో క్రీడలను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు బయోపిక్కులు వచ్చాయి కానీ ఓటమి గెలుపు మధ్య ఉన్న భావోద్వేగాల వ్యత్యాసాన్ని ఇంత చక్కగా చూపించిన లూజర్ డీసెంట్ విన్నర్ గా నిలిచింది. ఎమోషనల్ జర్నీస్ ని ఇష్టపడే వాళ్ళను నిరాశపరిచే ఛాన్స్ ఇవ్వని ఈ సిరీస్ ని ఖచ్చితంగా రికమండ్ చేసే క్యాటగిరీలో వేయొచ్చు. కాకపోతే సగటు సినిమాలకు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటివి దగ్గరవానికి ఇంకా టైం పట్టేలా ఉంది. దానికి మొదటి మరియు మంచి అడుగ్గా లూజర్ ని చెప్పుకోవచ్చు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, ఎమోషన్స్ ని చూపించడంలో డైరెక్టర్ చూపించిన నైపుణ్యం లూజర్ ని గెలిపించేలా చేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి