iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 39 – సామాజిక మేలుకొలుపు

లాక్ డౌన్ రివ్యూ 39 – సామాజిక మేలుకొలుపు

కమర్షియల్ సినిమా చక్రబంధంలో చిక్కుకున్న టాలీవుడ్ లో సామజిక చైతన్యం కలిగించే చిత్రాలు రావడం అరుదు. వీటికి సెల్లింగ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉండటంతో పాటు స్టార్ క్యాస్టింగ్ సపోర్ట్ దక్కదు కాబట్టి థియేటర్ల దాకా వచ్చి ఆదరణ దక్కించుకునే సందర్భాలు అరుదుగా ఉంటాయి.. అందుకే దర్శకులు సాధ్యమైనంత వీటి జోలికి వెళ్ళకుండా సేఫ్ గేమ్ ఆడేందుకే ప్రయత్నిస్తారు. అయితే కొందరు యంగ్ జనరేషన్ డైరెక్టర్ల పుణ్యమాని అదృష్టవశాత్తు కొన్ని చూడగలుగుతున్నాం. ఆ కోవలోకి వచ్చేదే ‘జోహార్’. వాస్తవానికి ఇది అయిదారు నెలల క్రితమే థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి రోజు ఓటిటి రూపంలో ఆహా యాప్ ద్వారా రిలీజయ్యింది. మరి జోహార్ టైటిల్ కు తగ్గట్టు జేజేలు కొట్టించుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతరామయ్య(చలపతిరావు)హఠాత్తుగా మరణించడంతో సిఎం అవుతాడు ఆయన వారసుడు విజయ్ వర్మ(చైతన్య కృష్ణ). తన తండ్రి ఖ్యాతి చిరకాలం గుర్తుండియేలా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని కట్టించాలని నిర్ణయం తీసుకుంటాడు. కట్ చేస్తే వేర్వేరు నాలుగు ప్రాంతాల్లో నాలుగు జీవితాలు మనకు పరిచయమవుతాయి. శ్రీకాకుళం జిల్లా నదీతీర ప్రాంతంలో ఉండే గంగమ్మ (ఈశ్వరి రావు) భర్త పోయాక అనారోగ్యంతో ఉన్న ఒక్కగానొక్క బిడ్డ కోసం తల్లడిల్లుతూ ఉంటుంది

వారణాసిలో ఉండే టీ కొట్టు కుర్రాడు(అంకిత్ కోయా)ఓ వ్యభిచారి కూతురు జ్యోతి(ఈస్తర్ అనిల్)ని ప్రేమిస్తాడు. రాయలసీమకు చెందిన వృద్ధుడు బోస్(శుభలేఖ సుధాకర్)శిధిలమవుతున్న తన అనాధ పిల్లల ఆశ్రమానికి కావలసిన నిధుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వైజాగ్ రోడ్ల మీద సర్కస్ చేసే బాల(నైనా గంగూలి)తనకిష్టమైన పరుగు పందెంలో ఒలంపిక్స్ మెడల్ తెచ్చుకునే లక్ష్యంతో కష్టపడుతూ ఉంటుంది. అసలు వీళ్ళ జీవితాలకు పైన చెప్పిన రాజకీయ నేపధ్యానికి సంబంధం ఏమిటనేది సినిమాలోనే చూడాలి

నటీనటులు

జోహార్ కు వెన్నుదన్నుగా నిలిచారు తారాగణం. ప్రతి పాత్ర చాలా సహజంగా ప్రవర్తిస్తుంది. ఈశ్వరిరావు, సుధాకర్, రోహిణి లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ కొత్త వాళ్ళు సైతం తమ యాక్టింగ్ తో మెప్పించడం ఇందులో ప్రధాన ఆకర్షణ. చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసిన సిఎంగా చైతన్య కృష్ణ అందులో కూల్ గా ఒదిగిపోయాడు. సరైన అవకాశాలు రాక వెనుకబడుతున్నాడు కాని కరెక్ట్ సబ్జెక్టులు పడితే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రూపుదిద్దుకోవడం ఖాయం. ఈశ్వరిరావు, శుభలేఖ సుధాకర్ లు తమకలవాటైన రీతిలో అనుభవంతో అలవోకగా చేసుకుంటూ పోయారు.

కాశి ఎపిసోడ్ ప్రేమజంటగా నటించిన అంకిత్, ఈస్తర్లు క్యుట్ గా ఉన్నారు. దర్శకుడి డిమాండ్ మేరకు చక్కగా నటించారు కూడా. ఎక్స్ ప్రెషన్స్ పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆయా పాత్రలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించారు. లేడీ అథ్లెట్ కం సర్కస్ గర్ల్ గా నటించిన నైనా గంగూలి అక్కడక్కడా బాలన్స్ తప్పినా ఫైనల్ గా పర్వాలేదు అనిపించుకుంది. హావభావాల విషయంలో ఇంకాస్త హోం వర్క్ చేసుంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. కథ మొత్తం వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి సహాయక పాత్రల్లో జివిఎల్ నరసింహ, రోహిణి తదితరులు ఉన్నప్పటికీ మరీ ఎక్కువగా రిజిస్టర్ కారు. సపోర్టింగ్ రోల్స్ కూడా చాలానే ఉన్నాయి

డైరెక్టర్ అండ్ టీమ్

ముందుగా ఇలాంటి ఆలోచన చేసినందుకు దర్శకుడు తేజ నర్నిని అభినందించాలి. దేశంలో రాష్ట్రాలను పాలిస్తున్న రాజకీయ నాయకుల ఉద్దేశాలు, నిర్ణయాలలోని డొల్లతనాన్ని, వాటి వల్ల సామాన్యుల జీవితాలు అల్లకల్లోలం కావడాన్ని నిజాయితీగా తెరమీద చూపించాలనే ప్రయత్నం గట్టిగా చేశాడు. ఒక దశ వరకు మెప్పించాడు కూడా. తమ స్వార్థం కోసం స్వలాభం కోసం ఏసి రూముల్లో కూర్చుని పొలిటీషియన్స్ చేసే పనులు వాళ్లకు ఏ మాత్రం అవగాహన కలగనంత స్థాయిలో ఎంతవరకు దుష్పరిణామాలు కలిగిస్తున్నాయో కొంతవరకు గట్టిగానే చెప్పాడు. భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే అనిపిస్తున్నప్పటికీ ఏదో తెలియని వెలితి వెంటాడుతూ సదరు పాత్రలతో పాటే ప్రయాణం చేసేలా తేజ నర్ని తీసుకున్న శ్రద్ధ ఆకట్టుకుంటుంది . అయితే జోహార్ ని నిలబెట్టడానికి అతని నిజాయితి ఒక్కటే సరిపోలేదు. కథనం విషయంలో జరిగిన తడబాటు వల్ల జోహార్ గొప్ప చిత్రంగా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకుని మంచి సినిమాగా మిగిలిపోయింది.

నాలుగైదు జీవితాలను ఓ సోషల్ ఇష్యూకి ముడిపెట్టడం అనే కాన్సెప్ట్ కొత్తది కాదు. గతంలో క్రిష్ వేదంలో చేసింది ఇదే. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ లాంటి రిచ్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ అది గొప్ప పేరైతే తెచ్చుకుంది కానీ వసూళ్ళ పరంగా అద్భుతాలు జరగలేదు. కాకపోతే స్టార్లు ఉన్న మూవీ కాబట్టి వాళ్ళ సహాయంతో పాటు గట్టెక్కేసింది. కాని జోహార్ లో ఆ ఆవకాశం లేదు. అందరూ చిన్న ఆర్టిస్టులే. అందుకే తేజ నర్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఫ్రేమ్ ని తన సృజనాత్మకత జోడించి మరీ తీశాడు. అయితే పారలల్ గా సాగుతున్న నలుగురి జీవితాలకు సంబంధించిన ఎపిసోడ్లలో ఎంతో ఎమోషన్ ఉన్నట్టు ఫీలవుతాం కాని నిజానికి కొన్ని చోట్ల భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండలేదు.

అందుకే అక్కడక్కడ హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నప్పటికీ జస్ట్ ఓకే అనిపిస్తాయి కానీ పదే పదే మనసును వెంటాడి ఆలోచింపజేసేలా ఉండవు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి తేజ తీసుకున్న టర్నింగ్ చాలా ప్లస్ అయ్యింది. అక్కడ సంధించిన ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదని మనతోనే చెప్పించిన తీరుకు తేజ ప్రశంసలకు అర్హుడయ్యాడు. ఇలాంటి పాయింట్ ని పోలి ఉన్న లీడర్, వేదం, భరత్ అనే నేను లాంటి సినిమాలు మెదడును చురుకుగా చేసే టీ లాంటివైతే ఈ జోహార్ కొందరికే నచ్చి కనెక్ట్ అయ్యే అయ్యే బ్లాక్ కాఫీ లాంటివి. అందుకే ఫలితం పూర్తిగా ప్రేక్షకుల చేతిలో ఉంది

టీం విషయానికి వస్తే కెమెరామెన్ జగదీశ్ చీకటికి అగ్ర తాంబూలం ఇవ్వాలి. చాలా బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ మీద క్వాలిటీ అవుట్ పుట్ వచ్చేలా చేయడంలో ఇతని కృషి చాలా ఉంది. ఫ్రేమింగ్, టైమింగ్ చాలా బాగా కుదిరాయి. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం హృద్యంగా ఉంది. మంచి మెలోడీ ఫీల్ కలిగించాడు. అయితే మొదటిసగంలో పాటలు కాస్త ఎక్కువగా అనిపిస్తాయి. వంశీ సంభాషణలు చక్కగా ఉన్నాయి.నిడివి తక్కువగా ఉన్నా ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే వేగం పెరిగేది/ నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పాలి. బడ్జెట్ విషయంలో రాజీ పడక తప్పలేదేమో కొన్ని సన్నివేశాల్లో ఆ లోటు కనిపిస్తుంది.

ప్లస్ గా అనిపించేవి

యాక్టర్స్ అందరూ
ప్రీ క్లైమాక్స్
మ్యూజిక్
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

స్లోగా అనిపించే నెరేషన్
బడ్జెట్ లో రాజీ
సెకండ్ హాఫ్

కంక్లూజన్

వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. దానికి నాయకులు ఎలా అయితే కారణమనుకుంటున్నామో గుడ్డిగా వాళ్ళను ఓట్లు వేసి గెలిపించడం వల్ల మనమూ ఎంత నష్టపోతున్నామనే పాయింట్ తో రూపొందిన సినిమా జోహార్. దీని ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం చివర్లో డెలివరీ అయినప్పటికీ ఫైనల్ గా ఇదేదో అద్భుతమైనదని చెప్పే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఇంకాస్త బలంగా బిగితో కథనం నడిపించి ఉంటే ఇది ఖచ్చితంగా అందరూ మాట్లాడుకునే సోషల్ మెసేజ్ మూవీ అయ్యేది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర జోహార్ లక్ష్యం నెరవేరింది. కాబట్టి మనకు తెలియని మనకు పరిచయం కాని సమాజానికి అటువైపు చూడాలంటే మాత్రం ఈ సినిమాని నిస్సంకోచంగా చూడొచ్చు.

జోహార్ – స్లోగా సాగే సోషల్ వార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి