iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 38 – స్పూర్తినిచ్చే స్త్రీ సాహసి

లాక్ డౌన్ రివ్యూ 38 – స్పూర్తినిచ్చే స్త్రీ సాహసి

అతిలోకసుందరి స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా ప్రత్యేకమైన గుర్తింపుతో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కొత్త సినిమా ‘గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొంది ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ సాహసవనితగా పేరున్న మహిళ బయోపిక్ కావడంతో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుందీ చిత్రం. ధర్మ ప్రొడక్షన్స్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన గుంజన్ సక్సేనా సమగ్ర విశ్లేషణాత్మక వివరణ రివ్యూలో చూద్దాం

కథ

బాల్యంలోనే పైలట్ అవ్వాలన్న లక్ష్యంతో ఉంటుంది గుంజన్ సక్సేనా(జాన్వీ కపూర్). అయితే ఆర్మీలో కల్నల్ గా ఉన్న తండ్రి అనూప్ సక్సేనా (పంకజ్ త్రిపాఠి) ఆర్ధిక స్తోమత అందుకు సహకరించదు. కానీ ఆయన ప్రోత్సాహంతో ఎయిర్ ఫోర్స్ పైలట్ శిక్షణ దాకా వెళ్తుంది. దీనికోసం బరువు తగ్గడం లాంటి ఎన్నో కఠినమైన సవాళ్లను దాటేస్తుంది. అయితే క్యాంపులో చేరాక అక్కడందరూ మగాళ్లే ఉండటంతో గుంజన్ తీవ్ర వివక్షను, అవమానాలను ఎదురుకుంటుంది. అయినా తట్టుకుని తన గమ్యం కోసం కష్టపడుతుంది. ఈ క్రమంలో అతి క్లిష్టమైన కార్గిల్ వార్ లో బాధ్యతలు తీసుకునే ఛాలెంజ్ ఎదురవుతుంది.మరి గుంజన్ తన ప్రతిభను అనుమానంగా చూసినవాళ్లకు ఎలా సమాధానం చెప్పింది. స్త్రీ శక్తికి హద్దులు లేవని ఎలా నిరూపించింది అనేది సినిమాలో చూడాల్సిందే

నటీనటులు

అసలే స్టార్ కిడ్స్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న తరుణంలో ఈ సినిమా రావడం జాన్వీ కపూర్ కు ఖచ్చితంగా మేలు చేసేదే. కేవలం వారసత్వం ట్యాగ్ ఉంటే సరిపోదని టాలెంట్ ఉంటే తప్ప పరిశ్రమలో, ప్రేక్షకుల మనస్సులో నెగ్గుకురావడం కష్టమని గతంలోనే ఎందరో నిరూపించినప్పటికీ తనకు దొరికిన అరుదైన అవకాశం ద్వారా జాన్వీ రీ సౌండ్ వచ్చే స్థాయిలో మరోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి పాత్రలు పదే పదే రావని గ్లామర్ కమర్షియల్ చట్రంలో ఇరుకున్న బాలీవుడ్లో హీరోయిన్లకు ఎప్పుడో గాని దక్కని అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంది జాన్వీ.

నిజానికిది తన వయసుకు క్యాలిబర్ కు మించిన రోల్. ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా లెక్కలేనన్ని విమర్శలు వచ్చి పడతాయి. ఇది గుర్తుంచుకునే జాన్వీ చాలా పరిణితితో కూడిన నటనను ప్రదర్శించింది. ఎమోషన్స్ తో పాటు లేనిది ఉన్నట్టు ఊహించుకుని గ్రీన్ మ్యాట్ టెక్నాలజీతో చేసిన వార్ సీన్స్ లో కూడా ఫెంటాస్టిక్ అనిపించింది. అలా అని తనను ఇప్పటి జనరేషన్లో అందరికంటే ఉత్తమ నటి అనలేం కానీ ఇప్పటితరం వాళ్ళతో పోలిస్తే చాలా మెరుగైన అవుట్ ఫుట్ ఖచ్చితంగా ఇచ్చింది. తన అభిమానులు గర్వంగా చెప్పుకునేలా చేసిందని మాత్రం చెప్పొచ్చు.

ఇక తర్వాత గుర్తుండిపోయేది పంకజ్ త్రిపాఠి. బిడ్డ మనసు తెలుసుకుని భార్య, కొడుకుతో సహా అందరూ వద్దంటున్నా ఆమెను ప్రోత్సహించే పాత్రలో జీవించారు. ఎక్కువగా నెగటివ్ రోల్స్ లో కనిపించే పంకజ్ ఇందులో మాత్రం సగటు మధ్య తరగతి తండ్రిగా కదిలించే స్థాయిలో మెప్పించేశారు. ఆయనకు మాత్రమే సొంతమైన డైలాగ్ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ ని చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. కమాండింగ్ ఆఫీసర్లుగా నటించిన మానవ్, వినీత్ కుమార్ సింగ్ లు పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచారు. అన్నయ్యగా నటించిన అంగద్ బేడి బాగా ప్లస్ అయ్యాడు. మిగిలిన పాత్రల్లో అయేషా రాజా మిజ్రా, చందన్ కే ఆనంద్ తదితరులు తమకిచ్చిన పరిధి మేరకు ఇందులో ఒదిగిపోయారు.

డైరెక్టర్ అండ్ టీం

గత కొన్నేళ్ళలో నార్త్ నుంచి సౌత్ దాకా చాలా బయోపిక్కులు వచ్చాయి. అందులోనూ స్పోర్ట్స్ సెలేబ్రిటీలవి ఎక్కువగా వచ్చి ఒకరకంగా ఇవి కొంత బోర్ కొట్టిస్తున్నాయి కూడా. క్రీడాకారుల జీవితాలు ఒకే రకమైన డ్రామాతో సాగుతూ చివర్లో గెలుపుతో సుఖాంతమవుతాయి కాబట్టి ఆలా అనిపించడం సహజం. దర్శకుడు శరణ్ శర్మ అందుకే చాలా దూరం ఆలోచించి గుంజన్ సక్సేనా కథను సినిమాగా మలచాలన్న ఆలోచనను కట్టిపడేసే కథనంతో సినిమాగా తీర్చిదిద్దాడు. ఆమె జీవితంలో ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాలు ఎయిర్ ఫోర్స్ లో చేరక ముందు లేవు . అందుకే సున్నితమైన భావోగ్వేగాలను టార్గెట్ చేసిన శరణ్ తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని నేపధ్యంగా తీసుకుని ఆడపిల్లను సరైన రీతిలో ప్రోత్సహిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో స్ఫూర్తినిచ్చే విధంగా తీర్చిద్దిదారు. సుమారు గంట దాకా అసలు కథలోకి వెళ్లకపోయినా ఈ థ్రెడ్ తోనే ఎంగేజ్ చేశారు శరణ్.

టైటిల్ లో కార్గిల్ ఉన్నంత మాత్రాన ఇదేదో వార్ ఫిలిం కాదు. చివరి అరగంట మాత్రమే దానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. శరణ్ రెగ్యులర్ పంధాలో ఆలోచించి ఉంటే గుంజన్ ఎమోషన్ మనకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో వచ్చిన బోర్డర్, ఎల్ఓసి సినిమాల జాబితాలో ఇదీ కలిసిపోయేది. కానీ శరణ్ ఉద్దేశం అది కాదు. సమాజంలో ఆడపిల్ల పట్ల మనకున్న అభిప్రాయాలు, అవి మారాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతాడు. స్వంత అన్నయ్యే నిరాశ కలిగించే సగటు కుటుంబాలలో ఎందరో అమ్మాయిలు రాజీబాట తీసుకుని పెళ్లి చేసుకుని పిల్లలను కనడానికి మాత్రమే పరిమితమవుతున్నారు.

వాళ్లలో ఉన్న ప్రతిభను వాళ్ళే గుర్తించలేనంత అజ్ఞానంలో మగ్గిపోతున్నారు. వారికి కావలసింది చేయూత. గుంజన్ కు నిజ జీవితంలో నాన్న, ఉద్దంపూర్ ఎయిర్ ఫోర్సు క్యాంప్లో పై అధికారి దాన్ని ఇచ్చారు. అలా విద్వత్తును గుర్తించే వాళ్ళు ఉన్నంత కాలం స్త్రీలు అద్భుతాలు చేస్తారు. గుంజన్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. ఆటుపోట్లు, అవమానాలకు గురి చేసినవాళ్ళే అభివందనం చేసే రోజు రావాలంటే శత్రువులతో కన్నా ముందు మన చుట్టూ ఉన్న అసమానతల మీద యుద్ధం చేయాలి. గుంజన్ లైఫ్ దానికో మంచి ఉదాహరణ

అమిత్ త్రివేది పాటలు పర్వాలేదు. గొప్పగా అనిపించవు. ఇంత మంచి నేపధ్యానికి తగ్గినట్టు ట్యూన్స్ ఇచ్చి ఉంటే పదే పదే వినాల్సిన ఇన్స్ పిరేషనల్ సాంగ్స్ వచ్చేవి. కాని దర్శకుడికే సంగీతం మీద అంత ఫోకస్ లేదు కాబోలు జస్ట్ ఓకే అనిపించే అవుట్ పుట్ వచ్చింది. జాన్ స్టివార్ట్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. రోమాలు నిక్కబోడుచుకునే సీన్స్ లో కూడా వాహ్ అనిపించలేకపోయాడు. దీనివల్లే కొన్ని ఎపిసోడ్స్ లో డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది.

మనుష్ నందన్ ఛాయాగ్రహణం నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది. కథానుసారంగా మారే లొకేషన్స్ ని, క్లైమాక్స్ లో వచ్చే వార్ సీక్వెన్స్ ని సూపర్బ్ గా చూపించారు. నితిన్ బయిద్ ఎడిటింగ్ బాగుంది. రెండు గంటల లోపే ముగించేశారు. గుంజన్ క్యాంప్ లో చేరిన మొదట్లో వాష్ రూమ్ లో చేసిన హడావిడి తాలుకు గొడవని కట్ చేసినట్టుగా తర్వాత వచ్చే డైలాగులను బట్టి అర్థం అవుతుంది. ఇలాంటి కోతలు హెల్ప్ అయ్యాయి. ధర్మా-జీ సంస్థల ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయి.

ప్లస్ గా అనిపించేవి

జాన్వీ కపూర్
పంకజ్ త్రిపాఠి
ఎమోషన్స్
టేకింగ్
తక్కువ నిడివి

మైనస్ గా తోచేవి

కొంతమేర సంగీతం
వార్ సీన్స్ తక్కువ అనిపించడం

కంక్లూజన్

బాష ఏదైనా సృజనాత్మకతకు హద్దులు లేనిది సినిమానే. జనంలో బలంగా చొచ్చుకుపోయే శక్తివంతమైన మాధ్యమంగా ఉన్న దీని ద్వారా ఎందరో దర్శకులు నిర్మాతలు కమర్షియల్ సూత్రాలకు లోబడి ఫార్ములా మూవీస్ తీస్తూ వచ్చారు. కానీ గత కొంత కాలంగా విజయవంతమైన వ్యక్తుల కథలను బయోపిక్స్ గా తీసే ట్రెండ్ ఊపందుకున్న తరుణంలో గుంజన్ సక్సేనా లాంటి స్ఫూర్తినిచ్చే అమ్మాయిల జీవితాలను ఇలా తెరమీద తీసుకురావడం ఎంతైనా హర్షణీయం. దానికి ప్రేక్షకుల మద్దతు దొరికినప్పుడే మరికొన్ని వచ్చే అవకాశం ఉంది. థియేటర్ల దాకా వెళ్లకుండా ఇంట్లోనే చూసే సౌలభ్యం ఉన్నప్పుడు వీటి వల్ల నిరాశ చెందే అవకాశం చాలా తక్కువ. అందుకే మీ రెండు గంటల సమయాన్ని గుంజన్ వృధా కానివ్వదని మాత్రం ఖచ్చితంగా హామీ ఇవ్వొచ్చు

గుంజన్ సక్సేనా – సక్సెస్ గర్ల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి